ఒమన్‌లో సాంస్కృతిక వారసత్వ సంపదకు చట్టపరమైన రక్షణ..!!

- November 22, 2026 , by Maagulf
ఒమన్‌లో సాంస్కృతిక వారసత్వ సంపదకు చట్టపరమైన రక్షణ..!!

మస్కట్: ఒమన్‌లో పురాతన చారిత్రక వస్తువులు, పురావస్తు సంపద, సాంస్కృతిక వారసత్వానికి ప్రభుత్వం చట్టపరమైన రక్షణ కల్పించింది. వీటి యాజమాన్యం, నమోదు, విక్రయాలు, కొనుగోళ్లు, దిగుమతులు, ఎగుమతులపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ మేరకు రాయల్ డిక్రీ 35/2019 ద్వారా జారీ చేసిన సాంస్కృతిక వారసత్వ చట్టాన్ని రాయల్ డిక్రీ 62/2026 వరకు సవరించి అమలు చేస్తున్నారు. ఈ చట్టంలోని ముఖ్యమైన అంశాలను టైమ్స్ ఆఫ్ ఒమన్‌తో మాట్లాడుతూ మొహమ్మద్ ఇబ్రహీం లా ఫర్మ్ ఛైర్మన్ డాక్టర్ మొహమ్మద్ ఇబ్రహీం అల్ జద్జాలీ వివరించారు.

చారిత్రక సంపద ప్రభుత్వ ఆస్తి

ఒమన్‌లోని సాంస్కృతిక వారసత్వ సంపదకు సంబంధించి ఇతరుల యాజమాన్యం నిరూపితం కానంతవరకు అవి ప్రభుత్వ ఆస్తిగానే పరిగణిస్తారు. సముద్ర గర్భంలో లభించే పురావస్తు సంపద, భౌతిక రూపంలో లేని సాంస్కృతిక వారసత్వం పూర్తిగా ప్రభుత్వ ఆస్తులేనని చట్టం స్పష్టం చేస్తోంది. భూమిపై ఉన్న స్థిరమైన చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద భూమి రిజిస్టర్‌లో ఎవరి పేరుతో నమోదై ఉంటే వారికి చెందుతాయి. భూమిపై లభించే తరలించగల పురావస్తు వస్తువులు, భూగర్భంలో లభించే చారిత్రక సంపద మాత్రం ఇతరుల యాజమాన్యం నిరూపితం కానంతవరకు ప్రభుత్వానికి చెందుతాయి.

విక్రయాలు, ఎగుమతులకు అనుమతి తప్పనిసరి

సాంస్కృతిక వారసత్వ వస్తువులను విక్రయించడం, కొనుగోలు చేయడం, విదేశాలకు ఎగుమతి చేయడం, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వంటి కార్యకలాపాలకు సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే పురాతన వస్తువుల ప్రతిరూపాలు తయారు చేయడం, మరమ్మతులు చేయడం, ప్రైవేటు మ్యూజియంలు, వారసత్వ గృహాలు, ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయడానికి కూడా అనుమతి అవసరం. ప్రైవేటు మ్యూజియంలు లేదా వారసత్వ గృహాల యజమానులు, నిర్వాహకులు మూలం తెలియని పురావస్తు వస్తువులను తమ వద్ద ఉంచుకోవడానికి వీల్లేదు.

120 రోజుల్లో నమోదు చేసుకోవాలి

ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న సాంస్కృతిక వారసత్వ వస్తువులను నిర్ణీత గడువులో సంబంధిత అధికారుల వద్ద నమోదు చేయాలి. చట్టబద్ధంగా వాటిని స్వాధీనం చేసుకున్న సందర్భంలో 120 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయాలి. ఇప్పటికే నమోదైన వారసత్వ వస్తువులను ఇతరులకు బదిలీ చేయాలన్నా, విక్రయించాలన్నా సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి. ఆ వివరాలను అధికారిక రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

ప్రభుత్వానికి చెందిన పురాతన వస్తువులను విదేశాలకు అప్పుగా పంపాలంటే సంబంధిత కమిటీ సిఫార్సు మేరకు మంత్రి ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలి. ప్రైవేటు యాజమాన్యంలోని వారసత్వ వస్తువులను విద్య, శాస్త్రీయ పరిశోధన, పునరుద్ధరణ లేదా మ్యూజియంలలో ప్రదర్శన కోసం విదేశాలకు పంపాలంటే కూడా లైసెన్స్ అవసరం.

పురాతన వస్తువులు దొరికితే 48 గంటల్లో సమాచారం

నిర్మాణ పనులు లేదా ఇతర కార్యకలాపాల సమయంలో పురాతన వస్తువులు, పురావస్తు ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ముఖ్యంగా నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో అలాంటి వస్తువులు లభిస్తే పనులను తక్షణమే నిలిపివేసి, 48 గంటల్లోగా అధికారులకు సమాచారం అందించాలి. అలాగే తమ వద్ద ఉన్న పురాతన వస్తువులు పోయినా, దెబ్బతిన్నా లేదా చోరీకి గురైనా యజమానులు గుర్తించిన 48 గంటల్లోగా సంబంధిత అధికారులకు తెలియజేయాలి.

నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు, జరిమానాలు

సాంస్కృతిక వారసత్వ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించే వారికి నేర స్వభావాన్ని బట్టి జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. లైసెన్స్ పొందిన వ్యక్తులు చట్టం, నిబంధనలు లేదా అధికారిక ఆదేశాలను ఉల్లంఘిస్తే వారి లైసెన్సులపై పరిపాలనాపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చని డాక్టర్ అల్ జద్జాలీ వివరించారు. ఒమన్ చారిత్రక, సాంస్కృతిక సంపదను కాపాడటంతోపాటు అక్రమ విక్రయాలు, తరలింపులను అరికట్టేందుకు ఈ చట్టం కీలకంగా పనిచేస్తోందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com