వెట్రిమారన్ దర్శకత్వంలో జీవీ...

- January 08, 2017 , by Maagulf
వెట్రిమారన్ దర్శకత్వంలో జీవీ...

జీవీ.ప్రకాశ్‌కుమార్‌ ఈ పేరే ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌హాట్‌గా వినిపిస్తోంది. ఒక పక్క సంగీతదర్శకుడిగా, మరో పక్క కథానాయకుడిగా ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఇప్పటికే అరడజను చిత్రాల్లో నటిస్తున్న జీవీ కొత్త సంవత్సరంలో మరింత వేగం పెంచుతున్నారు. ఇటీవలే ఈటీ చిత్రం ఫేమ్‌ రవిఅరసు దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపిన ఈ యువ నటుడు తాజాగా మరో చిత్రానికి సై అన్నట్లు సమాచారం. దర్శకుడు వెట్రిమారన్ కు జీవీకి మధ్య మంచి ర్యాప్‌ ఉందని చెప్పవచ్చు. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన పొల్లాదవన్, ఆడుగళం, విచారణై చిత్రాలకు జీవీనే సంగీతదర్శకుడన్నది గమనార్హం. ఈ మూడు చిత్రాలు మంచి విజయాన్నే సాధించాయి. ఇక ఈ మూడు చిత్రాలతో నటుడు ధనుష్‌కు సంబంధం ఉంది.
పొల్లాదవన్, ఆడుగళం చిత్రాల కథానాయకుడు ఈయనే. ఇక విచారణై చిత్రానికి నిర్మాత ధనుష్‌ అన్న విషయం తెలిసిందే. 
ధనుష్‌ జీవీ.ప్రకాశ్‌కుమార్‌ల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని, ఇకపై తన చిత్ర యూనిట్‌కు సంబంధించిన వారెవరూ జీవీతో చిత్రాలు చేయరాదని ధనుష్‌ హుకం జారీ చేసినట్లు కోలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం. వెట్రిమారన్ కు నటుడు ధనుష్‌కు మధ్య సత్సంబంధాలున్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెట్రిమారన్ కోరిక మేరకు ఇటీవల ధనుష్‌ కొడి చిత్రాన్ని కూడా చేశారన్నది గమనార్హం. ప్రస్తుతం వెట్రిమారన్ ధనుష్‌ హీరోగా వడచెన్నై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్‌ ధనుష్‌ కోసం ఎదురు చూస్తోందని టాక్‌. ధనుష్‌ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఇన్నై నోక్కి పాయుమ్‌ తోట, తాను ముఖ్య పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న పవర్‌ పాండి చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.
ఇలాంటి పరిస్థితుల్లో వెట్రిమారన్ జీవీ.ప్రకాశ్‌కుమార్‌ హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. దీన్ని శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. మార్చిలో సెట్‌ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ధనుష్‌తో వరుసగా చిత్రాలు చేస్తున్న వెట్రిమారన్ ఇప్పుడు జీవీ.ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా చిత్రం చేయడం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com