ఎర్రసూరీడు అస్తమించాడు...
- November 28, 2016
ఎర్రసూరీడు అస్తమించాడు. నిత్య శ్రామికుడుగా క్యూబాను శ్రేయోరాజ్య నమూనాగా మార్చిన ఫిడెల్ క్యాస్ట్రో.. ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తి వెళ్లిపోయారు. సామ్రాజ్యవాదానికి తలవంచని ధీరుడుగా, తనపై జరిగిన ఎన్నో హత్యాయత్నాలకు లొంగని నేర్పరిగా అగ్రరాజ్యాన్నే ఆశ్చర్యపరిచారు క్యాస్ట్రో. కమ్యూనిస్టు సిద్ధాంతాలను పరిరక్షిస్తూ.. ప్రపంచపటంలో క్యూబాకు విశిష్టమైన స్థానం కల్పించారు. అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటూనే శాశ్వతంగా వీడ్కోలు పలికారు.
ప్రపంచంలోని పీడిత ప్రజలతో విప్లవ అక్షరాలు దిద్దించిన నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలకు సామ్యవాద వెలుగులు ప్రసాదించారు. 1959 నుంచి దాదాపు 5 దశాబ్దాలు క్యూబాను అభివృద్ధి పథాన నడిపి చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించారు క్యాస్ట్రో. బటిష్టా అరాచక పాలన గుప్పిట్లో క్యూబా విలవిల్లాడుతున్న సమయంలో సామ్యవాదం లేదా మరణం అనే నినాదంతో 32 ఏళ్ల వయసులో ఉద్యమంలోకి అడుగుపెట్టారు. నియంతలపై పోరాటం ప్రారంభించారు. బటిష్టాను గద్దె తింపి క్యూబా పగ్గాలు చేపట్టారు. తను అధికారంలో ఉన్నంత వరకూ దాదాపు 5 దశాబ్దాలు అమెరికానే ఢీకొట్టారు. ఓరియెంట్ ఫ్రావిన్స్ లోని బిరాన్ అనే ఊరిలో 1926 ఆగస్టు 13న జన్మించారు క్యాస్ట్రో. పూర్తి పేరు ఫిడెల్ అలెజాండ్రో క్యాస్ట్రో. మార్క్సిస్టు- లెనినిస్టు భావాలకుతోడు క్యూబన్ జాతీయతను కలగలపి కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. రష్యా విప్లవం తరువాత క్యూబన్ రెవల్యూషన్‌కు అంతటి పేరు తీసుకొచ్చారు. పోరాట యోధుడుగా ఎంతోమంది విప్లవకారులకు, పోరాటాలకు కాస్ట్రో ప్రేరణ.
సింబల్ ఆఫ్ రెవల్యూషన్‌గా పేరుగాంచిన చేగువేరా కూడా కాస్ర్టోతో ప్రభావితులయ్యారు. క్యాస్ట్రో నోట వచ్చిన ప్రతి మాటా నిప్పు కణికే. ప్రతి పదం ఒక బుల్లెట్టే. విప్లవమనేది పూల పాన్పు కాదని.. గతం నుంచి భవిష్యత్తు వరకూ నిరంతరం జరిగే పోరాటం అన్నారు క్యాస్ట్రో. నిరక్షరాస్యులు, అమాయకులు, రోగులు, అన్నార్తులను చంపగలిగిన ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధాలు.. అమాయకత్వాన్ని, పేదరికాన్ని, ఆకలిని మాత్రం నిర్మూలించలేవని అభిప్రాయపడ్డారు. తన ఆరోగ్యంపై వెలువడే కథనాలపై కూడా స్పందించేవారు ఫిడెల్ క్యాస్ట్రో. 72లోనే తనది ఇనుపగుండెగా వర్ణించారు. 638 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినా.. తన ప్రాణాలు తీసేందుకు కొందరు రకరకాల వ్యూహాలు సిద్ధం చేసినా వాటిని చాకచక్యంగా తప్పించుకున్నారు. సిగార్లలో విషం నింపినా, అందమైన అమ్మాయిలతో, మాజీ భార్యతో విషప్రయోగం చేసే కుట్ర పన్నినా.. సముద్ర నత్తగుల్లల్లో చిన్న బాంబులు అమర్చినా.. వాటి నుంచి తప్పించుకున్నారాయన. మాఫియా పద్ధతుల్లో కూడా హతమార్చే ప్రయత్నాలు జరిగాయి. అన్నిటినీ తట్టుకుని.. 90 ఏళ్ల వయసు వరకూ జీవించి సహజ మరణం పొందారు క్యాస్ట్రో. అమెరికాకు కేవలం 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది క్యూబా. పాశ్చాత్య దేశాల ఆంక్షలను ఎదురొడ్డి నిలిచింది. ఆయన ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు దేశాన్ని సమూలంగా మార్చేశాయి. వివిధ రంగాల్లో ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాయి. దాదాపు 49 ఏళ్ల పాలన తర్వాత అనారోగ్యంతో తనకు తానుగా అధికారం నుంచి తప్పుకునేవరకూ క్యూబాకు తిరుగులేని నాయకుడు క్యాస్ట్రోనే. అనంతరం అధ్యక్షుడైన క్యాస్ట్రో సోదరుడు రౌల్.. USలో ఒబామా అధ్యక్షుడయ్యాక.. రెండు దేశాల మధ్య విద్వేషాలకు తెర దించాడు. క్యూబా చరిత్రలో కొత్త శకాన్ని ప్రారంభించారు. 82 మందితో విప్లవాన్ని ప్రారంభించానని చెప్పుకున్న క్యాస్ట్రో.. మరోసారి విప్లవాన్ని చేయాల్సివస్తే.. కేవలం 10, 15మందితో, సంపూర్ణ విశ్వాసంతో చేయగలనని ప్రకటించాడు. మన మీద మనకు విశ్వాసం ఉంచుకుని.. కచ్చితమైన కార్యాచరణ అనుసరిస్తే చిన్నవారైనా లక్ష్యం పెద్దదేం కాదన్నారు. విప్లవం ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని నిరూపించారు క్యాస్ట్రో. క్యూబాలో విప్లవం వల్ల తమ దేశంలో వేశ్యలు కూడా పట్టభద్రులయ్యారని గర్వంగా ప్రకటించారు. ఫిడెల్ క్యాస్ట్రో గురించి గుర్తు చేసుకోగానే.. మదిలో మెరిసేవి.. క్యాప్, సిగార్, గడ్డం. స్మోకింగ్, గడ్డం గురించి ఎన్నో సందర్భాల్లో వ్యాఖ్యానించారు క్యాస్ట్రో. గడ్డం తీయాలనే ఆలోచనే లేదన్నారు. తన గడ్డంతో దేశానికి సంబంధించిన ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయని.. దేశానికి ఏమేం చేయాలనుకుంటున్నానో అవన్నీ పూర్తి చేసి... ఉత్తమ ప్రభుత్వాన్ని అందించిన రోజు గడ్డాన్ని తీసేస్తానన్నారు. చివరకి వరకూ దేశం కోసమే జీవించారు. మరణం గురించి కూడా ముందే వ్యాఖ్యానించారు క్యాస్ట్రో. 90 ఏళ్లు సమీపిస్తుండడంతో కొన్ని రోజులకు లోకాన్ని వీడాల్సి ఉంటుందని.. అయితే క్యూబా కమ్యూనిస్టుల ఆశయాలు, ఆచరణ చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. దాన్ని నిజం చేస్తూ తను లోకాన్ని వీడిన ఆయన్ని కీర్తిస్తోంది ప్రపంచం. ఎర్ర సూరీడుగా ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటుంది.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









