యూఏఈలో వరుస రోడ్డు ప్రమాదాలు.. డ్రైవర్లపై స్పెషల్ ఫోకస్..!!
- November 25, 2026
దుబాయ్: యూఏఈలో భారీ వాహనాలతో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 27 మంది ప్రాణాలు కోల్పోవడంతో వాణిజ్య వాహనాల నిర్వహణ సంస్థలు అప్రమత్తమయ్యాయి. తమ డ్రైవర్ల పని వేళలపై నిఘా, వాహనాల క్రమం తప్పని తనిఖీలు, రోడ్డు భద్రతా నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. డ్రైవర్ల అలసట, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నాయి.
యూఏఈలో 400 వాణిజ్య వాహనాలను నిర్వహిస్తున్న హాట్ప్యాక్ (Hotpack) సంస్థ గ్రూప్ COO, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జైనుద్దీన్ పీబీ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై మరింత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. స్పీడ్ లిమిట్స్ పాటించడం, ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం ఉంచడం, లేన్ నిబంధనలు పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండటం వంటి అంశాలపై డ్రైవర్లకు సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు.
భారీ వాహనాల విషయంలో సరుకులను సురక్షితంగా లోడ్ చేయడం, వాటిని సరిగ్గా బిగించడం, వాహనాలను జాగ్రత్తగా మలుపులు తిప్పడంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అధికారులు జారీ చేసే హెచ్చరికలు, మార్గదర్శకాలను కూడా డ్రైవర్లకు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రైవర్ల అలసటను తగ్గించేందుకు పని వేళలు, విశ్రాంతి సమయాలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రోజువారీ వాహన తనిఖీలు, నిర్ణీత సమయాల్లో సర్వీసింగ్, GPS పర్యవేక్షణతో పాటు డిఫెన్సివ్ డ్రైవింగ్, వాహనాల బ్లైండ్ స్పాట్స్, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విధానాలపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
డ్రైవర్ల వర్కింగ్ అవర్స్ పై నిఘా
జలీల్ హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ కె. మొహమ్మద్ మాట్లాడుతూ.. ప్రమాదాల తర్వాత కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోయినా, గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదాల నివారణకు పలు చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సంస్థకు చెందిన అన్ని వాహనాల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి డ్రైవర్‌కు ప్రత్యేక కార్డు ఇస్తామని, దాని ద్వారా వాహనాన్ని ప్రారంభించినప్పుడు డ్రైవింగ్ సమయాన్ని పర్యవేక్షించవచ్చని వివరించారు.
డ్రైవర్లు నిర్ణీత పని గంటలు దాటితే వెంటనే జోక్యం చేసుకుని అలసట కారణంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే GPS ద్వారా అతివేగం, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వంటి అంశాలను గుర్తిస్తున్నారు. వాహన సిబ్బందికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు టైర్లలో గాలి ఒత్తిడి, బ్రేకులు, లైట్ల పనితీరును ప్రతి వారం తనిఖీ చేస్తున్నారు. విడిభాగాలు, ముఖ్యంగా టైర్ల నాణ్యతను కూడా పరిశీలిస్తున్నారు.
9 గంటల డ్రైవింగ్ పరిమితి
రోడ్ సేఫ్టీ యూఏఈ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎడెల్మన్ మాట్లాడుతూ.. భారీ వాహనాల భద్రతకు సురక్షితమైన డ్రైవర్లు, మంచి స్థితిలో ఉన్న వాహనాలు, సమర్థమైన నిబంధనలు, వాటి అమలు కీలకమని పేర్కొన్నారు. ట్రక్ డ్రైవర్లకు వృత్తిలోకి ప్రవేశించే దశ నుంచే మానసిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. నిరంతర శిక్షణ, ఆరోగ్య పరీక్షలు, తగిన నిద్ర, పోషకాహారంపై కూడా దృష్టి పెట్టాలని తెలిపారు.
2027 జనవరి 1 నుంచి భారీ వాహనాల డ్రైవర్లకు రోజువారీ గరిష్ఠ డ్రైవింగ్ సమయాన్ని 9 గంటలుగా పరిమితం చేసే కొత్త నిబంధన అమల్లోకి రానుంది. డ్రైవింగ్ సమయం, వేగం, విశ్రాంతి సమయాలను నమోదు చేసే టాకోగ్రాఫ్ పరికరాలు ఈ నిబంధన అమలును పర్యవేక్షించడంలో కీలకంగా మారనున్నాయి. ఇతర వాహనదారులు కూడా భారీ ట్రక్కులకు బ్రేకులు వేయడానికి ఎక్కువ దూరం అవసరమవుతుందని, వాటికి బ్లైండ్ స్పాట్స్ ఉంటాయని గుర్తించాలని ఆయన సూచించారు.
డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ
ఎక్సలెన్స్ డ్రైవింగ్ సెంటర్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఖలీద్ జావెద్ మాట్లాడుతూ.. నిజ జీవితంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను డ్రైవర్ల శిక్షణలో భాగంగా చేర్చాలని సూచించారు. భారీ వాహనాల డ్రైవర్లకు ప్రత్యేక డిఫెన్సివ్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని, ప్రమాదాలను ముందుగానే గుర్తించడం, వాహనాన్ని నియంత్రించడం, బ్లైండ్ స్పాట్స్, బ్రేకింగ్ దూరం, వేగ నియంత్రణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం మాత్రమే మంచి ప్రొఫెషనల్ డ్రైవర్‌గా మారడానికి సరిపోదని, సరైన ఆలోచనా విధానం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, భద్రతపై అవగాహన కూడా అవసరమని పేర్కొన్నారు.
రెండు వారాల్లో 27 మంది మృతి
భారీ వాహనాల భద్రతపై ఆందోళనలు పెరగడానికి ఇటీవల జరిగిన రెండు ప్రమాదాలు ప్రధాన కారణమయ్యాయి. నవంబర్ 24న రాస్ అల్ ఖైమాలోని అల్ వతన్ రోడ్డుపై 41 మందితో వెళ్తున్న బస్సు, సాంకేతిక లోపం కారణంగా రోడ్డు పక్కన నిలిపిన ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో తొలుత పలువురు ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 14 మంది వివిధ స్థాయిల్లో గాయపడ్డారు.
అంతకుముందు నవంబర్ 12న ఫుజైరాలో జరిగిన బహుళ వాహనాల ప్రమాదంలో 14 మంది మరణించగా, సుమారు 30 మంది గాయపడ్డారు. ఫుజైరా ప్రమాదం తర్వాత రోడ్లపై ట్రక్కుల రద్దీ ఉన్న ప్రాంతాల గురించి వాహనదారులకు ముందుగానే మొబైల్ ఫోన్ అలర్ట్స్ పంపించే విధానాన్ని పోలీసులు ప్రారంభించారు. అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పంపుతున్న ఈ హెచ్చరికల్లో వేగం తగ్గించాలని, ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం పాటించాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ప్రారంభమైన ముత్రా కేబుల్ కార్..!!
- పలు కీలక రంగాల్లో ఖతార్–అమెరికా ఒప్పందాలు..!!
- బహ్రెయిన్‌లో పెట్రోల్ నాణ్యతపై వాహనదారుల్లో డౌట్స్..!!
- యూఏఈలో వరుస రోడ్డు ప్రమాదాలు.. డ్రైవర్లపై స్పెషల్ ఫోకస్..!!
- ఫ్లిప్ కార్ట్ సీఈవో రాజీనామా
- సౌదీ పర్యాటక శాఖ నుంచి 5 డిజిటల్ సేవలు..!!
- తిరుమల యాత్రికుల భద్రతకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ బీమా పథకం
- మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టో రికో భామ జెన్నిఫర్ బారెటో
- భారీగా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్న సౌదీ–ఒమన్ భద్రతా బలగాలు..!!
- మస్కట్‌లో అంతర్జాతీయ కార్డియాక్ సర్జరీపై వర్క్‌షాప్..!!







