కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి:పైకప్పు కూలి ఏడుగురు మృతి

- September 21, 2017 , by Maagulf
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి:పైకప్పు కూలి ఏడుగురు మృతి

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. పనులు జరుగుతున్న సమయంలో సొరంగం పైకప్పు కూలిపోవడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. ఇంకొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న ఎస్పీ విశ్వజిత్ ప్రమాద స్థలికి హుటాహుటిన చేరుకున్నారు. మధ్యమానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు జరుగుతున్న పదో ప్యాకేజీ పనుల్లో ఈ ప్రమాదం జరిగింది. మరో రెండు రోజుల్లో ఈ పనులు పూర్తికానున్న తరుణంలో ఇలా ప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపింది.
జార్ఖండ్, బీహార్, ఒడిశాకు చెందిన కూలీలు ఈ పనుల్లో పాల్గొంటున్నారు. ప్రమాద సమయంలో 8మంది పనిచేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఎస్పీ విశ్వజిత్ తెలిపారు.
ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి: మృతుల్లో భూపాలపల్లి జిల్లా వాసి
ప్రమాదంలో ఝార్ఖండ్‌ రాష్ట్రం తూర్పు సింగ్‌భం జిల్లా జందా గ్రామానికి చెందిన హికిమ్‌ హండ్సా (24), సిందేగా జిల్లా రాంజోల్‌ గ్రామానికి చెందిన గాట్మా టోప్నో, ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బగ్‌బన్‌పూర్‌కు చెందిన రామకృష్ణన్‌ సాహు, ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ జిల్లా సౌత్‌పూర్‌ గ్రామానికి చెందిన హరిచంద్‌ నేతన్‌, పశ్చిమ్‌ బంగ రాష్ట్రం బురద్ధ్వాన్‌ జిల్లాకు చెందిన జితేందర్‌కుమార్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగుకు చెందిన యాసం సందీప్‌ అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన ఝార్ఖండ్‌ రాంగఢ్‌ జిల్లా బర్ఖాంగ గ్రామానికి చెందిన పూరన్‌ సింగ్‌, ఝార్ఖండ్‌ తూర్పు సింగ్‌భం జిల్లా ముస్బాని గ్రామానికి చెందిన బుడాన్‌ సోరెన్‌ (38)ను హుటాహుటిన కరీంనగర్‌ తరలిస్తుండగా మార్గమధ్యలోనే సోరెన్‌ మృతిచెందారు. పూరన్‌సింగ్‌ను తొలుత కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ యశోద ఆసుపత్రికి తరలించారు.
కేసీఆర్, హరీశ్ దిగ్భ్రాంతి: మృతుల కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధింంచిన 10వ ప్యాకేజీ పనుల్లో ప్రమాదం సంభవించి, ఏడుగురు మరణించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను సానుభూతి తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం గాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. బీమా కంపెనీ నుంచి ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు, కాంట్రాక్టు ఏజెన్సీ నుంచి రూ. అయిదేసి లక్షలు పరిహారం అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. సంఘటనపై సమగ్ర విచారణను ఆదేశించామని హరీశ్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com