బంగ్లాదేశ్‌ కోర్టు సంచలన తీర్పు..26 మందికి ఉరి..

- January 16, 2017 , by Maagulf
బంగ్లాదేశ్‌ కోర్టు సంచలన తీర్పు..26 మందికి ఉరి..
  • మరో 9 మందికి 7-17 ఏళ్ల జైలు

  • బంగ్లాదేశ్‌ కోర్టు సంచలన తీర్పు
  • దోషుల్లో కేబినెట్‌ మంత్రి అల్లుడు సయీద్‌
  • భద్రతా దళంలోని 15 మంది అధికారులు కూడా
  • ఇద్దరు కౌన్సిలర్ల మధ్య ఆధిపత్య పోరు..హత్యలు

రాజకీయ వైరంతో రెండేళ్ల కిందట ఏడుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన 26 మందికి బంగ్లాదేశ్‌ కోర్టు ఒకటి ఉరి శిక్ష విధించింది. మరో తొమ్మిది మందికి ఏడు నుంచి 17 ఏళ్ల వరకూ జైలుశిక్షలు విధించింది. మెడకు తాడు బిగించి చనిపోయే వరకూ 26 మందిని ఉరి తీయాలని నారాయణగంజ్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జి సయ్యద్‌ ఇనాయత హొస్సేన్‌ తీర్పు ఇచ్చారు.

దేశంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషుల్లో మాజీ సిటీ కౌన్సిలర్‌తోపాటు ప్రఖ్యాత భద్రతా దళమైన రాపిడ్‌ యాక్షన్‌ బెటాలియన్‌ (ఆర్‌ఏబీ)కి చెందిన ముగ్గురు సీనియర్‌ అధికారులు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్‌లోని అధికార అవామీ లీగ్‌ నాయకుల్లో ఆధిపత్య పోరు ఈ హత్యలకు ప్రధాన కారణం. కాగా, దోషుల్లో ఒకడైన బంగ్లాదేశ్‌ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్‌ కల్నల్‌ తరేక్‌ సయీద్‌ అక్కడి కేబినెట్‌ మంత్రికి అల్లుడు కావడం మరో విశేషం. నారాయణగంజ్‌ పట్టణంలో తనకు పోటీగా ఎదగుతున్న తమ పార్టీకే చెందిన కౌన్సిలర్‌ నజ్రుల్‌ ఇస్లామ్‌ను హతమార్చాలని అప్పటికే కౌన్సిలర్‌గా ఉన్న అవామీ లీగ్‌ జిల్లా అధ్యక్షుడు నూర్‌ హొస్సేన్‌ కుట్ర పన్నాడు.
ఇస్లామ్‌తోపాటు అతని నలుగురు అనుచరులను కిడ్నాప్‌ చేసి హతమార్చాలని భావించాడు. ఈ మేరకు ఆర్‌ఏబీ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి పెద్దఎత్తున డబ్బులు ముట్టచెప్పాడు. కిడ్నాప్‌ సమయంలో ఆ ఘటనను తన కెమెరాలో చిత్రీకరిస్తున్న ఓ లాయర్‌తోపాటు అతని డ్రైవర్‌ను కూడా నిందితులు కిడ్నాప్‌ చేశారు. మొత్తం ఏడుగురికీ కారులోనే విషం ఇంజక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత వారి పొట్టలను చీల్చి వేశారు. ఈ కేసులో హొస్సేన్‌తోపాటు 35 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో తరీక్‌ సయీద్‌తోపాటు మరో 15 మంది ఆర్‌ఏబీ అధికారులు ఉన్నారు. ఈ హత్యల తర్వాత హొస్సేన్‌ భారతకు పారిపోయాడు. పశ్చిమ బెంగాల్లో పోలీసులకు దొరికాడు. 35 మందీ దోషులుగా తేలారు. వీరిలో 12 మంది పరారీలోనే ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com