సినిమా రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన రమాప్రభ పుట్టినరోజు

- August 05, 2017 , by Maagulf
సినిమా రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన రమాప్రభ పుట్టినరోజు

తొలి లేడీ స్టార్ కమెడియన్
1400సినిమాకు పైగా కెరీర్.. నవ్వించింది.. కవ్వించింది.. ఏడిపించింది.. ఎన్ని చేసినా .. రమాప్రభ తొలి లేడీ స్టార్ కమెడియన్. తెలుగు ప్రేక్షకులకు ఆమె పంచిన నవ్వులే ఆమెను చిరంజీవిని చేస్తాయి. అందరు స్టార్స్ తో పనిచేసినా.. తనకంటూ ఓ స్టార్డమ్ ఉన్నా.. రమాప్రభ అనే ఆర్టిస్ట్ అన్ని రకాల పాత్రల్లోనూ పరకాయ ప్రవేశం చేసింది. ఒక్క హీరోయిన్ గా తప్ప.. అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పించిన స్టార్.. రమాప్రభ.. ఈరోజు ఈ హాస్యప్రభ పుట్టిన రోజు. 
రమాప్రభ పుట్టింది తెలుగునాటే అయినా.. పెరిగిందంతా తమిళనాడులోనే. పదమూడు మంది సంతానంలో పోషణభారం ఇబ్బంది పెడుతుంటే రమాప్రభ పుట్టిన నెలకే ఆమె మేనమామకు దత్తత ఇచ్చారు. కానీ పన్నెండేళ్ల వయసులో ఆయన చనిపోవడంతో బతుకు దెరువు కోసం చెన్నై వీధుల వెంట తిరిగిన రమాప్రభ తర్వాత శివాజీ గణేశన్.. లాంటి ప్రముఖ నటులతో తమిళనాడులో నాటకాల్లో నటించింది. మొత్తంగా ఇప్పటి వరకూ నాలుగువేలకు పైగా నాటకాల్లో నటించిన అనుభవం ఆమె సొంతం.  తమిళంలో వెండితెరపై అరంగేట్రం చేసి 1966లో 'చిలకాగోరింక' సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టింది. 
ఆమె ప్రతిభకు తెలుగులో గుర్తింపు రావడానికి పెద్దగా టైమేం పట్టలేదు. సూర్యకాంతం నుంచి అప్పటి అందరు క్యారెక్టర్స్ ఆర్టిస్ట్స్.. హీరోయిన్లతో నటించింది. అలాగే అల్లు రామలింగయ్య కు మంచి పెయిర్ గా ఉంటూనే చలం లాంటి వారితోనూ నటించింది. 
రాజబాబు,రమాప్రభ హిట్ ఫెయిర్
రమాప్రభ కు వచ్చిన గుర్తింపుల్లో రాజబాబుతో నటించిన సినిమాల భాగమే ఎక్కువ. ఏ దర్శక నిర్మాతైనా.. హీరో, హీరోయిన్ల కంటే ముందే, రమాప్రభ, రాజబాబు అనే పేర్లు రాసుకుని.. ఆ తర్వాతే మిగతా తారాగణాన్ని ఎంచుకునేవారు. అది ఆ జంటకున్న క్రేజ్..  రాజబాబు తర్వాత కూడా రమాప్రభ సినిమాల్లో వెలిగిపోయింది. మూడున్నర దశాబ్ధాలకు పైగా ఆమె లేని సినిమా లేదు. ఇక రాజబాబు, రామలింగయ్య లాంటి వారితో కలిపి రమాప్రభకు పాటలూ పెట్టేవారు.. నాటి ప్రేక్షకుల్లో చాలామంది తాము చూడబోతున్న సినిమాల్లో వీళ్లిద్దరూ ఉన్నారా అని కూడా చూసుకునేవారు.. 
వ్యక్తిగత జీవితం  విషాదం
వృత్తిపరంగా ఎంతో ఉల్లాసంగా కనిపించిన రమాప్రభ.. వ్యక్తిగత జీవితం కొన్నేళ్ల క్రితం విషాదంగానే గడిచింది. నటుడు శరత్ బాబును పెళ్లి చేసుకుంది. 14యేళ్లపాటు వీరి కాపురం సాగింది. కానీ ఎందుకో ఇద్దరూ ఒకే ఫీల్డ్ లో ఉండటం వల్లో లేక.. ఇతరత్రా కారణాలేమున్నాయో కానీ ఈ జంట విడిపోయింది. అసలు వీరు పెళ్లి చేసుకోవడమే నాటి ప్రేక్షకులు, పరిశ్రమలో ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే విడిపోయాక చాలామంది పెద్దగా ఆశ్చర్యపోలేదనే చెప్పాలి. కాకపోతే అతని వల్ల తన ఆస్తంతా పోయిందని రమాప్రభ చాలాసార్లు చెప్పుకున్నారు. 
ప్రతిభను గుర్తించని ప్రభుత్వం
రమాప్రభ లాంటి అరుదైన నటిని ప్రేక్షకులు గుర్తించినంతగా ఏ ప్రభుత్వాలూ గుర్తించలేదు. ఆమె ప్రతిభకు తగ్గట్టుగా అవకాశాలు వచ్చాయి కానీ, అవార్డులు రాలేదు. దక్షిణ భారతదేశంలో ఇన్ని వందల సినిమాలు.. అన్ని వేల నాటకాల్లో నటించిన వారిలో తమిళ సీనియర్ నటి మనోరమ తర్వాతి స్థానం రమాప్రభదే. కానీ మనోరమకు వచ్చిన గుర్తింపుతో పోల్చుకుంటే రమాప్రభను మనవాళ్లు ఎంతగా పట్టించుకున్నారో ఈజీగా అర్థమౌతుంది. 
రమాప్రభ ఇప్పుడు తన సొంత ఊరు మదనపల్లిలో ఉంటున్నారు. కొందరు అభిమానులు, నటులు ఆమెకు కొంత ఆర్థిక సాయం చేస్తున్నారని చెబుతారు. తనకూ అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. అయినా ఉన్నదాంతో హ్యాపీగా ఉంటూ లేని దాని గురించిన ఆలోచనను వదిలేసి అంతులేని అనుభవ సారంతో జీవితాన్ని గడిపేస్తోందిపుడు. సినిమా పరిశ్రమలో కొందరు దానాలు చేసి పోగొట్టుకున్నారు.. మరికొందరు.. వ్యసనాలతో పోగొట్టుకున్నారు.. కానీ ప్రేమించడం వల్ల ఉన్నదంతా పోగొట్టుకుంది మాత్రం తనే అనే విషయాన్ని కూడా కల్మషం లేకుండా చెప్పుకుంటోన్న రమాప్రభ మరింత కాలం ఆరోగ్యంతో జీవించాలని.. మనసారా కోరుకుంటూ మరోసారి బర్త్ డే విషెస్ చెప్పేద్దాం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com