చిన్నారి సినిమా రివ్యూ

- December 16, 2016 , by Maagulf
చిన్నారి సినిమా రివ్యూ

రివ్యూ: 
సినిమా పేరు: చిన్నారి 
నటీనటులు: ప్రియాంక ఉపేంద్ర.. యువీన పార్థవి.. మధుసూధన్‌.. ఐశ్వర్య.. సందీప్‌.. శ్రీధర్‌ తదితరులు 
సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌ 
ఛాయాగ్రహణం: హెచ్‌సి వేణు 
నిర్మాత: కె.రవికుమార్‌ 
రచన - దర్శకత్వం: లోహిత్‌ 
విడుదల: 16-12-2016
భ యం కూడా ఓ కమర్షియల్‌ అంశం అయిపోయింది.

ఎంత బాగా భయపడితే.. ఆ సినిమా అంత మంచి విజయం సాధిస్తుంటుంది. అయితే భయపెట్టే టెక్నిక్‌లు ఎప్పుడూ ఒకేలా ఉంటే కుదరదు. వాటిని మార్చుకొంటూ వెళ్లాలి. కొత్తగా భయపెట్టే చిత్రాలకు.. కథలకే ప్రేక్షకులు ఓటేస్తున్నారు. తెలుగులో ఎంత విరివిగా హారర్‌ సినిమాలు వస్తున్నాయో.. మిగిలిన భాషల్లోనూ అంతే జోరుగా ఇలాంటి కథలు తయారవుతున్నాయి. 'కన్నడ'లో 'మమ్మీ'గా రూపొందిన ఓ చిత్రం మన ముందుకు 'చిన్నారి' పేరుతో వచ్చింది. మరి ఇందులో ఎలా భయపెట్టారు? కథ.. సాంకేతికంగా ఈ సినిమా ఎలా ఉంది? చూడాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే..: గోవాలోని జనసంచారం ఏ మాత్రం లేని ఓ తీర ప్రాంతంలో.. కొండల మధ్యన ఓ విలాసవంతమైన విల్లా. తన భర్త చివరి కోరిక మేరకు ఆ విల్లాలో నివాసం ఉండడానికి తన నాలుగేళ్ల కూతురు క్రియ (యువీన)తో అక్కడికి వస్తుంది ప్రియ (ప్రియాంక). లంకంత ఇంట్లో నలుగురే ఉంటారు. క్రియకు ఆడుకొనేందుకు ఎవరూ ఉండరు. దాంతో ఆ ఇంట్లోని స్టోర్‌ రూమ్‌లో ఉన్న ఓ బొమ్మతో స్నేహం చేస్తుంటుంది క్రియ. స్టోర్‌ రూమ్‌ నుంచి ఆ బొమ్మ ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. అప్పటి నుంచి ఆ ఇంట్లో వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయి.
క్రియ కూడా.. బొమ్మని బొమ్మలా చూడదు. ఓ స్నేహితురాలిగా భావిస్తుంటుంది. 'అమ్మ నేను దెయ్యాన్ని చూశాను' అని తల్లితో చెబుతుంటుంది. ఆ బొమ్మలో ఓ ఆత్మ ఉంది. అది క్రియతో స్నేహం చేస్తూ.. ఇంట్లో వాళ్లని ఓ ఆట ఆడించేస్తుంటుంది. మరి ఆ ఆత్మ ఎవరిది? క్రియతోనే ఎందుకు స్నేహం చేస్తోంది? అనే విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..: హారర్‌ చిత్రాల్లో కథ పెద్దగా వెదుక్కోవాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని భయపెట్టే సన్నివేశాలుంటాయంతే. ఉన్న ఆ చిన్న కథనే ఆసక్తిగా చెప్పేందుకు ప్రయత్నించింది 'చిన్నారి' బృందం. కథని ప్రారంభించిన విధానం బాగుంది. నేరుగా పాయింట్‌లోకి వెళ్లిపోయి.. ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌ మొదలెట్టారు. హారర్‌ని కొంచెం కొంచెం... రుచి చూపిస్తూ వెళ్లారు.
విశ్రాంతి ముందు ఏకంగా పది నిమిషాల సన్నివేశం ఒకటి సుదీర్ఘంగా సాగింది. ఆ సన్నివేశమైతే దడ పుట్టించడం ఖాయం. అలాగని దెయ్యాన్ని ఏమాత్రం చూపించలేదు. కేవలం తలుపు చప్పుళ్లతోనే.. ఏదో జరుగుతోందన్న భయం కల్పించాడు దర్శకుడు. ఆ పది నిమిషాలూ ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాల్ని అమాంతం పెంచేస్తాయి. చాలా సందేహాల్ని లేవనెత్తుతాయి. అయితే ద్వితీయార్థం ప్రారంభంలోనే ఆ ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు తేలిపోయినట్లుగా కనిపిస్తాయి. హారర్‌ కథలో ఓ భయంకరమైన సన్నివేశం చూపించి.. దాన్ని కలగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు దర్శకులు. అలాంటి టెక్నిక్స్‌ ఈ సినిమాలోనూ వాడారు. ద్వితీయార్థం అంతా ఆ బొమ్మలోకి ఆత్మ ఎందుకు వచ్చింది? అనే పాయింట్‌ మీద సాగుతుంది. అవి కాస్త సుదీర్ఘంగా సాగి.. విసుగు పుట్టిస్తాయి. అయితే.. పతాక సన్నివేశాల్లో మళ్లీ కథ ట్రాక్‌ ఎక్కుతుంది. అక్కడ కూడా ప్రేక్షకుల్ని భయపెట్టేశారు దర్శకులు.
ఎవరెలా చేశారంటే..: ఈ సినిమా అంతా రెండు మూడు పాత్రల చుట్టూనే సాగుతుంది. ప్రియాంక నటన ఆకట్టుకొంది. చిన్నారి క్రియగా నటించిన పాప.. ముద్దుముద్దుగా ఉంది. తన నటన కూడా అత్యంత సహజంగా అనిపించింది. మధుసూధన్‌ నటన మెప్పించింది. మిగిలిన వాళ్లంతా ఓకే. ఈ సినిమాకి ప్రధాన బలం.. నేపథ్య సంగీతం. చాలాసార్లు ఉలిక్కిపడేలా చేసింది. భయపెట్టే టెక్నిక్‌ కూడా కాస్త కొత్తగానే కనిపించింది. సినిమా అక్కడక్కడ డల్‌ అవుతూ వెళ్తుంది. అలాంటి సన్నివేశాలకు ముందే కత్తెర వేసుకొంటూ వెళ్లాల్సింది.
చిన్న కథని.. పరిమిత బడ్జెట్‌తో.. సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా ఉంది. హారర్‌ కామెడీ అంటూ.. లేనిపోని సన్నివేశాల్ని కలపకుండా కేవలం భయాన్ని భయంగానే చూపించారు.
బలాలు 
+ పాప నటన 
+ విశ్రాంతి ముందొచ్చే సన్నివేశం 
+ నేపథ్య సంగీతం
బలహీనతలు 
- నిదానమైన కథనం 
- ట్విస్టులు లేకపోవడం 
* చివరగా.. ఈ 'చిన్నారి' భయపెడుతుంది. 

ఈ చిత్రానికి మాగల్ఫ్ వారి రేటింగ్:​ 2.5/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com