కువైట్‌లో ప్రవాసులకు బ్యాంకు రుణాలపై కొత్త ఆంక్షలు..!!

- November 29, 2026 , by Maagulf
కువైట్‌లో ప్రవాసులకు బ్యాంకు రుణాలపై కొత్త ఆంక్షలు..!!

కువైట్ : కువైట్‌లో ప్రవాస ఉద్యోగులకు బ్యాంకు రుణాలు పొందడం మరింత కష్టతరంగా మారుతోంది. ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు, వాయిదాల పద్ధతిలో తీసుకునే రుణాలకు అదనపు హామీలను తప్పనిసరి చేస్తున్నాయి. రుణం పొందే అర్హత కలిగిన ప్రవాస ఉద్యోగులు తమ ఉద్యోగ సంస్థ నుంచి రాతపూర్వక హామీ తీసుకురావాలని కొన్ని బ్యాంకులు కొత్త నిబంధన విధిస్తున్నాయి. ఉద్యోగానికి రాజీనామా చేసినా, సంస్థ తొలగించినా రావాల్సిన ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ నేరుగా రుణం తీసుకున్న బ్యాంకులోని జీతం ఖాతాకే బదిలీ చేయాలని ఈ హామీలో పేర్కొనాల్సి ఉంటుంది.

సర్వీస్ బెనిఫిట్స్ నుంచి వాయిదాల వసూలు

ఉద్యోగం ముగిసే సమయానికి రుణం పూర్తిగా చెల్లించకపోతే, ఉద్యోగికి రావాల్సిన సర్వీస్ బెనిఫిట్స్ నుంచి మిగిలిన రుణ వాయిదాలను వసూలు చేసుకునేందుకు బ్యాంకులు ఈ నిబంధన తీసుకొచ్చాయి. రుణ చెల్లింపు పూర్తయ్యే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. ఉద్యోగి తన సర్వీస్ బెనిఫిట్స్‌ను మరో ఖాతాకు బదిలీ చేయాలని కోరినా ఈ నిబంధన వర్తిస్తుంది.

కొత్త విధానం ప్రకారం.. ఖాతాలో జమయ్యే సర్వీస్ బెనిఫిట్స్ మొత్తాన్ని బ్యాంకులు తాత్కాలికంగా ఫ్రీజ్ చేసి, అందులో నుంచి నెలవారీ రుణ వాయిదాలను మినహాయించవచ్చు. అయితే రుణగ్రహీత మరో ఉద్యోగంలో చేరి, ఆ సంస్థకు బ్యాంకు దృష్టిలో మంచి ఆర్థిక విశ్వసనీయత ఉన్నట్లు నిర్ధారణ కావాలి. కొత్త ఉద్యోగంలో మూడు నుంచి ఆరు నెలల పాటు కొనసాగినట్లు రుజువు చేసిన తర్వాతే ఫ్రీజ్‌ను తొలగించే అవకాశం ఉంటుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు తెలిపారు.

ఈ ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం

కువైట్‌లో ప్రభుత్వ రంగంలో కువైటైజేషన్ అమలు కారణంగా స్థానికులకు ప్రాధాన్యత ఇస్తున్న ఉద్యోగ విభాగాల్లో పనిచేస్తున్న ప్రవాసులు, చిన్న, మధ్య తరహా సంస్థల్లో (SMEs) పనిచేసేవారు, 60 ఏళ్ల వయస్సుకు చేరువలో ఉన్న ఉద్యోగులపై ఈ నిబంధనల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

కొన్ని బ్యాంకులు రుణం పొందాలంటే కనీసం ఐదేళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలని కోరుతున్నాయి. ఆర్థిక సామర్థ్యం కలిగిన కువైటీ వ్యక్తి గ్యారంటీదారుగా ఉంటే ప్రవాసులకు రుణం మంజూరయ్యే అవకాశాలు మెరుగుపడవచ్చని నివేదిక పేర్కొంది. ఇక లిస్టెడ్ కంపెనీల్లో పనిచేసేవారికి, అలాగే రుణాలు ఇచ్చే బ్యాంకులతో ఇప్పటికే వ్యాపార సంబంధాలు కలిగిన సంస్థల ఉద్యోగులకు బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ముఖ్యంగా జీతాలను అదే బ్యాంకుకు బదిలీ చేసే ఉద్యోగులు, ఇప్పటికే బ్యాంకు నుంచి క్రెడిట్ సదుపాయాలు పొందుతున్న సంస్థల సిబ్బందికి అనుకూలత ఉండనుంది.

కనీస వేతనం KD 500

ప్రవాసులు వ్యక్తిగత లేదా వాయిదాల రుణాలు పొందేందుకు సాధారణంగా కనీస నెలవారీ జీతం KD 500 ఉండాలని బ్యాంకులు నిబంధనగా పెట్టాయి. అయితే కొన్ని ఫైనాన్స్ సంస్థలు అంతకంటే ఎక్కువ వేతన పరిమితిని కూడా విధిస్తున్నాయి. మరోవైపు, ఉద్యోగం అకస్మాత్తుగా ముగిస్తే నష్టాలను తగ్గించుకునేందుకు కొందరు రుణదాతలు ఉద్యోగికి రావాల్సిన మొత్తం సర్వీస్ బెనిఫిట్స్‌లో 60 నుంచి 70 శాతం వరకు మాత్రమే రుణ పరిమితిని నిర్ణయిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ప్రవాసులు, స్థిరమైన ఉద్యోగ చరిత్ర లేనివారు, అవసరమైనంత సర్వీస్ పూర్తిచేయని వారికి కొన్ని బ్యాంకులు తాత్కాలికంగా రుణాల మంజూరును నిలిపివేసినట్లు సమాచారం.

ఆర్థికంగా బలమైన ఉద్యోగులకు అవకాశం

అయితే అధిక వేతనాలు పొందుతూ స్థిరమైన ఉద్యోగాల్లో పనిచేసేవారికి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదనపు ఉద్యోగ ప్రయోజనాలు పొందేవారు, బ్యాంకుల్లో డిపాజిట్లు లేదా ఇతర ఆర్థిక హామీలు కలిగిన ప్రవాసులకు రుణాల విషయంలో ప్రాధాన్యత లభించవచ్చు. ప్రవాసుల ఉద్యోగ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రుణాల మంజూరులో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com