అరేబియా ఎడారిలో ప్రాచీన మానవుల నివాస రహస్యాలు..!!
- November 29, 2026
మస్కట్: వందల వేల సంవత్సరాల క్రితం అరేబియా ద్వీపకల్పంలోని ఎడారి ప్రాంతాల్లో ప్రాచీన మానవులు ఎక్కడ నివసించేవారు? వారి నివాస ప్రాంతాల ఎంపికకు నీటి వనరులే కారణమా? లేక ఇతర అంశాలు కూడా ప్రభావం చూపాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలను వెల్లడిస్తూ అంతర్జాతీయ పరిశోధకుల బృందం కీలక అధ్యయనాన్ని చేపట్టింది. ఒమన్ పరిశోధకుల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ పరిశోధనలో మంచినీటి లభ్యతతో పాటు రాతి పనిముట్లు తయారు చేసేందుకు అనువైన రాళ్లు కూడా ప్రాచీన మానవుల నివాసాలకు అత్యంత కీలకమని తేలింది.
'Stone and Water: The Rules of Ancient Human Settlement in the Desert' అనే పేరుతో రూపొందించిన ఈ అధ్యయనం అంతర్జాతీయ ప్రఖ్యాత జర్నల్ నేచర్ తాజా సంచికలో ప్రచురితమైంది. ఒమన్ వారసత్వ, పర్యాటక మంత్రిత్వ శాఖలోని పురావస్తు పరిశోధన విభాగం పరిశోధకుడు డాక్టర్ అలీ బిన్ హమూద్ అల్ మహ్రూఖీ, భూగర్భ శాస్త్రవేత్త, ఎర్త్ సైన్సెస్ కన్సల్టింగ్ సెంటర్ సీఈఓ డాక్టర్ మొహమ్మద్ బిన్ హిలాల్ అల్ కిందీ ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఆరు దేశాలకు చెందిన పది మంది పరిశోధకులు, పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ఈ అధ్యయనంలో భాగస్వాములయ్యాయి.
20 ఏళ్లకు పైగా పరిశోధన
ఒమన్‌లో రెండు దశాబ్దాలకు పైగా నిర్వహించిన పురావస్తు పరిశోధనలు, క్షేత్రస్థాయి సర్వేల ఆధారంగా ఈ అధ్యయనం రూపొందించారు. ఒమన్ వారసత్వ, పర్యాటక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో వందలాది పురావస్తు ప్రాంతాలను గుర్తించారు. వీటిలో ధోఫర్ గవర్నరేట్, అల్ హజర్ పర్వతాల పశ్చిమ వాలుల్లోని ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలకు సంబంధించిన ఆధారాలు మధ్య రాతియుగం (Middle Stone Age) నాటివిగా పరిశోధకులు గుర్తించారు.
గతంలో ప్రాచీన మానవులు ఎడారి ప్రాంతాల్లో నివసించడానికి మంచినీటి లభ్యత ఒక్కటే ప్రధాన కారణమని భావించేవారు. అయితే తాజా అధ్యయనం ఈ అభిప్రాయాన్ని సవరించింది. రాతి పనిముట్లు తయారు చేసేందుకు అవసరమైన ఫ్లింట్ వంటి ప్రత్యేక రాళ్లు అందుబాటులో ఉండటం కూడా నివాస ప్రాంతాల ఎంపికలో కీలక పాత్ర పోషించిందని వెల్లడించింది. అరేబియా ద్వీపకల్పంలో ప్రాచీన నదీ ప్రవాహ మార్గాలకు సమీపంలోని భూభాగాల్లో సుమారు 57 శాతం ప్రాంతాలు పనిముట్ల తయారీకి అవసరమైన రాళ్లు లభించని భౌగోళిక నిర్మాణాలపై ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది.
1,500 కిలోమీటర్ల ఎడారి యాత్ర
2023 చివర్లో పరిశోధకుల బృందం రబ్ అల్ ఖాలీ (Empty Quarter) ఎడారిలో సుమారు 1,500 కిలోమీటర్ల మేర సందర్శించారు. ఈ సందర్భంగా 125 ప్రాంతాలను పరిశీలించారు. వాటిలో 55 ప్రాంతాల్లో గతంలో మంచినీటి సరస్సులు ఉన్నట్లు సూచించే భౌగోళిక, పర్యావరణ ఆధారాలు లభించాయి. అయితే ఆ ప్రాంతాల్లో ప్రాచీన రాతి పనిముట్లు మాత్రం కనిపించలేదు. పనిముట్ల తయారీకి అవసరమైన అనువైన రాళ్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ఒమన్‌లో 301 పురావస్తు ప్రాంతాల పరిశీలన
ఈ పరిశోధనలో ఒమన్ కీలక మోడల్ గా నిలిచింది. 2002 నుంచి నిర్వహించిన 44 క్షేత్రస్థాయి సర్వేల ద్వారా గుర్తించిన మధ్య రాతియుగానికి చెందిన 301 పురావస్తు ప్రాంతాల సమాచారాన్ని ఉపయోగించి కొత్త శాస్త్రీయ నమూనాను పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో పురావస్తు ఆనవాళ్లు ఎక్కువగా కనిపించిన ప్రదేశాలు నీటి వనరులు, పనిముట్ల తయారీకి అనువైన రాళ్లు రెండూ అందుబాటులో ఉన్న ప్రాంతాలేనని వెల్లడైంది. ముఖ్యంగా ధోఫర్ గవర్నరేట్‌లోని నజ్ద్ పీఠభూమి, అల్ హజర్ పర్వతాల పశ్చిమ వాలుల్లో ఈ సంబంధం స్పష్టంగా కనిపించిందని పరిశోధకులు తెలిపారు.
నజ్ద్ పీఠభూమిలో ఫ్లింట్ రాళ్ల ముద్దలు కలిగిన సున్నపురాయి విస్తారంగా ఉండటంతో పాటు వర్షాకాలంలో నీరు లభించేదని డాక్టర్ మొహమ్మద్ అల్ కిందీ వివరించారు. మరోవైపు రబ్ అల్ ఖాలీ ఎడారిలోని అనేక ప్రాంతాల్లో ఫ్లింట్ కలిగిన రాళ్లు ఇసుక, అవక్షేపాల మందపాటి పొరల కింద కప్పబడి ఉండటంతో వాటిని చేరుకోవడం కష్టమని తెలిపారు.
ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన అరేబియా
'గ్రీన్ అరేబియన్ పెనిన్సులా'గా శాస్త్రీయంగా పిలిచే అరేబియా ద్వీపకల్పంలోని గత వాతావరణ మార్పులపై కూడా ఈ అధ్యయనం వెలుగునిచ్చింది. ఒకప్పుడు వర్షాలు, మంచినీటి సరస్సులు, నదులతో కొన్ని ప్రాంతాలు పచ్చదనంతో ఉండేవని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అయితే ప్రాచీన మానవుల నివాసాలు మొత్తం ఎడారి ప్రాంతమంతా విస్తరించకుండా, నీరు మరియు పనిముట్ల తయారీకి అనువైన రాళ్లు రెండూ లభించే కొన్ని ప్రత్యేక ప్రాంతాలకే పరిమితమయ్యాయని అధ్యయనం పేర్కొంది. విశాలమైన ఎడారిలో అక్కడక్కడా ఉన్న ద్వీపాల మాదిరిగా ఈ నివాస ప్రాంతాలు ఉండేవని పరిశోధకులు వివరించారు.
ఈ పరిశోధనలో ఒమన్‌తో పాటు పోర్చుగల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అల్గార్వే, ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నా, నేచురల్ హిస్టరీ మ్యూజియం, చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, అమెరికాలోని కెంట్ స్టేట్ యూనివర్సిటీ, క్లీవ్‌ల్యాండ్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో బెడ్ఫోర్డ్ స్కూల్ రెండో అంతర్జాతీయ క్యాంపస్
- కువైట్‌లో ప్రవాసులకు బ్యాంకు రుణాలపై కొత్త ఆంక్షలు..!!
- అరేబియా ఎడారిలో ప్రాచీన మానవుల నివాస రహస్యాలు..!!
- దుబాయ్‌లో అపార్ట్మెంట్ CCTV ఫుటేజీని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయవచ్చా?
- ఆరోగ్య రంగంలో ఏఐ.. ఖతార్ లో కీలక కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!
- పెంపుడు జంతువులను వదిలేస్తే BD5000 జరిమానా..!!
- నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను సమీక్షించిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్..
- దోహాలో బిర్లా పబ్లిక్ స్కూల్ 23వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు..
- షార్జాలో ట్రక్కు డ్రైవర్లకు భారీ జరిమానా హెచ్చరిక!







