నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి భరోసా..!

- November 29, 2026 , by Maagulf
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి భరోసా..!
-నూతన నియోజకవర్గాలకు శ్రీకారం.. మహిళా శక్తికి అధికారం..!
ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రాంతానికి తగిన ప్రాతినిధ్యం లభించినప్పుడే దేశంలో సమాఖ్య వ్యవస్థకు నిజమైన బలం చేకూరుతుంది. దేశ జనాభాలో మార్పులు, ప్రాంతీయ అవసరాలు, అభివృద్ధిలో రాష్ట్రాల పాత్రకు అనుగుణంగా చట్టసభల ప్రాతినిధ్యాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రక్రియలో జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక ప్రగతికి కీలక చోదకశక్తులుగా నిలుస్తున్న దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను కాపాడుతూ, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను తీసుకురావడం కీలకమైన పరిణామం. కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నట్టు జనగణన తర్వాత డీలిమిటేషన్ చేపడితే జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అలాకాకుండా ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్యను 50 శాతానికి పెంచుతూ, 2051 వరకూ ఇదే ప్రతిపాదన కొనసాగించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి భరోసా ఏర్పడింది.  

దక్షిణ భారత రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ, జనాభా స్థిరీకరణ, విద్య, వైద్యం, మానవ వనరుల అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఐటీ, పారిశ్రామిక రంగం, సేవలు, ఎగుమతులు, ఉపాధి కల్పన, పన్నుల ఆదాయం వంటి రంగాల్లో జాతీయ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన తోడ్పాటునందిస్తున్నాయి. ఇలాంటి రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల పునర్విభజన కారణంగా పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలన్నది ఈ సంస్కరణలో అత్యంత కీలకమైన అంశం.
ఈ సమస్యకు పరిష్కారంగా ప్రస్తుత లోక్‌సభ స్థానాలను అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంచాలన్న కేంద్రం ప్రభుత్వ ప్రతిపాదన చారిత్రాత్మకమైనది. పార్లమెంట్ లో సమ ప్రాధాన్యత లభిస్తుండడంతో రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాయి. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా అన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం పెరిగేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 50 శాతం నియోజకవర్గాల పెంపు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనలకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ విధానాన్ని ‘విన్-విన్ ఫార్ములా’గా అభివర్ణించడంతో ఈ బిల్లుల ప్రాధాన్యత స్పష్టమవుతోంది.  ఈ సంస్కరణలకు జనసేన పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జాతీయ అభివృద్ధి, రాష్ట్రాల ఆకాంక్షలు సమాంతరంగా సాగాలని ఆకాంక్షిస్తూ జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయ విభేదాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ రెండు కీలక ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వాలని కోరారంటే ఇక్కడ రాజకీయాలకంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టమవుతోంది. ఈ విధానం ప్రకారం దేశంలో ప్రస్తుతమున్న లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కు పెరిగే అవకాశం ఉంది. దక్షిణాది ఐదు రాష్ట్రాల స్థానాలు 129 నుంచి 195కు చేరనున్నాయి. మొత్తం లోక్‌సభలో దక్షిణాది వాటా సుమారు 23.76 శాతంగా కొనసాగుతుందని ప్రతిపాదిత లెక్కలు సూచిస్తున్నాయి.

నియోజకవర్గాల పునర్విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తోంది. రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కు పెరిగే అవకాశం ఉండటంతో జాతీయ రాజకీయాల్లో ఏపీ గళం మరింత బలంగా వినిపించేందుకు వీలుంటుంది. తెలంగాణకు 17 నుంచి 26, తమిళనాడుకు 39 నుంచి 59, కర్ణాటకకు 28 నుంచి 42, కేరళకు 20 నుంచి 30 స్థానాలు పెరగవచ్చని అంచనాలున్నాయి. లోక్‌సభతోపాటు రాష్ట్రాల శాసనసభ స్థానాలను కూడా 50 శాతం పెంచే ప్రతిపాదన అమలైతే అన్ని రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగి ప్రజలకు పాలన మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌కు పెరిగే ప్రాతినిధ్యం కేవలం సంఖ్యాపరమైన ప్రయోజనం మాత్రమే కాదు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి అవసరాలను జాతీయ స్థాయిలో బలంగా వినిపించే అవకాశం కూడా కలుగుతుంది. రాష్ట్ర ఉత్తరాంధ్రలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, రాయలసీమలో సాగునీటి భద్రత, కోస్తాంధ్రలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, పోర్టుల అభివృద్ధి, సముద్ర వాణిజ్యం, పారిశ్రామిక కారిడార్లు వంటి అనేక అంశాలకు మరింత ప్రాధాన్యత కల్పించవచ్చు. పోలవరం, నదీజలాల వినియోగం, రైల్వేలు, జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి రాష్ట్ర ప్రయోజనాలను పార్లమెంటులో సమర్థంగా ప్రస్తావించేందుకు అదనపు ప్రాతినిధ్యం ఎంతో దోహదపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్  హయాంలో ఇప్పటికే అభివృద్ధి పురోగతిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌ కు చట్టసభల్లో పెరిగే ప్రాతినిధ్యంతో మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మరింత బలం చేకూరుతుంది.

ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడం వల్ల పాలన ప్రజలకు మరింత చేరువ కావడమే కాకుండా, పార్లమెంటులో ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావించే అవకాశం కూడా పెరుగుతుంది.  ప్రస్తుతం సుమారు 147 కోట్ల జనాభాకు 543 మంది లోక్‌సభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిపాదిత 50 శాతం పెంపుతో ఒక్కో ఎంపీపై ఉండే ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గి ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత సమయం కేటాయించే అవకాశం పుష్కలంగా ఏర్పడుతుంది. అయితే పునర్విభజనలో జనాభాతోపాటు భౌగోళిక విస్తీర్ణం, గిరిజన ఆవాసాలు, మారుమూల ప్రాంతాలు, రవాణా సౌకర్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రCల అభీష్టానికి అనుగుణంగా పాలన ప్రజలకు మరింత చేరువవుతుంది.

డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్లు భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో కీలక సంస్కరణ. మూడు దశాబ్దాలుగా కేవలం చర్చలు, ప్రతిపాదనలకే పరిమితమై అమలుకు నోచుకోని  మహిళా రిజర్వేషన్ల బిల్లుకు 2023లో ‘నారీ శక్తి వందన్ అధినియం’ రూపంలో చట్టబద్ధత లభించింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయ నిర్ణయాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుంది. ఇప్పటివరకు ప్రజా సమస్యలపై గళమెత్తిన మహిళలు ఇకపై చట్టాల రూపకల్పనలోనూ, విధాన నిర్ణయాల్లోనూ ప్రత్యక్ష పాత్ర పోషించే అవకాశం ఏర్పడుతుంది. నేడు మహిళలు వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్ష పరిశోధన, విద్య, వైద్యం, పరిపాలన ఇలా ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుతున్నారు. అయినప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యంలో ఆశించిన స్థాయికి చేరుకోలేకపోతున్నారు. రిజర్వేషన్ల అమలుతో ఈ అంతరాన్ని తగ్గించడంతోపాటు మహిళల సమస్యలు, అవసరాలు, ఆకాంక్షలకు చట్టసభల్లో తగిన ప్రాధాన్యత లభిస్తుంది. విద్య, ఆరోగ్యం, మహిళల భద్రత, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, బాలల సంక్షేమం వంటి అంశాలు విధాన నిర్ణయాల్లో మరింత బలంగా ప్రతిఫలిస్తాయి. అందువల్ల ఇది కేవలం సీట్ల కేటాయింపు కాదు. దేశ పాలనా వ్యవస్థలో మహిళలకు సముచిత స్థానం కల్పించే ప్రజాస్వామ్య సంస్కరణ.
 దక్షిణాది ప్రగతికి దామాషా న్యాయం.. ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు పార్లమెంటులో కొత్త గళం.. మహిళా శక్తికి చట్టసభల్లో సముచిత స్థానం.. ఇవే నవభారత ప్రజాస్వామ్యానికి నవశకం కావాలి. ప్రాంతాల మధ్య అంతరాలు కాదు.. ప్రాతినిధ్యంలో సమతుల్యత కనిపించాలి. అవకాశాల్లో వివక్ష కాదు.. అభివృద్ధిలో సమానత్వం వెల్లివిరియాలి. ప్రతి రాష్ట్రం గొంతుకకు గౌరవం.. ప్రతి మహిళకు నిర్ణయాధికారం కల్పించినప్పుడే వికసిత్ భారత్ స్వప్నం సాకారమవుతుంది. ప్రతి ప్రాంతం అభివృద్ధి రథంలో భాగస్వామి కావాలి. నారీశక్తి నాయకత్వంలో నూతన భారత నిర్మాణం వేగం పుంజుకోవాలి. రాష్ట్రాల ఆకాంక్షలు జాతీయ సంకల్పాలుగా రూపుదిద్దుకోవాలి.

--లింగమనేని రమేశ్, పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com