ఒమన్‌లో ప్రారంభమైన ముత్రా కేబుల్ కార్..!!
- November 25, 2026
మస్కట్: ఒమన్ రాజధాని మస్కట్ గవర్నరేట్ పరిధిలోని ముత్రా ప్రాంతంలో కొత్త పర్యాటక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ‘ముత్రా టెలిఫెరిక్’ (Muttrah Teleferik) కేబుల్ కార్ ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభమైంది. దీంతో ఈ పర్యాటక ప్రాజెక్టు పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించింది. సబీన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ, మస్కట్ మున్సిపాలిటీ సహకారంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాయి. సంస్కృతి, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి సయ్యద్ సౌద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఒమన్‌లో పర్యాటక అనుభవాలను విస్తరించడం, నాణ్యమైన పర్యాటక వసతులను అభివృద్ధి చేయడం, ముత్రా ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ముత్రా కేబుల్ కార్ కంపెనీ ఛైర్మన్ ఖలీద్ బిన్ సయీద్ అల్ నభానీ మాట్లాడుతూ.. ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిన ఒమన్‌లోనే తొలి కేబుల్ కార్ ప్రాజెక్టుగా ముత్రా టెలిఫెరిక్ ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. గత కొన్ని వారాలుగా ప్రయోగాత్మకంగా నిర్వహించిన సేవలకు స్థానికులు, పౌరులు, పర్యాటకుల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు.
3 కిలోమీటర్ల మార్గం..
ఈ కేబుల్ కార్ మార్గం మొత్తం 3 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ముత్రా పోర్టు, అల్ రయ్యా ప్రాంతంలోని పర్వత శిఖరం, హయ్య్ అల్ వార్డ్ ప్రాంతాలను కలుపుతూ మూడు స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 18 కేబుల్ కార్ క్యాబిన్లు ఉన్నాయి. వీటి ద్వారా గంటకు గరిష్ఠంగా 800 మంది ప్రయాణించవచ్చు.
పర్వత శిఖరంపై ప్రత్యేక థియేటర్
సమ్మిట్ స్టేషన్లో బహిరంగ పర్వత థియేటర్‌ను ప్రత్యేకంగా నిర్మించారు. రోమన్ కాలం నాటి యాంఫీథియేటర్ల నిర్మాణ శైలిని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని రూపొందించారు. వెయ్యి మందికి పైగా ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఇక్కడ సంగీత కచేరీలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ వేడుకలు నిర్వహించనున్నారు. పర్వత శిఖరం నుంచి సముద్ర అందాలను వీక్షించే అవకాశం కూడా ఉంటుంది. మూడు స్టేషన్లలో కలిపి 23 వాణిజ్య దుకాణాలు, రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. కళా, వాణిజ్య కార్యకలాపాల కోసం ప్రత్యేక స్థలాలను కూడా కేటాయించారు.
ప్రారంభోత్సవంలో ముత్రా ప్రాంత చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే నాటక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథి సమ్మిట్ స్టేషన్‌ను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ‘మినియేచర్ ఒమన్’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో దేశంలోని వివిధ గవర్నరేట్లకు చెందిన చారిత్రక, ఆధునిక కట్టడాల నమూనాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా బాణసంచా, డ్రోన్ ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒమన్ పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణ అందుబాటులోకి రావడంతో పాటు ముత్రా ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో గొర్రెల పెంపకందారులకు డిసెంబర్ 31 వరకు గడువు..!!
- ఒమన్‌లో ప్రారంభమైన ముత్రా కేబుల్ కార్..!!
- పలు కీలక రంగాల్లో ఖతార్–అమెరికా ఒప్పందాలు..!!
- బహ్రెయిన్‌లో పెట్రోల్ నాణ్యతపై వాహనదారుల్లో డౌట్స్..!!
- యూఏఈలో వరుస రోడ్డు ప్రమాదాలు.. డ్రైవర్లపై స్పెషల్ ఫోకస్..!!
- ఫ్లిప్ కార్ట్ సీఈవో రాజీనామా
- సౌదీ పర్యాటక శాఖ నుంచి 5 డిజిటల్ సేవలు..!!
- తిరుమల యాత్రికుల భద్రతకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ బీమా పథకం
- మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టో రికో భామ జెన్నిఫర్ బారెటో
- భారీగా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్న సౌదీ–ఒమన్ భద్రతా బలగాలు..!!







