సాగరంలో సేతువు నిర్మాణం..
- August 29, 2016
ఆనాడు సీత కోసం లంకకు వానరసేన సముద్రంలో వారధి నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇరు దేశాలను రోడ్డు మార్గం ద్వారా కలిపేందుకు వంతెన నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు బడ్జెట్ అంచనాలు సైతం సిద్ధం చేసి అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది ఇరు దేశాల పరస్పర సహకారంతో చేపట్టాల్సిన ప్రాజెక్టు కావడంతో శ్రీలంక ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ప్రయత్నాలు చేపట్టింది.శ్రీలంక ద్వంద్వవైఖరి అవలంబిస్తుండటంతో ప్రస్తుతం ఈ వ్యవహారం ఇరుదేశాల మధ్య ఆసక్తి రేపుతోంది. భారత్-శ్రీలంక మధ్య వారధి అనేది పురాణాల కాలంలోనే సాధ్యపడినట్లు రామాయణం చెబుతోంది. తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు సముద్రంలో అస్పష్టంగా కనిపించేదే రామసేతు అని భావిస్తుంటారు. డీఎంకే హయాంలో సేతు ప్రాజెక్టు కోసం 'రామసేతు'లోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో అప్పట్లో అతిపెద్ద దుమారాన్ని రేపింది. ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు అటకెక్కింది. రామసేతు వ్యవహారం ఎలా ఉన్నా... ప్రస్తుతం 'హనుమాన్ సేతువు' తెరపైకి వచ్చింది. భారత్-శ్రీలంక మధ్య వంతెన నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం స్పష్టం చేయడంతో పాటు రూ.22 వేల కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు సుముఖంగా ఉందని కూడా ఆయన ప్రకటించారు. రోడ్డుమార్గం అందుబాటులోకి వస్తే రవాణా ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయని, ఇరుదేశాల వ్యాపారులకూ ఈ మార్గం ఉపయుక్తంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.శ్రీలంక ద్వంద్వ వైఖరి ఈ ప్రాజెక్టుపై శ్రీలంక ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే భారత్ పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి ఆయనతో చర్చించామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. భారత్ తనకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని శ్రీలంక పార్లమెంట్‌లో, దాని బయట జరిగిన విలేకర్ల సమావేశంలోనూ రణిల్ విక్రమసింఘే తెలిపారు. ఇండోనేషియాలో జరిగిన ఇస్లామియా ఆర్థిక సదస్సులో పాల్గొన్న శ్రీలంక మంత్రి కబీర్ కాశీం మాత్రం వంతెన నిర్మాణ సాధ్యాసాధ్యాలపై భారత్, శ్రీలంక చర్చిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలా ఒకే దేశానికి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు విభిన్న గళం వినిపించడం పలు అనుమానాలకు తెరలేపింది. ఇరుదేశాల మధ్య వంతెన నిర్మాణానికి శ్రీలంక పౌరుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ దేశ ప్రధాని వెనక్కు తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీలంకలోని తమిళుల ప్రాంతాలను భారత్‌తో అనుసంధానం చేసేందుకే 'హనుమాన్ వంతెన' నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు ఆందోళనలు చేయడంతో 'వంతెన నిర్మించే దేశద్రోహ చర్యలను తన ప్రభుత్వం చేయబోద'ంటూ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు. ఇరుదేశాల మధ్య వారధి నిర్మిస్తే భారత్ నుంచి యథేచ్ఛగా అక్రమ చొరబాట్లు పెరిగిపోతాయని, దీంతో శ్రీలంకలో ఉద్యోగాలకు స్థానికులు ఇబ్బందులు పడతారనే విమర్శలూ ఉన్నాయి.మహాకవి కల తమిళ మహాకవి భారతియార్ శ్రీలంకకు వారధి నిర్మించడం గురించి అప్పట్లోనే కలలు కన్నారు. 'సింగళ దీవినుకోర్ పాలం అమైప్పోం' (( సింహాళ (శ్రీలంక) దీవికొక వంతెను నిర్మిద్దాం )) అంటూ వాగ్గేయమూ చేశారు. భారత్-శ్రీలంక మధ్య వారధి నిర్మాణం ద్వారా ఆయన కల సాకారమైనట్లేనని పలువురు తమిళ నేతలు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు నౌకాయాన సేవలను 50 ఏళ్ల క్రితం నిలిపివేసిన నేపథ్యంలో ప్రస్తుతం పునరుద్ధరించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







