దుబాయ్‌లో అపార్ట్‌మెంట్ CCTV ఫుటేజీని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయవచ్చా?

- November 29, 2026 , by Maagulf
దుబాయ్‌లో అపార్ట్‌మెంట్ CCTV ఫుటేజీని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయవచ్చా?

దుబాయ్: అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో మీ కారు ధ్వంసమైందా? ఆ ఘటన భవనంలోని CCTV కెమెరాల్లో రికార్డయిందా? అయితే ఆ ఫుటేజీని అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇతర వ్యక్తులను గుర్తించేలా ఉన్న CCTV దృశ్యాలను వారి అనుమతి లేకుండా సోషల్ మీడియాలో లేదా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయడం గోప్యతా ఉల్లంఘన, సైబర్ నేరాలకు సంబంధించిన సమస్యలకు దారితీయవచ్చు. ఈ విషయంలో Dh150,000 నుంచి Dh500,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు వివరించారు. కాగా, దుబాయ్‌లో CCTV వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణ, వినియోగం సెక్యూరిటీ ఇండస్ట్రీ రెగ్యులేటరీ ఏజెన్సీ (SIRA) నిబంధనల పరిధిలోకి వస్తాయి.

CCTV ఫుటేజీని అడిగే హక్కు ఉందా?

దుబాయ్‌లో Law No. 12 of 2016 ప్రకారం భద్రతా వ్యవస్థల నిర్వహణ నియంత్రించబడుతుంది. అలాగే Resolution No. 1 of 2026 అమలు నిబంధనల ప్రకారం భద్రతా సేవల సంస్థలు, వాటిని వినియోగించే సంస్థలు SIRA నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలి. CCTV ఫుటేజీని నిర్వహించే సెక్యూరిటీ సిబ్బంది తమ విధుల్లో భాగంగా తెలుసుకున్న సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత కలిగి ఉంటారు.

అందువల్ల కారుకు నష్టం జరిగిన వ్యక్తి భవన యాజమాన్యాన్ని CCTV ఫుటేజీ పరిశీలించమని, దాన్ని భద్రపరచమని కోరవచ్చు. అయితే ఆ వీడియో కాపీని తనకు ఇవ్వాలని బలవంతం చేసే హక్కు తప్పనిసరిగా ఉండదు. ముఖ్యంగా అందులో ఇతర వ్యక్తుల ముఖాలు, గుర్తింపు వివరాలు ఉంటే యాజమాన్యం ఫుటేజీని అందించకపోవచ్చు. అయితే ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించడం, భద్రపరచడం, పోలీసులకు అవసరమైనప్పుడు అందించడం వంటి చర్యలకు భవన యాజమాన్యం సహకరించవచ్చు.

 చట్టపరమైన సమస్యలు

యూఏఈ పెడరల్ డిగ్రీ Law No. 45 of 2021 ప్రకారం వ్యక్తిని గుర్తించగలిగే ఫొటో, వీడియో వంటి వివరాలు వ్యక్తిగత సమాచారంగా పరిగణించబడవచ్చు. అలాంటి సమాచారాన్ని చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉపయోగించాల్సి ఉంటుంది. అదేవిధంగా Law No. 34 of 2021లోని ఆర్టికల్ 44 ప్రకారం.. ఇతరుల వ్యక్తిగత లేదా కుటుంబ జీవిత గోప్యతను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించేలా వారి అనుమతి లేకుండా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా సమాచారాన్ని ఉపయోగిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ నిబంధన ప్రకారం:
* కనీసం ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
* Dh150,000 నుంచి గరిష్ఠంగా Dh500,000 వరకు జరిమానా విధించవచ్చు.
* నేర తీవ్రత, పరిస్థితులను బట్టి జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

అందువల్ల నిందితుడిని గుర్తించాలనే ఉద్దేశంతోనైనా ఇతరులను గుర్తించే CCTV వీడియోలను అనుమతి లేకుండా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయడం ప్రమాదకరమని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

CCTV ఫుటేజీని సాక్ష్యంగా వాడొచ్చా?

కారు ధ్వంసమైనప్పుడు చట్టబద్ధంగా CCTV ఆధారాలను ఉపయోగించుకోవడానికి ఈ విధానాన్ని అనుసరించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
1. బిల్డింగ్ మేనేజ్‌మెంట్‌కు సమాచారం: కారు దెబ్బతిన్న విషయం, ఘటన జరిగిన తేదీ, సమయం, పార్కింగ్ స్థలం వివరాలను వెంటనే తెలియజేయాలి.
2. ఫుటేజీ భద్రపరచాలని కోరాలి: CCTV రికార్డింగ్ సాధారణంగా కొంతకాలం తర్వాత ఆటోమేటిక్‌గా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల సంబంధిత వీడియోను తొలగించకుండా భద్రపరచాలని రాతపూర్వకంగా కోరాలి.
3. దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు: కారు నష్టానికి సంబంధించిన ఫొటోలు, వాహనం వివరాలు, పార్కింగ్ స్థలం, ఘటన జరిగిన సమయం వంటి ఆధారాలతో ఫిర్యాదు చేయాలి.
4. పోలీసుల ద్వారా ఫుటేజీ సేకరణ: CCTVలో ఘటన రికార్డయి ఉండవచ్చని పోలీసులకు తెలియజేసి, భవన యాజమాన్యం నుంచి వీడియోను అధికారికంగా సేకరించాలని కోరాలి.

యూఏఈ క్రిమినల్ ప్రొసీజర్ Lawలోని ఆర్టికల్ 31 ప్రకారం న్యాయపరమైన అధికారాలు కలిగిన పోలీసు అధికారులు నేరాలను గుర్తించడం, నిందితులను వెతకడం, విచారణకు అవసరమైన ఆధారాలను సేకరించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినంత మాత్రాన ఫిర్యాదుదారుడికి CCTV వీడియో కాపీ లభిస్తుందని హామీ లేదు. విచారణలో భాగంగా పోలీసులు ఆ వీడియోను స్వాధీనం చేసుకుని భద్రపరచవచ్చు. అంతేకాకుండా ఈ చట్టంలోని ఆర్టికల్ 67 ప్రకారం విచారణ ప్రక్రియలు, వాటి ఫలితాలు గోప్యంగా ఉంటాయి.

 గుర్తుంచుకోవాల్సిన విషయం

అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో కారు ధ్వంసమైనా, వస్తువులు చోరీకి గురైనా లేదా ఇతర ఘటనలు జరిగినా CCTV ఫుటేజీని స్వయంగా వాట్సాప్‌లో ప్రచారం చేయకుండా ముందుగా బిల్డింగ్ మేనేజ్‌మెంట్, పోలీసులను సంప్రదించడం మంచిది. వీడియోను సాక్ష్యంగా ఉపయోగించుకోవాలంటే అధికారిక మార్గంలోనే ముందుకు వెళ్లాలని నిపుణులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com