బహ్రెయిన్‌లో హౌసింగ్ ఫైనాన్సింగ్‌కు భారీ స్పందన..!!

- November 16, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో హౌసింగ్ ఫైనాన్సింగ్‌కు భారీ స్పందన..!!

మనామా: బహ్రెయిన్‌లో ప్రభుత్వం అందిస్తున్న హోమ్ లోన్, హౌసింగ్ ఫైనాన్సింగ్ పథకాలకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. 2022 ఆగస్టులో ఈ పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి 2026 మూడో త్రైమాసికం ముగిసే నాటికి మొత్తం 23,632 దరఖాస్తులు అందినట్లు హౌసింగ్, పట్టణ ప్రణాళికల శాఖ మంత్రి అమ్నా బింట్ అహ్మద్ అల్ రుమైహి వెల్లడించారు. ఇందులో 2026 తొలి తొమ్మిది నెలల్లోనే 4,095 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

తక్షణ హోమ్ ఫైనాన్సింగ్ పొందిన లబ్ధిదారుల్లో 80 శాతానికి పైగా గతంలో సంప్రదాయ గృహ నిర్మాణ పథకాల కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నవారేనని మంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త పథకాల ద్వారా ప్రజలకు ప్రత్యామ్నాయ గృహ సదుపాయాలు అందడంతో పాటు నిరీక్షణ సమయం తగ్గుతోందని వివరించారు.

ఫైనాన్సింగ్ పథకాలలో 'తస్హీల్ అకారీ' అత్యంత ప్రజాదరణ పొందిన పథకంగా కొనసాగుతోంది. 'తస్హీల్+' పథకానికి కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 1,800కు పైగా దరఖాస్తులు వచ్చాయి. 2025లో ప్రారంభించిన తస్హీల్+ ద్వారా గరిష్ఠంగా BD91,000 వరకు ఫైనాన్సింగ్ పొందవచ్చు. ఈ మొత్తంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేయడంతో పాటు నివాస స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకోవచ్చు.

ఇక 'తస్హీల్ అల్ బైత్ అల్ ఊద్', 'తస్హీల్ తఆవున్', 'మజాయా' పథకంలో కొత్తగా ప్రవేశపెట్టిన విభాగానికి కూడా ప్రజల నుంచి ఆసక్తి పెరుగుతోందని మంత్రి తెలిపారు. అలాగే 'తుమూహ్' పథకం ద్వారా ఇప్పటికే హోమ్ లోన్ పొంది కనీసం 10 సంవత్సరాలు పూర్తిచేసుకున్న వారికి అదనపు ఫైనాన్సింగ్ అందిస్తున్నారు. దీని ద్వారా కుటుంబ అవసరాలకు అనుగుణంగా మెరుగైన అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసుకునే అవకాశం కలుగుతోంది.

గృహ నిర్మాణ అవకాశాలను విస్తరించేందుకు వాణిజ్య బ్యాంకులు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు సహకరిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. 'బైతి' డిజిటల్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులో ఉన్న గృహ ప్రాజెక్టులు, యూనిట్ల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లోనే ఫైనాన్సింగ్, బుకింగ్ సేవలు పొందవచ్చని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com