బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్‌లైన్ మోసాలు..

- November 22, 2026 , by Maagulf
బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్‌లైన్ మోసాలు..

అబుధాబీ: యూఏఈలో శీతాకాలం ప్రారంభం కావడంతో బైక్‌ల కొనుగోలు, అద్దెతో పాటు రెస్ట్ హౌస్‌లు, క్యాంప్‌సైట్‌ల బుకింగ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ ఆన్‌లైన్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని అబుధాబీ పోలీసులు ఆదివారం (నవంబర్ 22) ప్రజలను హెచ్చరించారు.

సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆకర్షణీయమైన ధరలు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో నకిలీ ప్రకటనలు పెడుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్‌లను అద్దెకు ఇస్తామని, తక్కువ ధరకు విక్రయిస్తామని, క్యాంప్‌సైట్‌లు, రెస్ట్ హౌస్‌లను తక్కువ ధరకు బుక్ చేస్తామని నమ్మించి ముందుగానే డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

అంతేకాకుండా, అధికారిక బుకింగ్, చెల్లింపు వెబ్‌సైట్‌లను పోలి ఉండే నకిలీ లింకులను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. ఈ లింకుల ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలను సేకరిస్తున్నట్లు హెచ్చరించారు. బుకింగ్ ఖరారు చేయడానికి లేదా కొనుగోలు పూర్తి చేయడానికి ముందస్తుగా డబ్బులు పంపిన తర్వాత బాధితులు మోసపోయినట్లు గుర్తిస్తున్నారని తెలిపారు.

ఆన్‌లైన్ బుకింగ్‌లో జాగ్రత్తలు తప్పనిసరి
చెల్లింపులు చేసే ముందు ప్రకటనలు, బుకింగ్ లింకులను క్షుణ్ణంగా పరిశీలించాలని అబుధాబీ పోలీసులు సూచించారు. లైసెన్స్ కలిగిన సంస్థలు, విశ్వసనీయ సేవా ప్రదాతల ద్వారానే బుకింగ్‌లు, కొనుగోళ్లు చేయాలని కోరారు.

అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని, ధృవీకరించని బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని స్పష్టం చేశారు. వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లు (OTP), వెరిఫికేషన్ కోడ్‌లను ఎవరికీ వెల్లడించకూడదని సూచించారు.

మోసాలను ఎలా ఫిర్యాదు చేయాలి?
ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన అనుమానాస్పద ప్రకటనలు లేదా లింకులు కనిపిస్తే అబుధాబీ పోలీసుల 'అమన్' (Aman) సేవ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.
- ఫోన్: 8002626
- SMS: 2828
శీతాకాలంలో అవుట్‌డోర్ కార్యకలాపాలు, క్యాంపింగ్, బైక్ రైడింగ్‌కు వెళ్లే ప్రజలు ఆన్‌లైన్ బుకింగ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com