రష్యాపై మళ్లీ ఆంక్షలు విధించిన ట్రంప్ ప్రభుత్వం
- July 23, 2017
- ఓటింగ్ చేపట్టనున్న ప్రతినిధుల సభ
- పాత ఆంక్షల్ని ట్రంప్ ఎత్తివేయకుండా తాజా బిల్లులో ప్రతిపాదనలు : రష్యా వ్యతిరేక విధానం కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయం
అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుందన్న కారణంగా రష్యాపై మళ్లీ ఆంక్షల్ని విధించడానికి అమెరికా సిద్ధమవుతున్నది. ఈమేరకు అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)లో కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. తాజాగా ఆంక్షల్ని విధించాలన్న నిర్ణయంపై కాంగ్రెస్‌లో రిపబ్లికన్, డెమొక్రటిక్ ఎంపీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరాన్, ఉ.కొరియాపై కూడా మరిన్ని కఠిన ఆంక్షల్ని విధించే అవకాశాల్ని ప్రతిపాదిత బిల్లులో పొందుపర్చారు. ఇంతక్రితమే సెనెట్‌లో ఈబిల్లు ఆమోదం పొందింది. ఇక బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించాల్సి ఉంది. దీనిపై మంగళవారం ఈ సభలో ఓటింగ్ చేపట్టనున్నారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొంది..చట్టంగా రూపుదాల్చితే, ఆంక్షల విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని కాంగ్రెస్ వీటో చేసే అధికారాన్ని పొందుతుంది.
ఒబామా హయాంలో రష్యాపై కొన్ని ఆంక్షల్ని విధించారు. అమల్లో ఉన్న ఈ ఆంక్షల్ని తొలగించే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌నకు మాత్రమే ఉంది. దీనిని అడ్డుకోవటం కోసం కొత్త చట్టంలో నిబంధనల్ని కూడా తీసుకురాబోతున్నారు. ఆంక్షల్ని తొలగించటంలో అధ్యక్షుడి అధికార పరిధిని తగ్గించగలిగే విధంగా తాజా చట్టంలో నిబంధనల్ని చేర్చాలని కాంగ్రెస్ ఎంపీలు భావిస్తున్నారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అనుకూల వైఖరితో ఉన్నారన్న ఆరోపణలు తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యాపై ఆంక్షల్ని తొలగించాలని హఠాత్తుగా ట్రంప్ నిర్ణయం తీసుకుంటారన్న ఆందోళన కాంగ్రెస్ సభ్యుల్లో ఉంది. రష్యా నాయకత్వంతో చర్చలు జరపడానికి తనకు దౌత్యపరమైన వెసులుబాటు అవసరమని కొద్ది రోజుల క్రితమే ట్రంప్ చెప్పటం అమెరికా ఎంపీలకు నచ్చలేదు. ట్రంప్ దశా...దిశ ఏలా ఉన్నప్పటికీ రష్యా వ్యతిరేక విధానాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.
ఎంపీలందరూ ఒక్కటయ్యారు
కాంగ్రెస్ సభ్యులు తీసుకొచ్చే ఈ బిల్లును 'వీటో' చేసే అధికారం ట్రంప్‌నకు ఉంది. ఒకవేళ అదేగనుక జరిగితే, 'రష్యాతో సంబంధాలు' అన్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. తద్వారా ట్రంప్‌నకు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావొచ్చు. ప్రస్తుతం 'తాజా ఆంక్షల బిల్లు' చట్టసభ కాంగ్రెస్ ముంగిటకు వచ్చిందని, దీనిపై తీవ్రమైన చర్చోపచర్చలు జరిగాయని సీనియర్ డెమొక్రటిక్ నాయకుడు సెనెటర్ బెన్ కార్డిన్ తెలియజేశారు. విదేశీ సంబంధాల కమిటీలో సభ్యుడిగా ఆయన ఉన్నారు.
''రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు గట్టి సందేశాన్ని పంపటం కోసం కాంగ్రెస్ సభ్యులంతా ఒక్కటయ్యారు. అమెరికా, దాని మిత్ర దేశాల ప్రజల తరుఫున ఈ సందేశాన్ని పంపాలని నిర్ణయించుకున్నాం. ఆంక్షల విధింపు నిర్ణయంలో అధ్యక్షుడు ట్రంప్ సహకారం కోరుతున్నా''మని కార్డిన్ అన్నారు. కఠినమైన ఆంక్షల బిల్లు తీసుకురావాలని డెమొక్రటిక్ నాయకుడు చక్ స్కమర్ డిమాండ్ చేశారు.
ఉక్రెయిన్ అంతర్యుద్ధంలో క్రిమియాను రష్యా ఆక్రమించిందని అప్పటి అధ్యక్షుడు ఒబామా ఆంక్షల్ని విధించారు. రష్యా కంపెనీలతో ఎలాంటి లావాదేవీలు జరపరాదని నిర్ణయించారు. రష్యా పౌరులు నడుపుతున్న వ్యక్తిగత వ్యాపార, వర్తక కంపెనీలపై ఆంక్షల్ని విధించారు. ఈ ఆంక్షల్ని అమెరికా, యూరప్‌లోని దాని మిత్ర దేశాలు అమలుజేయటం ద్వారా రష్యా తీవ్రంగా నష్టపోయింది. తాజాగా మళ్లీ రష్యాపై ఆంక్షల్ని విధించాలని అమెరికా నిర్ణయించటాన్ని ఈయూ కూటమి తప్పుబడుతున్నది.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్‌ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









