ఏటీఎం వినియోగదారులకు అలర్ట్..ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు

- November 29, 2026 , by Maagulf
ఏటీఎం వినియోగదారులకు అలర్ట్..ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు

మీ దగ్గర ఏటీఎం కార్డు ఉందా? తరచూ ఏటీఎం కేంద్రాలకు వెళ్లి నగదు ఉపసంహరించుకుంటున్నారా? అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన తాజా మార్గదర్శకాలను తెలుసుకోవాలి. ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణ, ఉచిత లావాదేవీల పరిమితి, అదనపు ఛార్జీలకు సంబంధించి ఆర్బీఐ నవంబర్ 27, 2026న కొత్త సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఖాతాదారులకు నెలకు ఎన్ని ఉచిత లావాదేవీలు ఉంటాయి? పరిమితి దాటితే ఎంత ఛార్జీ చెల్లించాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సొంత బ్యాంకు ఏటీఎంలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలు

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం సేవింగ్స్ ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇందులో నగదు ఉపసంహరణతో పాటు బ్యాలెన్స్ చెక్ వంటి ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు కూడా ఉంటాయి. ఈ పరిమితి ప్రతి నెలకు వర్తిస్తుంది.

ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఎన్ని ఉచితం?

ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించే ఖాతాదారులకు ప్రాంతాన్ని బట్టి ఉచిత లావాదేవీల పరిమితి ఉంటుంది.

మెట్రో నగరాల్లో: నెలకు మూడు ఉచిత లావాదేవీలు.
నాన్-మెట్రో ప్రాంతాల్లో: నెలకు ఐదు ఉచిత లావాదేవీలు.
ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలను ఆర్బీఐ మెట్రో కేంద్రాలుగా గుర్తించింది. మెట్రో, నాన్-మెట్రో ప్రాంతాల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంలను కలిపి ఉపయోగించినా మొత్తం ఉచిత లావాదేవీల సంఖ్య ఐదుకు మించకూడదు.మ్యాప్‌లు చూడండి

ఉచిత పరిమితి దాటితే రూ.23 ఛార్జీ

నెలకు కేటాయించిన ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత చేసే ప్రతి అదనపు లావాదేవీపై బ్యాంకులు గరిష్ఠంగా రూ.23 ఛార్జీ విధించవచ్చు. దీనికి అదనంగా వర్తించే పన్నులు కూడా చెల్లించాలి. అయితే బ్యాంకులు తమ నిర్ణయం మేరకు ఖాతాదారులకు మరిన్ని ఉచిత లావాదేవీలను అందించవచ్చు. ఛార్జీల విషయంలో బ్యాంకులు తమ బోర్డు ఆమోదించిన విధానాన్ని అనుసరించాలి.

ఒక్కో లావాదేవీలో గరిష్ఠంగా రూ.10 వేల నగదు

కొత్త మార్గదర్శకాల్లో మరో ముఖ్యమైన అంశం ఉంది. ఏటీఎం ద్వారా చేసే ఒక్కో నగదు ఉపసంహరణ లావాదేవీకి గరిష్ఠ పరిమితి రూ.10,000గా పేర్కొన్నారు. కాబట్టి ఒకేసారి అంతకంటే ఎక్కువ నగదు అవసరమైతే బ్యాంకు నిర్దేశించిన పరిమితులను దృష్టిలో పెట్టుకోవాలి.

ఫెయిల్ అయిన లావాదేవీలకు ఛార్జీలు ఉండవు

ఏటీఎంలో సాంకేతిక సమస్యలు, కమ్యూనికేషన్ లోపాలు, నగదు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో లావాదేవీ విఫలమైతే దాన్ని చెల్లుబాటు అయ్యే లావాదేవీగా పరిగణించకూడదు. బ్యాంకు లేదా సేవా సంస్థకు సంబంధించిన సమస్యల వల్ల విఫలమైన లావాదేవీలకూ ఛార్జీలు విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తప్పు పిన్ లేదా ధృవీకరణ సమస్యల కారణంగా తిరస్కరించిన లావాదేవీలను కూడా ఉచిత లావాదేవీల లెక్కలో చేర్చకూడదు.

ఉచిత లావాదేవీల వివరాలు కస్టమర్లకు తెలియజేయాలి

ఖాతాదారులు ఇప్పటికే ఎన్ని ఉచిత లావాదేవీలు ఉపయోగించుకున్నారు? ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? పరిమితి దాటితే ఎంత ఛార్జీ పడుతుంది? అనే వివరాలను తెలియజేసే వ్యవస్థను బ్యాంకులు ఏర్పాటు చేయాలి. అలాగే గరిష్ఠ నగదు ఉపసంహరణ పరిమితి, ఉచిత లావాదేవీలు, అదనపు ఛార్జీల వివరాలను ఏటీఎం కేంద్రాల్లో ఇంగ్లీష్, హిందీ, స్థానిక భాషల్లో ప్రదర్శించాలి. కాబట్టి ఏటీఎం కార్డులు ఉపయోగించే ఖాతాదారులు తమ నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిని గమనించుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించేటప్పుడు ఉచిత లావాదేవీల సంఖ్యను గుర్తుంచుకోవడం మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com