పెంపుడు జంతువులను వదిలేస్తే BD5000 జరిమానా..!!
- November 29, 2026
మనామా: పెంపుడు కుక్కలు, పిల్లులను వీధుల్లో వదిలేసే యజమానులకు గరిష్ఠంగా BD5000 జరిమానా విధించాలని బహ్రెయిన్ ఎంపీ మరియం అల్ సాయెఘ్ ప్రతిపాదించారు. అంతేకాకుండా పిల్లులు, కుక్కలకు తప్పనిసరిగా మైక్రోచిప్ అమర్చాలని, వాటిని నమోదు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం జంతువులపై క్రూరత్వం, నిర్లక్ష్యం, వాటిని వదిలేయడం వంటి చర్యలకు విధిస్తున్న శిక్షలు సరిపోవడం లేదని పేర్కొన్నారు. కఠినమైన జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు.
ఖతార్‌లో ఇటీవల తీసుకొచ్చిన Law No. 18 of 2026ను ఆమె ఉదాహరణగా ప్రస్తావించారు. ఆ చట్టం ప్రకారం 10,000 నుంచి 50,000 ఖతారీ రియాళ్ల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉందని తెలిపారు. ఇది బహ్రెయిన్ కరెన్సీలో సుమారు BD1,030 నుంచి BD5,200 వరకు ఉంటుందని పేర్కొన్నారు. కొత్త చట్టాల కోసం పార్లమెంట్ ఆమోదం వచ్చే వరకు వేచి చూడకుండా, జంతువుల రక్షణకు ఇప్పటికే అమలు చేయగల చర్యలను ప్రభుత్వ విభాగాలు వెంటనే చేపట్టాలని కోరారు.
మైక్రోచిప్‌తో గుర్తింపు
పెంపుడు జంతువుల నమోదు, మైక్రోచిప్ విధానం తప్పనిసరి చేస్తే వీధుల్లో వదిలేసిన పిల్లులు, కుక్కల అసలు యజమానులను గుర్తించడం సులభమవుతుందని ఎంపీ తెలిపారు. బాధ్యులపై జరిమానాలు, ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. పెంపుడు జంతువులను ఇంటికి తీసుకురావడం తాత్కాలిక సరదా కాదని, వాటి జీవితకాలమంతా సంరక్షించే బాధ్యత యజమానులపై ఉంటుందని గుర్తుచేశారు. జంతువుల పట్ల దయ, కరుణ చూపాలన్న ఇస్లామిక్ బోధనలకు విరుద్ధంగా వాటిని వీధుల్లో వదిలేయడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వచ్ఛంద సంస్థలపై భారం
వీధుల్లో వదిలేసిన జంతువులను సంరక్షించే షెల్టర్లకు ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల నుంచి తగిన ఆర్థిక సహాయం అందడం లేదని తెలిపారు. చాలా వరకు జంతు సంరక్షణ కేంద్రాలను స్వచ్ఛంద కార్యకర్తలే నిర్వహిస్తున్నారని, వాటి ఆహారం, వైద్య చికిత్స ఖర్చులను సొంతంగా భరిస్తున్నారని చెప్పారు. జంతువుల సంఖ్య పెరుగుతుండటంతో వాటికి ఆహారం అందించడం, ఆశ్రయం కల్పించడం, వైద్య సేవలు అందించడం స్వచ్ఛంద కార్యకర్తలకు భారంగా మారుతోందని వివరించారు.
చట్టాలను కఠినంగా అమలు చేయాలి
బహ్రెయిన్‌లో జంతు సంక్షేమానికి సంబంధించిన GCC చట్టం Law No. 52 of 2014, ప్రమాదకర జంతువుల పెంపకాన్ని నియంత్రించే Law No. 23 of 2026లను మరింత సమర్థంగా అమలు చేయాలని ఎంపీ సూచించారు. ఇళ్లలో, గుర్రపుశాలల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో పెంచుతున్న జంతువుల పరిస్థితులను కూడా అధికారులు తనిఖీ చేయాలని కోరారు. యజమానులు వాటికి సరైన ఆహారం, పశువైద్య సేవలు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పిల్లల కోసం పెంపుడు జంతువులను కొనిచ్చి, కొంతకాలం తర్వాత ఆసక్తి తగ్గగానే వాటిని బయట వదిలేసే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జంతువులను పిల్లలకు ఇచ్చే బొమ్మలుగా లేదా తాత్కాలిక బహుమతులుగా చూడకూడదని, వాటి సంరక్షణ బాధ్యతను పిల్లలపై మాత్రమే వేయలేమని స్పష్టం చేశారు. పెంపుడు జంతువులను ఇంటికి తీసుకురాకముందే వాటి ఆహారం, వైద్యం, సంరక్షణకు అవసరమయ్యే సమయం, ఖర్చులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం, పాఠశాలలు, మీడియా, జంతు సంక్షేమ సంస్థలు కలిసి నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మరియం అల్ సాయెఘ్ కోరారు.
తాజా వార్తలు
- అమరావతిలో బెడ్ఫోర్డ్ స్కూల్ రెండో అంతర్జాతీయ క్యాంపస్
- కువైట్‌లో ప్రవాసులకు బ్యాంకు రుణాలపై కొత్త ఆంక్షలు..!!
- అరేబియా ఎడారిలో ప్రాచీన మానవుల నివాస రహస్యాలు..!!
- దుబాయ్‌లో అపార్ట్మెంట్ CCTV ఫుటేజీని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయవచ్చా?
- ఆరోగ్య రంగంలో ఏఐ.. ఖతార్ లో కీలక కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!
- పెంపుడు జంతువులను వదిలేస్తే BD5000 జరిమానా..!!
- నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను సమీక్షించిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్..
- దోహాలో బిర్లా పబ్లిక్ స్కూల్ 23వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు..
- షార్జాలో ట్రక్కు డ్రైవర్లకు భారీ జరిమానా హెచ్చరిక!







