బహ్రెయిన్‌లో ప్రవాస కార్మికుల విద్యార్హతలపై కఠిన తనిఖీలు..!!
- November 21, 2026
మనామా: బహ్రెయిన్‌లో ఉద్యోగాలు పొందేందుకు నకిలీ విద్యార్హతలు, ట్రేడ్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రవాస కార్మికుల అర్హతల తనిఖీలను మరింత కఠినతరం చేయాలని ఆ దేశ పార్లమెంట్ సభ్యులు ప్రతిపాదించారు. విదేశీ కార్మికులు ఉద్యోగాల్లో చేరకముందే వారి విద్యార్హతలు, వృత్తిపరమైన ధ్రువపత్రాలను సంబంధిత ప్రభుత్వ శాఖలు ధ్రువీకరించాలని కోరుతున్నారు. ఐదుగురు ఎంపీలు మహమ్మద్ జనాహి, పార్లమెంట్ రెండో డిప్యూటీ స్పీకర్ అహ్మద్ ఖరాతా, హిషామ్ అల్ అవాధి, మునీర్ సురూర్, హనన్ ఫర్దాన్ ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. పార్లమెంట్ సేవల కమిటీ ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. వచ్చే మంగళవారం జరిగే పార్లమెంట్ సమావేశంలో దీనిపై చర్చించి ఓటింగ్ నిర్వహించనున్నారు.
మూడు ప్రభుత్వ శాఖలతో ప్రత్యేక బృందం
ఈ ప్రతిపాదన ప్రకారం కార్మిక మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రతినిధులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి. విదేశీ కార్మికులు విధుల్లో చేరకముందే వారి డిగ్రీలు, వృత్తి నైపుణ్య ధ్రువపత్రాలను ఈ బృందం పరిశీలించాలి. మూడు శాఖల మధ్య సమాచార మార్పిడి కోసం ప్రత్యేక కేంద్రీకృత డేటాబేస్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఎంపీలు సూచించారు. నకిలీ సర్టిఫికెట్లతో అర్హత లేని వ్యక్తులు కీలక ఉద్యోగాల్లో చేరితే ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లడంతో పాటు సేవల నాణ్యత కూడా తగ్గుతుందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ శాఖల వివరణ
ఈ ప్రతిపాదనపై కార్మిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. బహ్రెయిన్ ప్రైవేట్ రంగ కార్మిక చట్టం ప్రకారం అన్ని ఉద్యోగాలకు విదేశీ కార్మికులు విద్యార్హత సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. వృత్తిపరమైన లైసెన్స్ తప్పనిసరైన ఉద్యోగాలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని వివరించింది. మిగతా ఉద్యోగాల విషయంలో నియమించుకునే వ్యక్తులకు అవసరమైన నైపుణ్యాలు, శిక్షణ, అనుభవం ఉన్నాయో లేదో పరిశీలించాల్సిన బాధ్యత యజమానులదేనని పేర్కొంది. అయితే 20 సాంకేతిక వృత్తులను ప్రత్యేక నిబంధనల పరిధిలోకి తీసుకురావడానికి స్కిల్స్ బహ్రెయిన్, తమ్కీన్ , LMRA, బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
మరోవైపు, వృత్తిపరమైన లైసెన్స్ అవసరమైన ఉద్యోగాలకు ఇప్పటికే కఠినమైన తనిఖీలు అమలులో ఉన్నాయని LMRA తెలిపింది. సంబంధిత అధికార సంస్థ నుంచి లైసెన్స్ పొందిన తర్వాతే విదేశీ కార్మికులకు అలాంటి ఉద్యోగాలకు వర్క్ పర్మిట్లు జారీ అవుతాయని స్పష్టం చేసింది. ఉద్యోగ మార్పు సమయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. 2008 నాటి డెసిషన్ నంబర్ 76 ప్రకారం ఈ తనిఖీలు చట్టబద్ధంగా అమలవుతున్నాయని, వీటిని ప్రత్యేక కమిటీ నిర్ణయాధికారానికి వదిలేయలేమని LMRA వివరించింది.
ఉపాధ్యాయుల సర్టిఫికెట్లకు ఇప్పటికే తనిఖీలు
విద్యా మంత్రిత్వ శాఖ కూడా తమ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, పరిపాలనా సిబ్బంది నియామకాల సమయంలో సమర్పించే అర్హత పత్రాలను ఎలక్ట్రానిక్ విధానంలో తనిఖీ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక సంస్థలు సంబంధిత విశ్వవిద్యాలయాలు, సర్టిఫికెట్లు జారీ చేసిన సంస్థలను నేరుగా సంప్రదించి ధ్రువీకరిస్తున్నాయని పేర్కొంది. అవసరమైతే ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఇలాంటి అర్హతల తనిఖీల్లో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్ యువతకు శుభవార్త..!!
- బహ్రెయిన్‌లో ప్రవాస కార్మికుల విద్యార్హతలపై కఠిన తనిఖీలు..!!
- వారం రోజుల్లో 1,903 ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లను స్వాధీనం చేసుకున్న దుబాయ్ పోలీసులు
- Dubai Police Impound 1,903 Electric Bikes and Scooters in One Week, Warn Against Dangerous Stunts
- నేపాల్ పై భారత్-ఎ 306 పరుగుల చారిత్రక విజయం!
- ఒమన్ జాతీయ దినోత్సవ వేడుకలు..GCC దేశాల్లో ఒమన్ జెండా రంగులతో మెరిసిన భవనాలు
- ఒమన్ 56వ జాతీయ దినోత్సవ వేడుకలు..ఒమన్ ప్రయాణికులకు షార్జా విమానాశ్రయం ప్రత్యేక స్వాగతం
- ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు రోడ్ షోల్డర్ పై వాహనాలు నడిపితే జరిమానా..
- ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్..
- షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమికి విజయవంతంగా శస్త్రచికిత్స







