సీఎం రేవంత్‌ పై కేటీఆర్ విమర్శలు

- November 15, 2026 , by Maagulf
సీఎం రేవంత్‌ పై కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని, అది ‘ఆత్మగౌరవం’ ప్రాతిపదికన ఏర్పాటైన రాష్ట్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే జాతీయ పార్టీలైన కాంగ్రెస్ మరియు బీజేపీలు ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని ఏనాడూ గుర్తించలేదని, ఎప్పటికీ అర్థం చేసుకోలేవని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు మరియు అధికార పార్టీ నేతల ప్రవర్తనా సరళిపై ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ వెంట పరిగెత్తడంపై విమర్శలు–పీసీసీ చీఫ్ వివరణ

హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లతో కలిసి రాహుల్ గాంధీ నిర్వహించిన బైక్ ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ నాయకుల తీరుపై కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గాంధీ కుటుంబానికి ఒక బాడీగార్డులా వ్యవహరిస్తున్నారని, పీసీసీ అధ్యక్షుడు మరియు మంత్రులు సైతం రాహుల్ బైక్ వెనుక నౌకర్ల మాదిరిగా పరుగులు తీశారని ధ్వజమెత్తారు. కాగా, ఈ విమర్శలపై టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. తాను బైక్‌పై వెళ్తుండగా వాహనం స్కిడ్ అయిందని, రాహుల్ గాంధీ గమనించి పక్కకు పిలిచారని తెలిపారు. తాను శారీరకంగా ఫిట్‌గా ఉండటం వల్లనే అలా పక్కనే పరిగెత్తానని, దాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నానని వివరణ ఇచ్చారు.

బీజేపీ నేతల తీరుపై కూడా కేటీఆర్ మండిపాటు

కేవలం కాంగ్రెస్‌నే కాకుండా బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా కేటీఆర్ తప్పుపట్టారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గతంలో అమిత్ షా పాదాలకు నమస్కరించడం, ఆయన చెప్పులు మోయడం వంటి ఘటనలను ప్రస్తావిస్తూ ఇవి అత్యంత సిగ్గుచేటైన, అనుచితమైన చర్యలని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా ఈ రెండు జాతీయ పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు వచ్చినా వాటికి తగిన హుందాతనం, గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

అధికారిక కార్యక్రమాల్లో రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ అభ్యంతరం


ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొనడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని నీతులు చెప్పే కాంగ్రెస్ నేతలు, ముందుగా రాజ్యాంగ విలువలను, ప్రొటోకాల్‌ను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికింది. ఏ హోదాలో, ఏ నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను, గిగ్ వర్కర్ల సంక్షేమ ప్యాకేజీలను ప్రకటిస్తున్నారని బీఆర్ఎస్ నిలదీసింది. ప్రభుత్వం నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’ ముగింపు సభ మరియు ఇతర అధికారిక వేదికలను రాజకీయ వేదికలుగా మార్చడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com