యూఏఈ నేషనల్ డేకి దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల సెలవులు

- November 17, 2026 , by Maagulf
యూఏఈ నేషనల్ డేకి దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల సెలవులు

డిసెంబర్ 2 నుంచి 4 వరకు మూడు రోజుల అధికారిక సెలవు.. వారాంతంతో కలిపి లాంగ్ వీకెండ్

దుబాయ్: యూఏఈ 55వ నేషనల్ డే(ఈద్ అల్ ఎతిహాద్) సందర్భంగా దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల లాంగ్ వీకెండ్ లభించనుంది. ఈ మేరకు దుబాయ్ ప్రభుత్వం మంగళవారం సెలవులను ప్రకటించింది.

దుబాయ్ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు డిసెంబర్ 2, బుధవారం నుంచి డిసెంబర్ 4, శుక్రవారం వరకు మూడు రోజుల పాటు అధికారిక సెలవులు ఉండనున్నాయి. సాధారణ వారాంతపు సెలవులైన శని, ఆదివారాలు కలిపి మొత్తం ఐదు రోజుల విరామం లభించనుంది. డిసెంబర్ 7, సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం (DGHR) వెల్లడించింది.

ఇదిలా ఉండగా, యూఏఈ మానవ వనరులు, ఎమిరైటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) కూడా ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో మూడు రోజుల సెలవులను ప్రకటించింది. ఫెడరల్ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు కూడా డిసెంబర్ 7 నుంచి సాధారణ కార్యకలాపాలను పునఃప్రారంభించనున్నాయి.

ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈ ఏడాది నేషనల్ డే సందర్భంగా డిసెంబర్ 2, 3 తేదీల్లో రెండు రోజుల సెలవులు ప్రకటించారు.

ఘనంగా 55వ నేషనల్ డే వేడుకలు

ప్రతి ఏడాది డిసెంబర్ 2, 3 తేదీల్లో యూఏఈ నేషనల్ డేని 'ఈద్ అల్ ఎతిహాద్' పేరుతో జరుపుకుంటారు. 1971లో ఏడు ఎమిరేట్లు కలిసి యూనియన్‌గా ఏర్పడిన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ దేశవ్యాప్తంగా పౌరులు, ప్రవాసులు ఐక్యత, వారసత్వం, అభివృద్ధిని వేడుకగా జరుపుకుంటారు.

ఈ ఏడాది వేడుకల్లో కుటుంబాలు, వివిధ తరాలు, సమాజాల పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గత 55 ఏళ్లలో దేశ ప్రగతి ప్రయాణాన్ని తీర్చిదిద్దిన ఉమ్మడి విలువలు, సంప్రదాయాలు, అనుభవాలను వేడుకల్లో ప్రతిబింబించనున్నారు.

2026ను యూఏఈ 'కుటుంబ సంవత్సరంగా' (Year of the Family) ప్రకటించిన నేపథ్యంలో కుటుంబ ఐక్యత, బలమైన కుటుంబ సంబంధాల ప్రాముఖ్యతను కూడా ఈ ఏడాది  నేషనల్ డే వేడుకల్లో ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com