అమెరికా లో హెచ్-1బీ వీసాలపై కఠిన వైఖరి తగదు
- April 23, 2017
అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాల మంజూరును కఠినతరం చేయడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆ దేశం దృష్టికి తీసుకెళ్లారు. ఆ దేశ ఆర్థిక మంత్రి స్టీవెన్ మ్నూచిన్తో తొలిసారిగా సమావేశమైన సందర్భంగా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అంతకుముందు వాణిజ్యశాఖ మంత్రి విల్బర్ రాస్తోనూ చర్చించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచబ్యాంకుల వసంతకాల సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్లిన జైట్లీ వివిధ ద్వైపాక్షిక అంశాలతోపాటు దీనిపైనా దృష్టిసారించారు. శనివారం మ్నూచిన్తో జరిగిన సమావేశంలో ఇండో-యూఎస్ పెట్టుబడుల చొరవ, జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల నిధి (ఎన్ఐఎఫ్ఎఫ్), ఆకర్షణీయ నగరాల అభివృద్ధి తదితర విషయాలపై చర్చించారు. అమెరికా ఆర్థిక రంగ ప్రగతికి భారత నిపుణులు ఎంతగానే కృషి చేస్తున్నారని, వీసాల మంజూరులో ఉదారంగా ఉండాలని కోరారు. ఆయన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్, స్వీడన్, ఫ్రాన్స్, బంగ్లాదేశ్ ఆర్థిక మంత్రులతోనూ చర్చలు జరిపారు.
రుణాల కోటా సంస్కరణల్లో జాప్యం ఎందుకు?
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సమావేశాల్లో జైట్లీ మాట్లాడుతూ రుణాల కోటా విషయమై సంస్కరణలు చేపట్టడంలో జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్కరణలు చేపడితే వెనుకబడిన దేశాలకు మేలు కలుగుతుందని అన్నారు. పలు దేశాలు రక్షణాత్మక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతు పలకాలని కోరారు. ప్రపంచ బ్యాంకు మూల ధానాన్ని 50 శాతం మేర పెంచాల్సి ఉందని చెప్పారు.
జీఎస్టీతో మరింత వేగంగా ప్రగతి
వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని జైట్లీ తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీఎస్టీ కారణంగా పన్నుల మదింపు సులభతరమవుతుందని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆంక్షలు సడలించడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







