ఎస్వీ రంగారావు 99 వ జయంతి నేడు..
- July 02, 2017
నట యశస్వి.. సుప్రసిద్ధ తెలుగు నటుడు సామర్ల వెంకట రంగారావు (ఎస్వీ రంగా రావు) గారి జయంతి నేడు.. ఎస్వీ ఆర్ జూలై 3, 1918 లో కృష్ణా జిల్లా నూజివీడు లో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు.. తండ్రి ఎక్సైజ్ శాఖ లో ఉద్యోగి.. నూజివీడు లో పనిచేస్తున్న సమయంలో ఆయన జన్మించారు. ఆయన స్వస్థలం కాకినాడ..
ఆర్ధికంగా ఉన్నత కుటుంబం కావడంతో.. ఎస్వీఆర్ ని హైస్కూల్ చదువుకోసం మద్రాస్ పంపించారు.. తన 12 వ ఏటనే, హైస్కూల్ విద్య పూర్తి చేసి,B.Sc లో చేరారు.. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం బందరు లో అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా జాబ్ లో చేరారు.. ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు.
ఎస్వీఆర్ బంధువైన బి.వి.రామానందం గారు తాను తీయబోయే సినిమాకోసం SVR ను సినీ రంగానికి ఆహ్వానించారు. బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు.
వరూధిని అనుకున్నంత విజయం సాధించలేదు. అందుచేత కొంతకాలం వరకు వారికి సినిమాలలో వేషాలు వేసే అవకాశం రాలేదు. తర్వాత రంగారావు గారికి విసుగు పుట్టి, జంషెడ్ పూర్ లో TATA వారి సంస్థలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసారు. అయితే అతనికి నటన పైన ఉన్న ప్రేమ తొలగిపోలేదు, పైగా ఎక్కువ కూడా అయింది.
27-12-1947 న లీలావతి అనబడే కన్యామణితో వీరి వివాహం జరిగింది. SVR గారికి 'పల్లెటూరిపిల్ల' అనే చిత్రంలో విలన్ గా నటించటానికి శ్రీ బి.ఏ. సుబ్బారావు గారి నుండి ఆహ్వానం వచ్చింది.. కానీ అదే సమయంలో ఆయన తండ్రి స్వర్గస్తులైనారు.. దీంతో ఆ సినిమాలో అవకాశం చేజారి పోయింది. కానీ ఆయన అదృష్టమేమంటే--విజయా వారి, కే.వి.రెడ్డి గారి దృష్టిలో పడటమే! పాతాళ భైరవిలో నేపాలీ మాంత్రికుడి వేషం వేసే ఛాన్స్ వచ్చింది. వచ్చిన ఆ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాకుండా, ఆయన ఆ పాత్ర పోషించిన తీరు పండిత పామరుల ప్రశంసలు అందుకుంది. ఇక విజయా వారికి ఈయన ఆస్థాన నటుడయ్యారు. ఆ తర్వాతనే విడుదలైన విజయా వారి 'పెళ్లిచేసిచూడు' సినిమాలో వీరు పోషించిన 'వియ్యన్న' పాత్ర కూడా నేపాలీ మాంత్రికుడి వేషం వలే తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
విజయా వారు మాయాబజార్ తీసేటప్పుడు, 'ఘటోత్కచుని' వేషానికి ముందుగా వీరిని తీసుకున్నారు. కే.వి.రెడ్డి గారు అన్నారుట 'ఆ వేషానికి వేరే ఆప్షన్ లేదు' అని. మాయాబజార్ అంత రసవత్తరంగా తయారు కావటానికి ముఖ్యకారకులలో అతిముఖ్యుడీయన! అలా నిర్విరామంగా వీరి నటయాత్ర తెలుగు, తమిళరంగాలలో కొనసాగింది. వీరు నటించిన నర్తనశాల లోని కీచకుని వేషానికి పలువురి ప్రశంసలు లభించింది. సతీ సావిత్రి అనే సినిమా తీసేటప్పుడు, చైనా ప్రధాని చౌ యెన్ లై , వీరిని సెట్లో యముని వేషంలో చూసి ఆశ్చర్య చకితులయ్యారట! జకార్తాలో జరిగిన ఇండోనేసియా ఫిలిం ఫెస్టివల్ లో, వీరి కీచకుని వేషానికి ఉత్తమ నటుని అవార్డుతో పాటుగా బంగారు పతకం కూడా దక్కింది. ముఖ్యంగా పౌరాణిక సినిమాలలో ప్రతినాయకుడిగా నటించి తనదైన ఒక ప్రత్యేక బాణీని ప్రవేశపెట్టారు.
రావణ బ్రహ్మ, దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు, మాయల పకీరు, మున్నగు వేషాలు వీరిని తెలుగు ప్రేక్షకుల గుండెలపై చిరస్థాయిగా కూర్చో పెట్టాయి. ఆయన పలుకులు అప్పట్లో అందరికీ ఊతపదాలయిన మాటల తూటాలు
పులి ఎక్కడున్నా పులేరా డోంగ్రే... పోరా గూట్లే.. సాహసం సేయరా డింభకా,.... హ్ బానిస.....బానిసలకింత అహంకా రమా..... మాతాతయ్యకు నేడు 99వ పుట్టినరోజు జేజేలు... వంటి సంభాషణల ఉచ్చారణ, పలికే విధానం, మాటల విరుపు, హావభావాలు మరెవరి తరంకావు.
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవములో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.
ఎంత మహా నటుడినైనా డామినేట్ చేయ గల సత్తా సామర్ధ్యం వీరి సొంతం. వీరితో నటించాలంటే ఆనాటి అగ్రనటులు సైతం భయపడేవారు, ఒక్క సావిత్రి తప్ప! ఆయన సమకాలీనుడైన గుమ్మడి గారి మాటల్లో చెప్పాలంటే, ఇటువంటి నటుడు పొరపాటున మన దేశంలో పుట్టాడు, మరే దేశంలోనైనా పుట్టివుంటే ప్రపంచపు నటులలోనే మేటి నటుడయ్యే వాడు.. బంగారు పాప సినిమాలో ఎస్.వి.రంగారావు గారి నటనను, లండన్‌లో చూసిన చార్లీ చాప్లిన్, ఇలియట్ “బ్రతికి ఉంటే చాలా సంతోషించి ఉండేవాడని” అన్నారు. కానీ ఇప్పటి వరకూ ఏ పద్మ లు అందుకొని మేటి నటుడు ఎస్వీఆర్ 99 వ జయంతి నేడు..
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







