భారతీయ సినిమా అభివృద్ధే ఇండీవుడ్‌ ఆశయం - సోహన్ రాయ్

- September 23, 2016 , by Maagulf
భారతీయ సినిమా అభివృద్ధే ఇండీవుడ్‌ ఆశయం - సోహన్ రాయ్

చదివింది మెరైన్‌ ఇంజినీరింగ్‌... బాధ్యతలు నిర్వహించింది మెరైన్‌ ఆర్కిటెక్‌, నావెల్‌ డిజైనర్‌గా... ఇలాంటి వృత్తిలో దశాబ్దాలుగా రాణించే వ్యక్తికి, అసలు సినిమాలు చూడడానికే తీరిక ఉండదు. అలాంటిది సినిమా మీద ఉన్న అనురక్తితో అందుకు తగిన అర్హతలు పొంది సినిమా తీయడమే కాదు, ఆ రంగం అభివృద్ధి కోసం అంతర్జాతీయ స్థాయిలో ఓ వేదికను రూపొందించడం సామాన్యమైన విషయం కాదు. అలాంటి అసాధారణమైన అంశాన్ని సాధించిన వ్యక్తే సోహన్‌ రాయ్‌. దేశంలోనే తొలి మెరైన్‌ ఆర్కిటెక్ట్‌ అయిన ఆయన భారతీయ సినిమా రంగం అభివృద్ధి కోసం 'ఇండీవుడ్‌' అనే వేదిక ఏర్పాటు చేశారు. ఇండీవుడ్‌ ఆధర్వ్యంలో రామోజీ ఫిలింసిటీలో నేటి నుంచి ఫిలిం కార్నివాల్‌ మొదలవుతున్న నేపథ్యంలో సోహన్‌ రాయ్‌ తన మనో భావాలను 'ఈనాడు సినిమా'తో పంచుకున్నారు...


మెరైన్‌ ఇంజినీరింగ్‌- సినిమాలు... ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. అటు నుంచి ఇటు రావడానికి కారణం? 
సినిమా నా ప్యాషన్‌. ఇంజినీరింగ్‌ తర్వాత నేను కొన్ని రోజులు సినిమాల్లో పని చేశాను. అయితే కుటుంబ సభ్యుల సూచనల వల్ల ఇంజినీరింగ్‌ వైపు వెళ్లాను. షిప్‌ డిజైనర్‌గా మారాను. అందులో నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తర్వాత మళ్లీ సినిమాలవైపు వెళ్లాలనిపించింది. హాలీవుడ్‌ ఫిల్మ్‌ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిప్లమో చేశాను. 2008లో 'డ్యామ్‌ 999' చేయాలని నిర్ణయించుకున్నాను. నా తొలి సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని అనుకున్నాను. భారతదేశంలో 2డీ నుంచి 3డీకి కన్వర్ట్‌ అయిన తొలి సినిమా ఇది. తొలి 4కె మూవీ కూడా ఇదే. ఆ సినిమా విడుదల తర్వాత మన భారతీయ సినిమా సాంకేతికత నా సినిమా హ్యాండిల్‌ చేసే స్థాయికి చేరుకోలేదని అర్థమైంది. 4కెలో సినిమా తీస్తే అది నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకునేసరికి 1కెగా మారింది. దీంతో నాణ్యత తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మన పరిశ్రమ పరిస్థితులు మారాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే ఈఇండీవుడ్‌ ఫెస్టివల్‌ తీసుకొచ్చాం. అదే మా ఫెస్టివల్‌ ఉద్దేశం కూడా.

 

'డ్యామ్‌ 999' చిత్రీకరణలో ఎదురైన ఇబ్బందులు. 
సాంకేతికతతో ఇబ్బందులను అధిగమించొచ్చు. 'డ్యామ్‌ 999' చిత్రీకరణ విషయంలోనూ అదే జరిగింది. మా సినిమా కోసం 20 నిమిషాల సన్నివేశాన్ని ఓ భారీ టన్నెల్‌లో చిత్రీకరించాలి. దీని కోసం 3,30,000 టన్నెల్‌ వినియోగించాను. దీన్ని మన సముద్ర జలాల్లో నిలపడం కష్టం. అందుకే మధ్యదరా సముద్రంలో ఆ సన్నివేశాలు తీశాం. పది రోజులపాటు జరిగిన ఆ చిత్రీకరణ పూర్వ నిర్మాణకార్యక్రమాల కోసం 40 రోజులు శ్రమించాం.

 

సినిమా - ఛారిటీ కలయిక... 'జలం'. దీని ప్రభావం ఎంతవరకు కనిపించింది? 
సినిమాల ద్వారా కూడా సేవ చేయొచ్చన్నది నా ఆలోచన. అందుకే 'జలం' అనే సినిమా చేశాను. ఈ సినిమాను ఇప్పటికీ కొన్ని థియేటర్లు, కమ్యూనిటీలు, పాఠశాలలో ప్రదర్శిస్తున్నాం. ఇటీవల కేరళలో ఓ పాఠశాలలో ప్రదర్శిస్తే దాన్ని చూసిన అక్కడి విద్యార్థులు చలించిపోయారు. వారంతా ప్రవాస భారతీయుల పిల్లలు. సినిమా పూర్తయ్యాక వాళ్లంతా కలిసి ఇల్లు లేని నిరుపేదలకు పది ఇళ్లు కట్టించివ్వాలని నిర్ణయించుకున్నారు. వాళ్ల ఆలోచన నచ్చి ఆ పాఠశాల యాజమాన్యం మరో 15 ఇళ్లు నిర్మించడానికి అంగీకరించింది. అలా ఒక్క సినిమా ప్రదర్శన వల్ల 25 ఇళ్లు పేదలకు అందుతున్నాయి.

ఏరీస్‌ క్రియేషన్‌ గురించి చెబుతారా? 
యువతలో ప్రతిభను బయటకు తీసుకురావాలనే ఆలోచనకు రూపమే ఈ ఏరీస్‌ క్రియేషన్స్‌. 2004లో ప్రారంభించిన దీని ద్వారా టాలెంట్‌ హంట్‌ నిర్వహిస్తుంటాం. అలా కేరళలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వందల మంది కళాశాల విద్యార్థులు వచ్చారు. 'ప్రేమమ్‌' నివిన్‌ పౌలీ, అల్ఫాన్సో పుత్రేన్‌ లాంటివాళ్లు ఆ హంట్‌లో వెలుగులోకి వచ్చినవాళ్లే. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ టాలెంట్‌ హంట్‌ నిర్వహిస్తున్నాం.
ప్రపంచంలోనే తొలి త్రీడీ వెబ్‌సైట్‌ రూపొందించారు... ఈ ఆలోచన ఎలా వచ్చింది? 
'డ్యామ్‌ 999' సినిమా పూర్తయ్యాక త్రీడీ గురించి ప్రజలకు బాగా తెలియాలంటే ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించడం మంచి ఆలోచన అనిపించింది. అలా ఆ సినిమా పేరుతో త్రీడీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేశాం. త్రీడీ అనేది నా ప్యాషన్‌. అందుకే అంతర్జాతీయ త్రీడీ అసోసియేషన్‌లోనూ సభ్యుడినయ్యాను. అక్కడ నేర్చుకున్న విషయాలతో 'సెయింట్‌ డ్రాకులా త్రీడీ' సినిమా రూపొందించాం.


'డ్యామ్‌ 999'లో ఎక్కువ భాగం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారు. ఆ అనుభవాలు చెబుతారా? 
సినిమాను 45 రోజులపాటు రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కించాం. అండర్‌ వాటర్‌, డ్యామ్‌ సన్నివేశాల లాంటివి ఇక్కడ చిత్రీకరించినవే. ఫిలింసిటీలో పని చేసే సిబ్బంది చాలా నిబద్ధతతో ఉంటారు. ఈ సినిమా క్లైమాక్స్‌ కోసం వందల మంది బురదలో ఉండిపోయే సన్నివేశం తీయాలి. దీని కోసం ఉదయాన్నే 6.30కు చిత్రీకరణ ప్రారంభించాం. మధ్యాహ్నం మూడు గంటలకు భోజనం కోసం చిత్రీకరణ ఆపేద్దాం అనుకున్నాం. అయితే ఫిలింసిటీ సిబ్బంది ఇప్పుడు భోజనం వద్దు సర్‌... షూటింగ్‌ కొనసాగిద్దామన్నారు. అలా కొనసాగించిన చిత్రీకరణ రెండో రోజు ఉదయం 6.30 వరకు సాగింది. ఇంతసేపు పని చేసే సిబ్బంది రామోజీ ఫిలింసిటీలో తప్ప ఎక్కడా ఉండరు. సాంకేతికతను ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇలాంటి సిబ్బంది మాత్రం ఇక్కడే ఉంటారు.


ఆస్కార్‌ రేసులో భారతీయ సినిమాలు నిలవడం గగనమైపోయిన రోజులివి. దీనికి మీరేమంటారు? 
భారతీయ సినిమాలు ఆస్కార్‌ పోటీలో నిలవడం అంటే... విదేశీ చిత్ర విభాగం ఒకటే ఉంది అనుకుంటున్నారు మన సినిమా పెద్దలు. గతంలో మ్యూజిక్‌ సినిమా విభాగం ఒకటి ఉండేది. ఒక సినిమాలో ఐదు పాటలుంటే చాలు... అది ఆస్కార్‌ మ్యూజిక్‌ సినిమా విభాగంలో పోటీ అర్హత సాధిస్తుంది. గత 20 ఏళ్లుగా ఈ విభాగంలో ఏటా ఒకటి, రెండు మాత్రమే మన దేశం నుంచి వెళ్లేవి. మన సినిమాలో ఐదు పాటలుండటం అనేది సాధారణమైన విషయం. అలాంటిది ఎందుకు కుదరదు? ఈ విషయంలో మన వాళ్లకు అవగాహన లేక పోటీకి సినిమాలు పంపించడం లేదు. దీంతో గతేడాది నుంచి ఆ విభాగాన్నే తీసేశారు. ఆస్కార్‌ సభ్యులతో మాట్లాడి ఆ విభాగాన్ని పునరుద్ధరించి, మనం సినిమాలు పంపితే మనం ఆస్కార్‌ సాధించడం పెద్ద విశేషం కాదు.


ప్రాజెక్ట్‌ డిజైనింగ్‌ అనే ఒక విభాగాన్ని ప్రవేశపెట్టింది మీరు... ఎలా వచ్చిందా ఆలోచన? 
సినిమా కథ అనుకున్నది మొదలు, కాస్టింగ్‌, సెట్లు, చిత్రీకరణ ప్రదేశాలు, ప్రచారం... ఇలా చాలా పనులు ఉంటాయి. వీటన్నింటిని చూసుకునేది ప్రాజెక్ట్‌ డిజైనరే. నా వరకు సినిమాకు ఈ విభాగం చాలా ముఖ్యం. నాతో మొదలైన ఈ విధానం ఇప్పుడు చాలా సినిమాల్లో కొనసాగుతోంది.

'బర్నింగ్‌ వెల్స్‌' సినిమా గురించి చెబుతారా? దాని పనులు ఎంతవరకు వచ్చాయి. 
కువైట్‌ యుద్ధం నేపథ్యంలో 'బర్నింగ్‌ వెల్స్‌' రూపొందిస్తున్నాం. రూ.175 కోట్ల భారీ బడ్జెట్‌ రూపొందుతున్న ఈ సినిమా కథ సిద్ధమైంది. మలయాళంలో 145 సినిమాలు రూపొందించిన ప్రముఖ దర్శకుడు ఐ.వి.శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం సినిమా కథ సిద్ధమైంది. ఇండీవుడ్‌ ఫెస్టివల్‌లో సినిమా స్క్రిప్ట్‌ లాంచ్‌ చేస్తున్నాం. ఇది శశి రిటైర్‌మెంట్‌ సినిమా. సినిమాల నుంచి రిటైర్‌ అయ్యేలోగా అంతర్జాతీయ స్థాయి సినిమా చేయాలన్నది ఆయన ఆలోచన. దీనికి దర్శకత్వంతోపాటు ప్రాజెక్ట్‌ డిజైనింగ్‌ కూడా చేస్తున్నా. దేశంలో ప్రతి చిత్రపరిశ్రమ నుంచి ఓ కథానాయకుడిని ఈ సినిమాలో తీసుకోవాలన్నది మా ఆలోచన. అరబిక్‌, ఇంగ్లిష్‌, హిందీలో సినిమా ఉంటుంది. మరో 30 భాషల్లో అనువాదం చేసే ఆలోచన ఉంది. అంతర్జాతీయ సినిమాల స్థాయిలో సినిమాకు బీమా చేయిస్తున్నాం.
ఇదీ ఇండీవుడ్‌ ఆశయం ఇం డీవుడ్‌ ఐదు సంవత్సరాల ప్రాజెక్ట్‌. భారతీయ చిత్ర పరిశ్రమను పూర్తిగా సంస్కరించడం ఈ ప్రాజెక్ట్‌ ఉద్దేశ్యం. 70 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రారంభించాం. చిత్రపరిశ్రమలో సంస్కరణలకు నాంది పలికింది రామోజీ ఫిల్మ్‌సిటీనే. అందుకే ఇక్కడి నుంచే మా ప్రయత్నం ఇండీవుడ్‌ రూపంలో ప్రారంభిస్తున్నాం. భారతీయ చిత్రపరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమ. అయితే సాంకేతికత వినియోగంలో మనం వెనుకంజలో ఉన్నాం. దేశంలో టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌... అంటూ వుడ్‌ల సంస్కృతి పోవాలి. దేశంలో పరిశ్రమలన్నీ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి. దీని కోసం ఇండీవుడ్‌ చక్కటి ప్లాట్‌ఫామ్‌ అవుతుంది. ఇండీవుడ్‌లో మాట్లాడుకున్నవి డాక్యుమెంటేషన్‌ చేస్తాం. అవి ప్రభుత్వానికి పంపిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయి. దేశంలో జరుగుతోన్న తొలి సినిమా కార్నివాల్‌ ఇది


నవరసాలతో 'డ్యామ్‌ 999'  
తొ మ్మిది పాత్రలు... తొమ్మిది రసాలు... ఓ పురాతన డ్యామ్‌... వీటి చుట్టూ అల్లుకున్న కథే 'డ్యామ్‌ 999'. సోహన్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 38 అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అందరి ప్రశంసలు అందుకొంది. ఈ సినిమాకోసం కర్టెన్‌రైజర్‌గా రూపొందించిన 'డ్యామ్స్‌- ది లేథల్‌ వాటర్‌ బాంబ్స్‌' డాక్యుమెంటరీ కూడా పురస్కారాలు అందుకుంది. చైనాలోని పురాతన బాన్‌కియో డ్యామ్‌ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రకృతి వైపరీత్యం కారణంగా 1975లో చైనాలోని పాత 'బాన్‌కియో డ్యామ్‌' పగిలి సుమారు రెండు లక్షల యాభై వేల మంది జీవితాలు నాశనం అయిన సంఘటనను ప్రపంచం మర్చిపోలేదు. అలాంటి కథను సైన్స్‌ఫిక్షన్‌లో త్రీడీ చిత్రంగా మలిచి 2011లో విడుదల చేశారు. ఈ చిత్రంలో హాలీవుడ్‌తో పాటు భారతీయ నటులూ కీలక పాత్రలు పోషించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లో 84వ ఆస్కార్‌ పురస్కారాలకు నామినేట్‌ చేయబడిన చిత్రం 'డ్యామ్‌ 999'. చైనా గోల్డెన్‌ రూస్టర్‌ పురస్కారాలకు ఎంపిక చేయబడిన తొలి భారతీయ చిత్రమిదే కావడం విశేషం.


మహిళ జీవన పోరాటం 'జలమ్‌'  
ప్ర మాదంలో భర్తను కోల్పోయి ఓ మహిళ సమాజం నుంచి పలు సమస్యలు ఎదుర్కొంటుంది. వాటన్నింటికీ దూరంగా తన కొడుకుతో కలిసి జీవించడానికి ఆమె సాగించిన ప్రయాణం నేపథ్యంగా సాగే కథే మలయాళ చిత్రం' జలమ్‌' ప్రియాంక నాయర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి సోహన్‌రాయ్‌ నిర్మాత. ప్రపంచంలోనే తొలి ఛారిటీ మూవీగా ఈ చిత్రం గుర్తింపు పొందింది. 88వ ఆస్కార్‌ పురస్కారాలకు మన దేశం నుంచి నామినేట్‌ చేయబడిన చిత్రాలతో 'జలమ్‌' పోటీ పడింది. ఎమ్‌.పద్మకుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com