అమరావతిలో బెడ్‌ఫోర్డ్ స్కూల్ రెండో అంతర్జాతీయ క్యాంపస్

- November 29, 2026 , by Maagulf
అమరావతిలో బెడ్‌ఫోర్డ్ స్కూల్ రెండో అంతర్జాతీయ క్యాంపస్

అమరావతి: అమరావతిలో బెడ్‌ఫోర్డ్ స్కూల్ అంతర్జాతీయ క్యాంపస్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆ సంస్థ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఇవాన్ లాయిడ్ అన్నారు. 474 ఏళ్ల విద్యా వారసత్వం కలిగిన బెడ్‌ఫోర్డ్ స్కూల్‌కు ప్రపంచంలోనే రెండో అంతర్జాతీయ క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయడం ప్రత్యేకమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు అమరావతి అనువైన నగరం గా మారుతుందని అభిప్రాయపడ్డారు.

ఆదివారం అమరావతిలో నిర్వహించిన బెడ్‌ఫోర్డ్ స్కూల్ భూమిపూజ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది పంజాబ్‌లోని మొహాలీలో తొలి అంతర్జాతీయ క్యాంపస్‌ను ప్రారంభించామని తెలిపారు. ఇప్పుడు రెండో క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ (హెచ్ఈఏ), మా లక్ష్మి గ్రూప్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.

విద్యార్థుల్లో విద్యతో పాటు సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. అమరావతి క్యాంపస్ భారత్, బ్రిటన్ మధ్య విద్యా, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ - ఎక్సైజ్, గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటు అమరావతి అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. నగరాన్ని విద్య, విజ్ఞానం, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి సంస్థలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రానున్న రెండు సంవత్సరాల లో అమరావతి కొత్త రూపును సంతరించుకోనుందన్నారు.

హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ, మా లక్ష్మి గ్రూప్ ఛైర్మన్ హరీష్ చంద్ర ప్రసాద్ యార్లగడ్డ మాట్లాడుతూ, బెడ్‌ఫోర్డ్ స్కూల్‌ను అమరావతికి తీసుకురావడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయాలన్న దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులను చదువులోనే కాకుండా నైతిక విలువలు, మానవత్వం, సామాజిక బాధ్యత కలిగిన ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అత్యున్నత స్థాయి విద్యను రాష్ట్ర విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు.

ఎనిమిది ఎకరాల్లో నిర్మించనున్న ఈ పాఠశాలలో 3 నుంచి 18 ఏళ్ల వయస్సు గల బాలబాలికలకు బ్రిటిష్ విద్యా విధానంలో బోధన అందిస్తారు. డే స్కూల్‌తో పాటు బాలురు, బాలికలకు ప్రత్యేక హాస్టల్ సదుపాయాలు కల్పిస్తారు. ఆధునిక తరగతి గదులు, సైన్స్ ప్రయోగశాలలు, డిజిటల్ విద్యా సదుపాయాలు, కళలు, సంగీతం, నృత్యం, క్రీడలు, స్విమ్మింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ, విజయవాడ భాగస్వామ్యంతో మా లక్ష్మి గ్రూప్ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. పాఠశాలను 2028 ఏప్రిల్‌లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీ డైరెక్టర్ కనూరి శేషుబాబు, మా లక్ష్మి ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ మండవ, హెచ్ఈఏ కార్యదర్శి కిషోర్, యూకే కు చెందిన ఎన్నారై వంశీ,  ఆర్కిటెక్ట్ దినేష్ వర్మ, యార్లగడ్డ తేజస్విని తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com