కువైట్‌లో వాహన బీమా పాలసీలకు కొత్త నిబంధనలు..!!

- November 16, 2026 , by Maagulf
కువైట్‌లో వాహన బీమా పాలసీలకు కొత్త నిబంధనలు..!!

కువైట్: వాహనాల సమగ్ర బీమా (Comprehensive Motor Insurance) పాలసీలకు సంబంధించి కువైట్ ప్రభుత్వం కీలకమైన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వాహనాల విలువ నిర్ధారణ, ప్రమాదాల సమయంలో పరిహారం చెల్లింపు, మరమ్మతులు, క్లెయిమ్‌ల పరిష్కారం, పాలసీల రద్దు వంటి అంశాల్లో స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. బీమా కంపెనీలు ఇష్టానుసారంగా పరిహారంలో కోతలు విధించకుండా పాలసీదారులకు రక్షణ కల్పించడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమని ప్రకటించారు.

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ జారీ చేసిన రిజల్యూషన్ నంబర్ 53 ఆఫ్ 2026ను అధికారిక గెజిట్ లో ప్రచురించారు. కొత్త నిబంధనల ప్రకారం బీమా పాలసీ జారీ చేసే సమయంలోనే వాహనం సరైన విలువను నిర్ధారించాలి. ఇందుకోసం వాహనం కొనుగోలు ఇన్‌వాయిస్, అనుభవం ఉన్న సంస్థలు లేదా వ్యక్తుల నుంచి తీసుకున్న మూడు ధరల కొటేషన్ల సగటు లేదా అధీకృత డీలర్ ఇచ్చిన అధికారిక వాల్యుయేషన్ లేఖను ప్రామాణికంగా తీసుకోవాలి. నిర్ధారించిన వాహన విలువ ఆధారంగానే బీమా ప్రీమియాన్ని లెక్కించాలి.

ప్రమాదం తర్వాత పరిహారం చెల్లించడానికి వీల్లేదు

పాలసీ జారీ చేసిన తర్వాత లేదా ప్రమాదం జరిగిన అనంతరం అప్పటి మార్కెట్ విలువను చూపిస్తూ వాహనం విలువను తిరిగి అంచనా వేసి పరిహారాన్ని తగ్గించడానికి బీమా కంపెనీలకు అనుమతి ఉండదు. అయితే మోసం, తప్పుడు సమాచారం లేదా కీలకమైన పొరపాటు జరిగినట్లు నిరూపితమైతే మినహాయింపు ఉంటుంది. బీమా పాలసీలోని పదజాలం లేదా వివరణ కారణంగా ఏదైనా సందిగ్ధత ఏర్పడితే, దానిని బీమా కంపెనీకి కాకుండా పాలసీదారుడికి అనుకూలంగా అర్థం చేసుకోవాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

వాహనాల తనిఖీ తప్పనిసరి

బీమా పాలసీ జారీ చేయడానికి ముందు కంపెనీలు వాహనాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేసి, ఫొటోలు తీసి, దాని ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ నివేదిక సిద్ధం చేయాలి. అయితే తనిఖీ నివేదికలో పేర్కొన్న పాత నష్టాలను కారణంగా చూపి క్లెయిమ్‌ను తిరస్కరించడం లేదా పరిహారాన్ని తగ్గించడం కుదరదు. పాలసీలో ఆ నష్టాలకు స్పష్టంగా మినహాయింపు ఇచ్చిన సందర్భాల్లో మాత్రమే అలా చేయవచ్చు.

అలాగే పాలసీ షెడ్యూల్‌లో స్పష్టంగా పేర్కొనని డిడక్టబుల్స్, ఇతర ఛార్జీలు లేదా ఫీజులను వాహనదారుల నుంచి వసూలు చేయకూడదు. వాహనాన్ని తరలించడానికి లేదా నిల్వ చేయడానికి అయ్యే ఖర్చులను కూడా పాలసీదారులపై వేయరాదు. అయితే ఆలస్యం పాలసీదారుడి చర్యల వల్లే జరిగిందని నిరూపించి, ముందుగా సమాచారం ఇచ్చిన సందర్భంలో మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది.

క్లెయిమ్‌ల తిరస్కరణకు కారణాలు చెప్పాల్సిందే

బీమా క్లెయిమ్ సమర్పించిన వారికి కంపెనీలు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి. అందులో క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్, దరఖాస్తు సమర్పించిన తేదీ ఉండాలి. క్లెయిమ్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా తిరస్కరిస్తే అందుకు సంబంధించిన కారణాలను కూడా బాధితులకు తెలియజేయాలి. వాహనం పూర్తిగా సాంకేతికంగా పనికిరాకపోవడం లేదా ఆర్థికంగా మరమ్మతు చేయడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడినప్పుడే దానిని టోటల్ లాస్‌గా పరిగణిస్తారు. ఒకే వాహనం ప్రమేయం ఉన్న ప్రమాదంలో టోటల్ లాస్ జరిగితే, వాహన శిథిలాల విలువ లేదా వాటిని విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తానికి అనుగుణంగా డిడక్టబుల్‌లోని అదే శాతాన్ని పాలసీదారుడికి చెల్లించాల్సి ఉంటుంది.

పాలసీ రద్దు చెస్తే ప్రీమియం తిరిగి ఇవ్వాలి

బీమా కంపెనీ పాలసీని రద్దు చేస్తే, అందుకు సరైన కారణం ఉండాలి. మిగిలిన బీమా కాలానికి సంబంధించిన ప్రీమియాన్ని ఎలాంటి పరిహార మొత్తాన్ని మినహాయించకుండా తిరిగి చెల్లించాలి. అంతేకాకుండా నోటీసు వ్యవధి ముగిసే వరకు బీమా రక్షణ కొనసాగించాలి.

QR కోడ్ లేకుండా పాలసీలు జారీ చేయరాదు

కొత్త నిబంధనల్లో మరో ముఖ్యమైన మార్పు QR కోడ్‌ను తప్పనిసరి చేయడం. తీర్మానం అధికారికంగా ప్రచురితమైన 90 రోజుల తర్వాత QR కోడ్ లేని బీమా పాలసీలను జారీ చేయడానికి కంపెనీలకు అనుమతి ఉండదు. ఈ కోడ్ ద్వారా పాలసీ వివరాలు, దాని చెల్లుబాటును ధ్రువీకరించుకోవచ్చు. మూడు లేదా అంతకంటే ఎక్కువ వాహనాలు ఉన్న సంస్థలు, వాహన సముదాయాల కోసం ఒకే బీమా డాక్యుమెంట్ జారీ చేసుకునే వెసులుబాటును కూడా కొత్త నిబంధనలు కల్పిస్తున్నాయి.

నిబంధనలను ఉల్లంఘించే బీమా కంపెనీలపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ చర్యలు తీసుకోవచ్చు. పాలసీ డాక్యుమెంట్ల నమూనాలను సవరించాలని ఆదేశించడం, నిబంధనలకు విరుద్ధమైన పత్రాల జారీని నిలిపివేయడం, అక్రమంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలని ఆదేశించే అధికారం ఈ సంస్థకు ఉంటుంది. ఈ కొత్త తీర్మానం జారీ చేసిన తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com