ఖతార్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!

- November 16, 2026 , by Maagulf
ఖతార్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!

దోహా: ఖతార్‌లో చలిగాలుల ప్రభావం పెరుగుతోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ శాఖ (QMD) వెల్లడించింది. పగటిపూట వాతావరణం మోస్తరుగా ఉండనుండగా, రాత్రివేళ చలి ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

వాతావరణ శాఖ రోజువారీ అంచనాల ప్రకారం.. మసాయీద్, అబూ సమ్రా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 17°Cగా, అల్ ఖోర్‌లో 18°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. దోహా, దుఖాన్, అల్ వక్రా, అల్ రువైస్ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 21°Cగా ఉండనుంది. ఇక గరిష్ఠ ఉష్ణోగ్రతలు దోహా, అల్ వక్రా, మసాయీద్‌లో 28°Cకు చేరుకోనున్నాయి. అల్ ఖోర్‌లో 27°C, అబూ సమ్రాలో 26°C, దుఖాన్, అల్ రువైస్‌లో 25°C వరకు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.

మరోవైపు సముద్రంలో బలమైన గాలులు, అలల ఉద్ధృతి కారణంగా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గంటకు 10 నుంచి 20 నాట్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సముద్ర అలల ఎత్తు సాధారణంగా 3 నుంచి 6 అడుగుల మధ్య ఉండగా, పగటిపూట 8 అడుగులకు పెరిగే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 5 నుంచి 15 నాట్ల వేగంతో గాలులు వీయనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు గాలి వేగం 25 నాట్లకు చేరవచ్చు. తీర ప్రాంతాల్లో అలల ఎత్తు 1 నుంచి 4 అడుగుల మధ్య ఉండగా, పగటిపూట 5 అడుగులకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com