డీఎస్పీలు, అదనపు ఎస్పీల పదోన్నతుల సమస్యకు తెర..డీజీపీ ఆనంద్ చొరవతో పరిష్కారం
- November 17, 2026
డీజీపీ సీవీ ఆనంద్ చొరవతో దీర్ఘకాలిక ప్రతిష్టంభనకు తెర.. తొలుత 1991 బ్యాచ్‌కు పదోన్నతులు
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన డీఎస్పీలు, అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారుల దీర్ఘకాలిక పదోన్నతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కార మార్గం లభించింది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చొరవతో ఈ సమస్య పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. దీంతో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఊరట లభించింది.
గతంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో పదోన్నతులకు సంబంధించిన సంక్లిష్టతలను డీజీపీ వివరించారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు అధికారుల సహకారం కోరారు. దీనికి స్పందించిన అధికారులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న తమ కేసులను ఉపసంహరించుకున్నారు. డీజీపీ నిర్ణయాలపై పూర్తి విశ్వాసం ఉందని, తమకు ప్రతికూలంగా నిర్ణయం వచ్చినప్పటికీ తదుపరి న్యాయపరమైన చర్యలకు వెళ్లబోమని అఫిడవిట్లు కూడా సమర్పించారు.
వంద శాతం మంది అధికారులు అంగీకారం తెలిపిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం మరోసారి వారితో సమావేశమయ్యారు.
సీనియారిటీ, ఖాళీల పై సమగ్ర పరిశీలన
గత కొన్ని నెలలుగా డీజీపీ కార్యాలయం, ఐజీ (పర్సనల్)తో కూడిన కమిటీ పదోన్నతులకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా కసరత్తు చేసింది. సీనియారిటీ జాబితాలు, వాటిలోని వ్యత్యాసాలు, ప్రభుత్వ ఉత్తర్వులు (GOs), పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను సమగ్రంగా పరిశీలించింది.
ఈ సమావేశంలో కమిటీ చేసిన సిఫార్సులను డీజీపీ అధికారులకు వివరించారు. అందుబాటులో ఉన్న ఖాళీల వివరాలతో పాటు, తొలిసారిగా ప్రతి అధికారి పేరుతో ప్రత్యేకంగా ప్రతిపాదించిన పదోన్నతి, అది అమల్లోకి వచ్చే తేదీ వివరాలను కూడా వెల్లడించారు.
కమిటీ సిఫార్సులకు అధికారులందరూ ఏకగ్రీవంగా అంగీకారం తెలపడంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది.
దశలవారీగా పదోన్నతుల ప్రక్రియ
ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రత్యేకంగా కసరత్తు చేపట్టకపోతే, పలువురు అధికారులు తమకు రావాల్సిన పదోన్నతులు పొందకుండానే ప్రస్తుత హోదాల్లో పదవీ విరమణ చేయాల్సి వచ్చేదని అధికారులు పేర్కొన్నారు.
తాజా నిర్ణయానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించిన అనంతరం పదోన్నతుల ప్రక్రియను దశలవారీగా చేపట్టనున్నారు. తొలుత 1991 బ్యాచ్ అధికారులతో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈ ప్రక్రియకు సహకరించి, పరస్పర అంగీకారంతో సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చిన అధికారులను డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు. పోలీస్ శాఖలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్య పరిష్కారం దిశగా ఈ పరిణామం కీలకంగా నిలిచింది.
తాజా వార్తలు
- భారత్–ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- డీఎస్పీలు, అదనపు ఎస్పీల పదోన్నతుల సమస్యకు తెర..డీజీపీ ఆనంద్ చొరవతో పరిష్కారం
- ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్..
- యూఏఈ నేషనల్ డేకి దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల సెలవులు
- సౌదీ అరేబియాలో పేపర్ మిడిల్ ఈస్ట్ ఎగ్జిబిషన్..భారత పెవిలియన్‌ను ప్రారంభించిన కాన్సుల్ జనరల్
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- శుభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ‘టుగెదర్ రీలోడెడ్’ సంగీత విభావరి
- అబుదాబి హోటల్లో ఘర్షణ కేసు.. 8 మంది నిందితులకు ఊరట..!!
- సౌదీలో కార్మికులను ఇతరులకు అప్పగిస్తే.. యజమానులకు 6 నెలల జైలు..!!
- ఒమన్‌లో కీలక రహదారులపై ట్రక్కుల రాకపోకలపై నిషేధం..!!







