ప్రపంచ నేత్ర దినోత్సవం

- October 07, 2015 , by Maagulf
ప్రపంచ నేత్ర దినోత్సవం

సాధారణంగా ఆరోగ్యవంతులకు, ఎలాంటి కంటి సమస్యలు లేనివారికి సైట్ 6/6ఉండాలి. 6/9, 6/12, 6/36, 6/60 ఉంటే చూపు తగ్గుతున్నట్లు లెక్క. ఈ దశలోని రోగులు అవసరమైన సైట్ గల కంటి అద్దాలు వాడితే సరిపోతుంది. అంతకన్నా తగ్గితే అంటే 4మీటర్స్, 3మీటర్స్, 2మీటర్స్ చూపు కోల్పోతున్నట్లు. 2కంటే తక్కువ మీటర్ సైట్ ఉంటే వారికి అంధత్వం వచ్చినట్లు పరిగణిస్తారు. ఈ దశను హాండ్ మూవ్‌మెంట్ అంటారు. వయసుల వారిగా కంటి జబ్బులు.. కొన్ని కంటి జబ్బులు వయసు ఆధారంగా వస్తాయి. ఇంకొన్ని పుట్టుకతోనే వస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స చేస్తే ఫలితం ఉంటుందని జిల్లా అంధత్వ నివారణ అధికారి రవీందర్‌గౌడ్ తెలిపారు. నవజాత శిశువుల నుంచి 15ఏళ్ల లోపు పిల్లల్లో కొందరికి పుట్టుకతోనే మెల్లకన్ను, శుక్లాలు ఏర్పడతాయి. ఇది కాకుండా 7, 8నెలల్లో పుట్టిన శిశువులకు కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల కూడా చిన్నారులకు కంటి జబ్బులు వస్తాయని ఆయన వివరించారు. పౌష్టికాహారం అందకపోతే చిన్నారులకు కంటిజబ్బులు వస్తాయి. 20-40ఏళ్ల వయసు వారికి.. కాలుష్యం, ప్రమాదాలు, విటమిన్ల లోపం, రసాయన పరిశ్రమల్లో పనిచేసేవారికి వాటి ప్రభావం వల్లకంటి సమస్యలు వస్తాయి. విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. ఎక్కువసేపు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లపై గంటల తరబడి పనిచేయడం వల్ల చూపు మందగిస్తుంది. 40-70ఏళ్ల వారికి.. ఈ వయసు వారికి కంటి సమస్యలు అధికం. శుక్లాలు, గ్లకోమా, అధిక రక్తపోటు(బీపీ), మధుమేహం(డయాబెటిక్) తదితర కారణాలతో కంటిచూపు మందగిస్తుంది. కంటిలో ఒత్తిడి కారణంగా(గ్లూకోమా).. ప్రతి వ్యక్తికి కంటిలో 10-20మిల్లీమీటర్ల నీటి ఒత్తిడి ఉంటుంది. ఇది 20ఎం.ఎం కంటే పెరిగితే ఏర్పడే ఒత్తిడినే గ్లకోమా అంటారు. కంటిలో నిరంతరం నీరు 10నుంచి 20ఎంఎం ఒత్తిడితో సర్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే కంటిలో నీరు సర్క్యులేట్ కాకుండా స్తంభించి పోతుందో అప్పుడు ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల చూపునరాలు(ఆప్తిక్ నర్వ్స్), కంటి రక్తనాళాలు, మూసుకుపోయి కళ్లకు సరఫరా కావాల్సిన రక్తం, నీరు నిలిచిపోతుంది. ఫలితంగా నీరు లేక ఒక మొక్క ఎలా ఎండిపోయి చనిపోతుందో, కన్ను కూడా అలాగే చూపు మందగించి, చివరకు అంధత్వం ఏర్పడుతుంది. చికిత్స.. గ్లకోమా నివారణకు కంటిలో ఏర్పడే ఒత్తిడిని తగ్గించేందుకు ట్రాబ్ ఆపరేషన్ నిర్వహిస్తారు. ఈ ఆపరేషన్ ద్వారా కంటిలో డ్రైనేజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల కంటిలో నిలిచిపోయిన నీరంతా ఈ డ్రైన్‌లోకి వెళ్లి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మూసుకుపోయిన చూపు నరాలు, రక్తనాళాలు తెరుచుకుని కంటికి అందాల్సిన రక్తం, నీరు అందుతాయి. క్యాటరిక్(శుక్లాలు).. కంటిలోని లెన్స్(దర్పణం)పై ఏర్పడే పొరలను శుక్లాలు లేదా క్యాటరిక్స్ అంటారు. వయసు పెరిగే కొద్ది కంటి దర్పణంపై ఈ పొరలు ఏర్పడతాయి. ఎ-విటమిన్ల లోపం, సూర్యరశ్మి తాకిడి వల్ల కూడా శుక్లాలు ఏర్పడతాయి. మొదటి దశలో ఈ సమస్యతో బాధపడే రోగులకు కంటి అద్దాల ద్వారా చూపు అందించవచ్చు. చివరి దశలోని రోగులకు శస్త్రచికిత్స చేసి పొరలను తొలగిస్తారు. అధిక రక్తపోటు వల్ల.. అధిక రక్తపోటు వల్ల కూడా కంటికి ఉన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో కళ్లకు రక్త సరఫరా జరగక చూపు మందగిస్తుంది. రక్తపోటును నియంత్రించడమే దీనికి ప్రధాన చికిత్స. మధుమేహం.. శరీరంలో మధుమేహం ఎక్కువైతే కంటి రక్తనాళాల్లో లీకేజీ ఏర్పడుతుంది. దీంతో కొన్ని సందర్బాల్లో కంట్లో నుంచి రక్తస్రావం జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో రక్తనాళ్లాలో నుంచి లీకయ్యే రక్తం గడ్డకట్టడం వల్ల చూపు తగ్గిపోతుంది. దీనికోసం లేజర్ కిరణాల ద్వారా కంటిలో గడ్డకట్టిన రక్తాన్ని తొలగిస్తారు. అయినా సమస్య తీరకపోతే ఆపరేషన్ ద్వారా చికిత్స చేస్తారు. కార్నియా వ్యాధులు.. కంటిలోని నల్లపాపకు ముందుభాగంలో ఉండే భాగాన్ని కార్నియా అంటారు. ఏదేని ప్రమాదాలు జరిగినప్పుడు కార్నియాకు గాయమైతే చూపు దెబ్బతింటుంది. వయసు పెరిగే కొద్ది కార్నియా తెల్లబడి చూపు మందగిస్తుంది. కార్నియా జబ్బు ముదిరితే కంటి మార్పిడే శరణ్యం. క్యాన్సర్.. రెటీనో బ్లాస్టోమా: ఈ క్యాన్సర్ ఎక్కువగా చిన్నపిల్లలో వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో ఇప్పటివరకు తెలియదు. కారణాలను అన్వేశించడానికి పరిశోధనలు జరుగుతున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. పెద్దవారిలో.. స్కామోసెల్‌బ్లాస్టోమా, మెలనో బ్లాస్టోమా అనే రెండు రకాల క్యాన్సర్‌లు పెద్దవారికి వస్తుంటాయి. పిల్లల్లో వచ్చే రెటీనో బ్లాస్టోమాగాని, పెద్దల్లో వచ్చే స్కామోసెల్‌బ్లాస్టోమా, మెలనోబ్లాస్టోమాలకు చికిత్స లేదు. ఈ క్యాన్సర్‌లు ఉన్నట్లు తేలితే వెంటనే కంటిని పూర్తిగా తొలగించాల్సిందేనని, కంటిని అలాగే ఉంచితే క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. కంటి క్యాన్సర్ వస్తే నేత్రాన్ని తొలగించి మరో కంటిని ఏర్పాటు చేసే వీలు కూడా ఉండదని, ఇక ఆ రోగికి అంధత్వం తప్పదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com