పలు కీలక రంగాల్లో ఖతార్–అమెరికా ఒప్పందాలు..!!
- November 25, 2026
వాషింగ్టన్: AI, కీలక ఖనిజాలు, అరుదైన భూమి మూలకాల (Rare Earth Elements) రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఖతార్, అమెరికా రెండు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో ఒక ఒప్పందంతో పాటు ఒక అవగాహన ఒప్పందం (MoU) ఉన్నాయి. వాషింగ్టన్‌లో జరిగిన 8వ ఖతార్–అమెరికా వ్యూహాత్మక చర్చల సందర్భంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్‌థానీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంయుక్తంగా ఈ చర్చలకు అధ్యక్షత వహించారు.
అమెరికా వాణిజ్య శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఖతార్ విదేశీ వాణిజ్య వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ AI రంగంలో భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన సెమీకండక్టర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి పరస్పర ప్రాప్యత కల్పించడం, ప్రైవేటు రంగ సంస్థల మధ్య పెట్టుబడులు, భాగస్వామ్యాలను ప్రోత్సహించడం ద్వారా ఆవిష్కరణలకు ఊతమివ్వాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.
ఇదే సందర్భంగా కీలక ఖనిజాలు, అరుదైన భూమి మూలకాల సరఫరా భద్రతకు సంబంధించి మరో అవగాహన ఒప్పందం కుదిరింది. ఖనిజాల తవ్వకం, శుద్ధి, ప్రాసెసింగ్ రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడం ఈ MoU ముఖ్య ఉద్దేశమన్నారు. సరఫరా వ్యవస్థలను విస్తరించి, ప్రత్యామ్నాయ వనరులను అభివృద్ధి చేయడంతో పాటు ఉమ్మడి పెట్టుబడులను ప్రోత్సహించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన ఆర్థిక సమావేశం సందర్భంగా ఖతార్ విదేశీ వాణిజ్య వ్యవహారాల సహాయ మంత్రి అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్, అమెరికా విదేశాంగ శాఖ ఆర్థిక వృద్ధి, ఇంధనం, పర్యావరణ విభాగం అండర్ సెక్రటరీ జాకబ్ హెల్‌బర్గ్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
పాక్స్ సిలికా (Pax Silica) చొరవలో భాగంగా.. ఈ రెండు ఒప్పందాలు ఖతార్, అమెరికా మధ్య ఇప్పటికే ఉన్న దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో కీలకంగా మారనున్న సాంకేతిక, ఖనిజ రంగాల్లో ఇరు దేశాల సహకారానికి ఇవి కొత్త అవకాశాలను తెరుస్తాయని ఖతార్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఒప్పందాల ద్వారా ఆర్థిక భద్రత, సరఫరా వ్యవస్థల స్థిరత్వం, సాంకేతిక ఆవిష్కరణలు, స్థిరమైన ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహం లభించనుంది. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక, పెట్టుబడి సంబంధాలకు మరింత ఊతం లభించనుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ప్రారంభమైన ముత్రా కేబుల్ కార్..!!
- పలు కీలక రంగాల్లో ఖతార్–అమెరికా ఒప్పందాలు..!!
- బహ్రెయిన్‌లో పెట్రోల్ నాణ్యతపై వాహనదారుల్లో డౌట్స్..!!
- యూఏఈలో వరుస రోడ్డు ప్రమాదాలు.. డ్రైవర్లపై స్పెషల్ ఫోకస్..!!
- ఫ్లిప్ కార్ట్ సీఈవో రాజీనామా
- సౌదీ పర్యాటక శాఖ నుంచి 5 డిజిటల్ సేవలు..!!
- తిరుమల యాత్రికుల భద్రతకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ బీమా పథకం
- మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టో రికో భామ జెన్నిఫర్ బారెటో
- భారీగా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్న సౌదీ–ఒమన్ భద్రతా బలగాలు..!!
- మస్కట్‌లో అంతర్జాతీయ కార్డియాక్ సర్జరీపై వర్క్‌షాప్..!!







