ప‌దిరోజుల పాటు అమెరికా, దుబాయ్‌, లండ‌న్‌లో పర్యటించనున్న చంద్రబాబు

- October 17, 2017 , by Maagulf
ప‌దిరోజుల పాటు అమెరికా, దుబాయ్‌, లండ‌న్‌లో పర్యటించనున్న చంద్రబాబు

మూడు దేశాల పర్యటన కోసం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరి వెళ్లారు. ప‌దిరోజుల పాటు అమెరికా, దుబాయ్‌, లండ‌న్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, ఆధునిక‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. చివ‌రి రెండు రోజులు లండ‌న్ టూర్‌లో రాజ‌ధాని డిజైన్లు ఫైన‌ల్ చేసే అవ‌కాశం ఉంది.
న‌వ్యాంధ్రకు పెట్టుబ‌డుల ఆకర్షణ కోసం మ‌రోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈనెల 26 వ‌ర‌కు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 20 వ‌ర‌కూ అమెరికాలో, 21 నుంచి 23 వ‌ర‌కూ యూఏఈ, 24 నుంచి 26 వ‌ర‌కూ యూకేలో పర్యటిస్తారు. సీఎంతో పాటు మంత్రులు య‌నమ‌ల‌, నారాయ‌ణ‌, ఉన్నతాధికారులు పర్యటనకు వెళ్తున్నారు. మూడు దేశాల పర్యటనలో ప‌లు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ మూడేళ్లలో ప‌లు దేశాల్లో పర్యటించి వేల‌కోట్ల పెట్టుబ‌డులు ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు ఈసారి కూడా భారీగా పెట్టుబ‌డులు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫారిన్‌ టూర్‌లో అనేకమంది రాజకీయ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు, ముఖాముఖి సమావేశాలు, బహుముఖ చర్చల్లో సీఎం టీమ్‌ పాల్గొంటారు. అమెరికాలో ఐయోవా గవర్నర్, ఐయోవా స్టేట్ యూనివర్శిటీ ప్రెసిడెంట్, అగ్రికల్చర్ సెక్రటరీల‌తో భేటీ కానున్నారు. చికాగోలో గ్లోబల్ తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్‌వర్క్ సభ్యులతో, ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు.
అమెరికా పర్యటనలో చివ‌రిరోజు  వివిధ కంపెనీల సీఈవోలు, సీఎక్స్‌వోలతో సీఎం లంచ్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఇక 21 నుంచి 23 వరకు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో ముఖ్యమంత్రి బృందం పర్యటిస్తుంది. నాన్ రెసిడెంట్స్ క‌మ్యూనిటీ, బిజినెస్ లీడర్స్ ఫోరమ్‌తో సమావేశం, UAE ప్రభుత్వ, పరిశ్రమల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపుతుంది. లులూ గ్రూపు చైర్మన్ యూసఫ్ అలీ ఇచ్చే విందు సమావేశంలో పాల్గొన్న అనంతరం సెన్నట్ గ్రూపుతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతుంది. రొటానా గ్రూపుతో ద్వైపాక్షిక సమావేశం, ఎమిరేట్స్ ప్యాలెస్‌లో ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొషెషనల్ గ్రూప్ తో భేటీ అవుతారు చంద్రబాబు. డాక్టర్ బీఆర్  షెట్టీ ఏర్పాటుచేసిన‌ అగ్రశ్రేణి పెట్టుబడిదారులతో ఎక్స్‌క్లూజివ్ డిన్నర్‌కు ముఖ్యమంత్రి హాజరవుతారు.
చివరిగా ఈనెల 24 నుంచి 26 వ‌ర‌కూ యూకేలో పర్యటించనున్నారు సీఎం. మంత్రి నారాయ‌ణ‌, సీఆర్డీఏ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో ఉంటారు. సుమారు 10 గంట‌ల‌పాటు రాజ‌ధాని డిజైన్లపై నార్మన్‌ ఫోస్టర్స్‌ ప్రతినిధులతో చ‌ర్చించ‌నున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, హైకోర్టు, స‌చివాల‌యం డిజైన్లలో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు మార్పులు చేస్తున్నారు. అటు దర్శకుడు రాజ‌మౌళి కూడా లండ‌న్ వెళ్లి నార్మన్‌ ఫోస్టర్స్‌ ప్రతినిధులతో స‌మావేశ‌మై డిజైన్లపై ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ మార్పుల‌పై చ‌ర్చించిన త‌ర్వాత అవ‌కాశాన్ని బ‌ట్టి అక్కడే డిజైన్లు ఫైన‌ల్ చేయ‌నున్నారు. లండ‌న్ పర్యటనలో ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకోనున్నారు. యూకే పర్యటనలో ఇన్వెస్టర్లతోనూ సీఎం టీమ్‌ భేటీ అవుతుంది.
మొత్తం తొమ్మిది రోజుల పర్యటనలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావ‌డ‌తో పాటు రాజ‌ధాని డిజైన్లను ఖ‌రారు చేసేలా సీఎం ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com