రివ్యూ: మన్యంపులి
- December 02, 2016
తారాగణం: మోహన్‌లాల్.. కమలినీ ముఖర్జీ.. జగపతిబాబు.. నమిత తదితరులు
కథ.. కథనం: ఉదయ్‌కృష్ణ
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: షాజికుమార్
ఫైట్స్: పీటర్ హెయిన్స్
పాటలు: వెన్నెలకంటి..
వనమాలి
దర్శకత్వం: వైశాక్
నిర్మాత: సిందూరపువ్వు కృష్ణారెడ్డి
సంస్థ: సరస్వతిఫిలిమ్స్
విడుదల: 02-12-2016 మో హన్‌లాల్ తెలుగు చిత్ర పరిశ్రమకి కొత్తేం కాదు. అయితే చాలా రోజుల తర్వాత ఇటీవల వరుసగా 'మనమంతా'.. 'జనతాగ్యారేజ్' సినిమాలతో సందడి చేసి.. నవతరం ప్రేక్షకులకి మరింత చేరువయ్యారు. మలయాళంలో ఆయన నటించిన 'పులి మురుగన్' రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఆ చిత్రం తెలుగులో అనువాదం అవుతోందనగానే అందరిలోనూ ఆసక్తి. మరి 'మన్యంపులి'గా వచ్చిన ఆ సినిమాలో ఏముందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే?: అడవిపై ఆధారపడి బతికే కుటుంబంలో పుట్టినవాడు పులి కుమార్ (మోహన్‌లాల్). చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొని.. తండ్రిని కళ్లెదుటే పెద్ద పులి తినేస్తుంది. అప్పట్నుంచి తమ్ముడు సుబ్రమణ్యంకి అన్నీ తానై బతుకుతుంటాడు. తన తండ్రిని చంపిందన్న కోపంతో చిన్న వయసులోనే పులిని మట్టుబెడతాడు. ఆ తర్వాత అడవిలో ఉండే పులియూరుకి పులుల బెడద రాకుండా కాపాడుతుంటాడు. తన ప్రాణానికి ప్రాణమైన తమ్ముడు సుబ్రమణ్యంకి ఉద్యోగం ఇస్తామని ఆశ చూపడంతో అడవి నుంచి గంజాయిని డాడీ గిరిజ (జగపతిబాబు)కి చెందిన ఆయుర్వేద కంపెనీకి చేరవేస్తాడు.
కానీ.. డాడీ గిరిజ కంపెనీ ఆయుర్వేద మందులు తయారు చేయడం లేదనీ, అదో మత్తు మందుల కంపెనీ అని పులి కుమార్‌కి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేశాడు? పులికుమార్పై డాడీ గిరిజ ఎందుకు కక్ష కడతాడు? పులి కుమార్కీ మైనా (కమలినీ ముఖర్జీ).. జూలీ (నమిత)లకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? లాంటి విషయాలు చూడాలంటే వెండితెర మీద సినిమాను చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: అడవి నేపథ్యంలో సాగే ఓ మాస్ కథా చిత్రమిది. అడ్వెంచరస్‌గా సాగే యాక్షన్ సన్నివేశాలు.. విజువల్స్ చిత్రానికి ప్రధాన బలం. సినిమా ఆరంభమే ఆసక్తిని రేకెత్తిస్తుంది. కథానాయకుడు తెరపై కనిపించక మునుపే ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు. పులికుమార్ చిన్నప్పటి ఎపిసోడ్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సినిమా ఆరంభమైన తొలి ఇరవై నిమిషాల్లోనే బలమైన హీరోయిజంతో పాటు.. విలనిజం కూడా పండడం ఈ సినిమాకి బలం. మోహన్‌లాల్ తెరపై కనిపించడం.. ఆయన కూడా ఓ పులిని మట్టుబెట్టే సన్నివేశాల వరకు అంతా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కుటుంబ నేపథ్యంలో సన్నివేశాలు మొదలయ్యాక కథలో వేగం తగ్గినట్లు అనిపిస్తుంది.
అంతకుముందు సన్నివేశాలు రేకెత్తించిన ఉత్కంఠ.. ఆసక్తి తగ్గిపోతాయి. మళ్లీ డాడీ గిరిజ.. ఆయన కంపెనీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల వరకు డ్రామా పండదు. పులి నేపథ్యంలో వచ్చే తొలి అరగంట.. చివరి అర గంట సన్నివేశాలే సినిమాకి కీలకం. జగపతిబాబు పాత్రని మరింత కీలకంగా తీర్చిదిద్దాల్సింది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ కొన్ని ఎపిసోడ్స్‌ని తెరకెక్కించారు. ఆ సన్నివేశాలు అత్యంత సహజంగా అనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే?: పులి కుమార్ పాత్రలో మోహన్‌లాల్ ఒదిగిపోయారు. ఆయన చూపులు.. నటన.. యాక్షన్ నిజంగానే మరో పెద్ద పులిని గుర్తుకు తెప్పిస్తాయి. సెంటిమెంట్ సన్నివేశాల్లోనూ బాగా నటించారు. కమిలినీ ముఖర్జీ మేకప్ లేకుండా చాలా సహజంగా.. మోహన్లాల్కి భార్య పాత్రలో కనిపించింది.
నటనకి పెద్దగా ప్రాధాన్యం లేకున్నా.. 'మైనా' పాత్రలో ఆమె ఒదిగి పోయింది. సహజంగా నటించడంతో పాత్ర తప్ప అందులో కమలినీ కనిపించదు. డాడీ గిరిజ పాత్రలో జగపతిబాబు నటన ఆకట్టుకుంటుంది. నమిత పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. నాలుగైదు సన్నివేశాల్లో ఇలా కనిపించి అలా మాయమైపోతుందంతే. సాంకేతికంగా మాత్రం సినిమాకి పూర్తిస్థాయిలో మార్కులు పడతాయి. ముఖ్యంగా షాజికుమార్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. అడవి అందాల్ని అద్భుతంగా చూపించారు. పీటర్ హెయిన్స్ తీర్చిదిద్దిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకి మరింత కీలకం. పులి నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్ని చాలా సహజంగా తీర్చిదిద్దారు. నిజమైన పులితో పోరాడినట్టే ఆ సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. ఎక్కడా కూడా విజువల్ ఎఫెక్ట్స్ వాడినట్టు అనిపించదు. గోపీసుందర్ సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. నేపథ్య సంగీతం గుర్తుంటుంది. తెలిసిన కథే అయినా సాంకేతిక హంగులతో ఆసక్తికరంగా మార్చటంలో దర్శకుడు సఫలమయ్యారు. సాగదీత తగ్గితే బాగుండేది.
బలాలు
+ నటీ నటులు
+ యాక్షన్ సన్నివేశాలు
+ కెమెరా
+ సంగీతం
బలహీనతలు
- సాగదీత
- తెలిసిన కథే
చివరిగా.. ఈ 'మన్యం పులి' మాస్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
తాజా వార్తలు
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్‌ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!









