దుబాయ్ రైడ్‌లో భారతీయుడికి Dh10,000 బహుమతి..!!
- November 22, 2026
దుబాయ్: స్నేహితుడి నుంచి అప్పుగా తీసుకున్న సైకిల్.. దాని అలంకరణ కోసం ఖర్చు చేసింది కేవలం Dh300. కానీ తన సృజనాత్మక ఆలోచనతో ఏకంగా Dh10,000 బహుమతిని గెలుచుకున్నాడు ఓ భారతీయ ప్రవాసి. యూఏఈ పట్ల తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్న ఈ భారతీయుడికి దుబాయ్ రైడ్ పోటీలో అవార్డు దక్కింది.
దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్‌లో భాగంగా నిర్వహించిన 'డ్రెస్ యువర్ రైడ్' పోటీలో దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేస్తున్న మోహన్ చౌహాన్ విజేతగా నిలిచాడు. 'బెస్ట్ ఓవరాల్ బైక్' విభాగంలో ఆయనకు ఈ బహుమతి లభించింది. విజేతలకు ఒక్కొక్కరికి Dh10,000 చొప్పున అందించారు.
సైకిల్ అలంకరణ
భారతదేశానికి వెళ్లిన తన స్నేహితుడి నుంచి సైకిల్‌ను అప్పుగా తీసుకున్న మోహన్, దానిని ఎలా అలంకరించాలనే ఆలోచనతో కొన్ని రోజులు గడిపాడు. చివరకు యూఏఈ పట్ల తన అభిమానాన్ని చాటుకునేందుకు 100 జాతీయ జెండాలతో సైకిల్‌ను అలంకరించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఓ కార్పెంటర్‌తో ప్రత్యేక ఫ్రేమ్ తయారు చేయించాడు. సైకిల్‌కు రెండో సీటును అమర్చి, యూఏఈ జాతీయ రంగుల్లో బెలూన్లు, ఇతర అలంకరణలు జోడించాడు. ఇలా నాలుగు రోజులపాటు కొంత సమయం కేటాయిస్తూ సైకిల్‌ను సిద్ధం చేశాడు. ఇందుకోసం మొత్తం Dh300 ఖర్చు చేసినట్లు మోహన్ తెలిపారు.
వెయిటర్‌గా ప్రారంభించి.. క్యాషియర్‌గా ఎదిగి
గత పదేళ్లకు పైగా యూఏఈలో పనిచేస్తున్న మోహన్ తన ఉద్యోగ ప్రయాణాన్ని వెయిటర్‌గా ప్రారంభించారు. క్రమంగా ఎదుగుతూ ప్రస్తుతం దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. యూఏఈ తనకు ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు కల్పించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఖాళీ సమయాల్లో వీడియో గ్రఫీ, వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నట్లు తెలిపారు. తన భార్య, మూడేళ్ల కుమార్తె ప్రస్తుతం భారత్‌లో ఉన్నారని, భవిష్యత్తులో వారిని కూడా యూఏఈకి తీసుకురావాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
ఇతర విభాగాల్లోనూ విజేతలు
ఈ పోటీలో మోహన్‌తో పాటు మరో ముగ్గురు కూడా Dh10,000 చొప్పున బహుమతులు గెలుచుకున్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన తర్మియాతి సిండీ పొద్దుతిరుగుడు పువ్వు (Sunflower) రూపంలో తన సైకిల్‌ను అలంకరించి 'మోస్ట్ క్రియేటివ్ థీమ్' విభాగంలో విజేతగా నిలిచారు. అదేవిధంగా ప్రత్యేక బోర్డులు, ఒకే తరహా దుస్తులు, మాస్కులతో సైకిళ్లను అలంకరించిన ఓ కుటుంబం 'బెస్ట్ ఫ్యామిలీ కాస్ట్యూమ్' అవార్డును దక్కించుకుంది. 'గార్డియన్స్ ఆఫ్ ది ఎమిరేట్స్' పేరుతో పాల్గొన్న ఈ కుటుంబం తమ సైకిళ్లకు బుర్జ్ ఖలీఫా నమూనాలను కూడా జోడించింది.
దుబాయ్ రన్‌లోనూ రూ.లక్షల బహుమతుల అవకాశం
దుబాయ్ రైడ్ తరహాలోనే దుబాయ్ రన్‌లోనూ ప్రత్యేక దుస్తులు, సృజనాత్మక అలంకరణలతో పాల్గొనే వారికి బహుమతులు ప్రకటించారు. మొత్తం 10 మందికి ఒక్కొక్కరికి Dh10,000 చొప్పున అందించనున్నారు. ఆసక్తి ఉన్నవారు తమ బిబ్ నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఫొటోలు లేదా వీడియోలను దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ సోషల్ మీడియా ఖాతాలకు పంపి పోటీలో పాల్గొనవచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో 25.2 శాతం పెరిగిన డెలివరీ ఆర్డర్లు..!!
- బహ్రెయిన్‌లో భారీ సైబర్ మోసం..మహిళ అరెస్ట్..!!
- ఒమన్‌లో సాంస్కృతిక వారసత్వ సంపదకు చట్టపరమైన రక్షణ..!!
- దుబాయ్ రైడ్‌లో భారతీయుడికి Dh10,000 బహుమతి..!!
- రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దుబాయ్ పోలీసుల ఆధ్వర్యంలో బహ్రెయిన్‌కు చెందిన దివ్యాంగ పోలీసు అధికారికి ఘన స్వాగతం
- ఒమన్‌లో ఘనంగా 56వ జాతీయ దినోత్సవ వేడుకలు.. డ్రోన్ షోలతో ఆకట్టుకున్న ఆకాశం
- షేక్ జాయెద్ ఫెస్టివల్‌కు ఉచిత బస్సు సర్వీసులు..
- పుష్కరాలకు తేదీలు ఖరారు..సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు త్రిపుర గవర్నర్‌కు ఆహ్వానం







