హైదరాబాద్‌లో ప్రవాసులకిక నిశ్చింత

- May 14, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో ప్రవాసులకిక నిశ్చింత

తె లంగాణ నుంచి విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, పర్యాటకులకు ఇక సమస్త సేవలు ఒకేచోట అందనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో దేశంలో తొలిసారిగా విదేశ్‌భవన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రవాస వ్యవహారాల మంత్రి కేటీఆర్‌ల చొరవతో ఈ ప్రాజెక్టు కార్యకూపం దాలుస్తోంది. విదేశాల్లో కార్మికులు మోసపోవడం, ఉద్యోగాలను కోల్పోడవం, దాడులకు గురికావడం, కేసుల్లో చిక్కుకోవడం, చనిపోయిన సందర్భాల్లో మృతదేహాలను స్వస్థలాలకు రప్పించడం వంటి సందర్భాల్లో రాష్ట్రప్రభుత్వం కేంద్రంపైనే పూర్తిగా ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ విదేశ్‌భవన్‌ ప్రతిపాదన చేశారు. దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి దీనిపై వినతిపత్రం ఇచ్చారు. దీన్ని ప్రధాని విదేశీ వ్యవహారాల శాఖకు పంపించారు. మంత్రి కేటీఆర్‌ ఈ నెల ఎనిమిదో తేదీన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై నివేదిక ఇచ్చారు. దీనికి సుష్మాస్వరాజ్‌ అంగీకరించారు. విదేశ్‌భవన్‌ కోసం భూమిని తెలంగాణ ప్రభుత్వం సమకూరుస్తుంది. రాజధానిలోని సైబర్‌టవర్స్‌కు సమీపంలోని భూమిని దీనికి ప్రతిపాదించారు. దాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఎకరం భూమిని ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినా అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఏమేం ఉంటాయి? 
* విదేశ్‌భవన్‌లో పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయం, ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి కార్యాలయం, ధ్రువీకరణపత్రాల జారీకేంద్రంఉంటాయి. 
* తెలంగాణ ప్రభుత్వం టామ్‌కామ్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అధికారులంతా ఒకేచోట ఉంటారు. 
* పాస్‌పోర్టుల జారీ, ధ్రువీకరణపత్రాలకు రాజముద్రలు వేయడం, వలసలకు అనుమతులు, వీసాలకు సంబంధించిన అంశాల పరిష్కారంతో పాటు టామ్‌కామ్‌ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే వీలుంది. 
* సమస్యలున్నప్పుడు రాయబార కార్యాలయాలతో సంప్రదించి, పరిష్కరించే వీలుంది. కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా భవనాన్ని నిర్మిస్తాయి. మౌలిక వసతులను రాష్ట్రప్రభుత్వం కల్పిస్తుంది. 
* స్థలాన్ని ఎంపిక చేశాక భవనం నమూనాను ఖరారు చేస్తారు. 
* దేశంలో తొలిసారిగా నిర్మిస్తున్న విదేశ్‌భవన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com