మహార్నవమి ఆయుధపూజ ప్రాముఖ్యత: స్పెషల్ స్టోరీ

- October 09, 2016 , by Maagulf
మహార్నవమి  ఆయుధపూజ ప్రాముఖ్యత: స్పెషల్ స్టోరీ

శరన్నవరాత్రులలో ఈరోజు మహార్నవమి. మహిషాసురుని అదేవిధంగా శుంభనిశుంభులను వధించిన దుర్గాదేవి అత్యంత రౌద్రంగా ఈరోజు మనకు అమ్మ దర్శనం ఇస్తుంది. విజయవాడ కనకదుర్గమ్మ మైసూర్ చాముండేశ్వరీ దేవి కలకత్తా కాళీమాత ఆలయాలలో ఈరోజు అమ్మవారి రౌద్ర రూపం చూసే వారికి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది.అమ్మవారి కోపాన్ని తగ్గించి శాంత మూర్తిగా మార్చడానికి ఈరోజు అన్ని ఆలయాలలోను కుంకుమార్చనలు చేస్తారు. అంతేకాకుండా ఈ శరన్నవరాత్రులలో దుర్గా దీక్ష చేపట్టి భవానీ మాలలు వేసుకున్న వేలాది మంది భక్తులు ఈరోజు అమ్మవారిని దర్శించుకుని విజయదశమి ఉదయం నుండి తమ దీక్షలను విరమిస్తారు. ఈరోజు దేవి ఆలయాలలో అమ్మవారి విశేష పూజలు జరుగుతూ ఉంటే ఈ మహర్నవమి రోజున ఆయుధాలకు పూజలు కూడ చేస్తూ ఉంటారు.ఈ ఆయుధపూజను దక్షిణ భారతదేశంలో జరుపుకునే ప్రత్యేక పండుగలలో ఒకటిగా గుర్తిస్తారు.నవరాత్రులను ఉత్తర భారతదేశంలో చాలా ఉత్సాహముతో మరియు వైభవముగా జరుపుకుంటే, భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతాలలో దీనిని చాలా విభిన్నరీతులలో జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ నవమి రోజున జరిగే ఆయుధ పూజ చాల ముఖ్యమైంది. ఈ రోజు ఆయుధాలు మరియు పనిముట్లకు భక్తులు పూజలు చేస్తారు.ఈ ఆయుధ పూజలు వెనుక అనేక వివిధ పురాణ గాధలు ఉన్నాయి. అష్టమి మరియు నవమి సంధి సమయంలో మాత మహిషాశురుడిని సంహరించిన తరువాత, నవమి నాడు ఆమె ఆయుధ విసర్జన చేసింది. గేదె రూపంలో ఉన్న రాక్షసుడిని సంహరించిన తరువాత ఆమె ఆయుధాలకు పూజలు చేశారు.కాబట్టి మహిషాశుర సంహారానికి గుర్తుగా ఈ ఆయుధపూజను జరుపుకుంటారు. ఆయుధపూజ గురించి మరో పురాణం మహాభారతానికి సంబంధించినది. 13 సంవత్సరాల వనవాసం కొరకు పాండవులు తమ ఆయుధాలను ఒక శమీ వృక్షం లోపల దాచారు. కురుక్షేత్ర యుద్దానికి బయలుదేరే ముందు, వారు వారి ఆయుధాలకు పూజలు చేశారు. ఈ పూజల వలన పాండవుల విజయం సాధించారు అని నిరూపించడానికి ఇది ఒక సాక్ష్యం. 
ఈ పదిరోజులుగా జరుగుతున్న దేవీనవరాత్రులలో అమ్మను నిష్ఠగా పూజించి ఆమెను ప్రసన్నరాలుని చేసుకోగలిగితే మన శరీరంలోని సూక్ష్మ రూపాన్ని మనం తెలుసుకోగలుగు తామని సాధకులు చెపుతారు. అంతేకాదు అనేక మంత్ర తంత్రాలు పట్టుదలతో సాధన చేయడానికి సాధకులు ఈ శరన్నవరాత్రులను చాల దీక్షతో సాధన చేస్తూ అమ్మ కృపను పొందడానికి ఈ దేవి నవరాత్రులను ఒక సాధనగా మార్చుకుంటారు. ఈరోజు అమ్మవారికి పరమాన్నం నివేదన చేసి అమ్మ దయను పొందుదాం..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com