ఒమన్ యువతకు శుభవార్త..!!

- November 21, 2026 , by Maagulf
ఒమన్ యువతకు శుభవార్త..!!

మస్కట్: ఒమన్ యువతకు శిక్షణ, వృత్తి నైపుణ్యాలు అందించి ఉద్యోగాలకు సిద్ధం చేసే లక్ష్యంతో కార్మిక శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా జాతీయ శిక్షణ, అర్హత కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఒమన్ యువత సామర్థ్యాలను పెంపొందించడం, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ సేవలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమానికి సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు ఆమోదం తెలిపారు. 

ఒమన్ లోని యువ ప్రతిభను ప్రోత్సహించి, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను అందించాలన్న సుల్తాన్ సంకల్పానికి ఇది నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు సైనిక శిక్షణతో పాటు క్రమశిక్షణ, జాతీయ బాధ్యత వంటి విలువలను బోధిస్తారు. అదే సమయంలో ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వృత్తి, సాంకేతిక, పరిపాలనా రంగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తారు. తద్వారా వివిధ రంగాల్లో సమర్థంగా పనిచేయగల నైపుణ్యం కలిగిన స్థానిక యువతను తయారు చేయనున్నారు.

కార్మిక శాఖ, రక్షణ శాఖ సమన్వయంతో అమలు కానున్న ఈ కార్యక్రమం ద్వారా యువతకు నాణ్యమైన శిక్షణ అవకాశాలు కల్పించడంతో పాటు దేశ సమగ్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని పెంచనున్నారు. యువత తమ వృత్తిపరమైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు కూడా ఇది దోహదపడనుంది. ఈ కార్యక్రమంలో తొలుత రిజిస్ట్రేషన్, ప్రవేశ ప్రక్రియ, అర్హతల పరిశీలన నిర్వహిస్తారు. నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అనంతరం సైనిక శిక్షణ అందించి, ఆ తర్వాత ఎంపిక చేసిన వృత్తి, సాంకేతిక, పరిపాలనా విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా దేశానికి సేవ చేయగల, బాధ్యతాయుతమైన, నైపుణ్యం కలిగిన యువతరం తయారవుతుందని ఒమన్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. దేశాభివృద్ధిలో యువత పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు విధేయత, దేశభక్తి, క్రమశిక్షణ వంటి విలువలను పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని కార్మిక శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com