జపాన్‌లో ఎన్నికలు.. మళ్లీ ప్రధాని షింజో అబే పార్టీ నెగ్గే అవకాశాలున్నాయి

- October 21, 2017 , by Maagulf
జపాన్‌లో ఎన్నికలు.. మళ్లీ ప్రధాని షింజో అబే పార్టీ నెగ్గే అవకాశాలున్నాయి

జపాన్‌లో ఆదివారం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మళ్లీ ప్రధాని షింజో అబే పార్టీ నెగ్గే అవకాశాలున్నాయి. అబేకు చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఈ ఎన్నికల కోసం తీవ్రంగా ప్రచారం చేసింది. జాతీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రధాని అబే.. సెప్టెంబర్ నెలలో మళ్లీ ఎన్నికలకు పిలుపునిచ్చారు. నిజానికి అబేకు ప్రజాదరణ తక్కువే ఉన్నా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన కూటమికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. శాంతి భద్రతలు, ఉత్తర కొరియా సమస్యలు అబేకు ప్రశ్నార్థకంగా మారాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా అబేకు రేటింగ్ పడిపోయింది. కానీ రాజకీయంగా జపాన్‌లో అస్థిరత ఉన్నది. దీంతో ఆయన మళ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ రేపు జరిగే ఎన్నికల్లో షింజో అబే విక్టరీ సాధిస్తే.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దేశాన్ని అత్యధిక కాలం ఏలిన వ్యక్తిగా ఆయన నిలుస్తారు. 2006లో మొదటిసారి అబే ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పుడు కొంత కాలమే ఆయన ఆ సేవలు చేశారు.

ఆ తర్వాత 2012లో మళ్లీ జాతీయ ఎన్నికల్లో భారీ విక్టరీ సాధించారు. ఆర్థికపరంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో షింజో అబే అనేక ప్రయత్నాలు చేశారు. కానీ మందకొడిగానే జపాన్ ముందుకు వెళ్లుతున్నది. అయితే జపాన్‌ను మళ్లీ అణుశక్తిగా మార్చేందుకు మాత్రం అబే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది.

2011లో ఫుకుషిమా అణురియాక్టర్ దెబ్బతిన్న తర్వాత జపాన్ న్యూక్లియర్ పాలసీకి బ్రేక్ వేసింది. ఇప్పుడు మళ్లీ ఆ దిశగా జపాన్ అడుగులు వేయాలనుకుంటున్నది. దానికి షింజో అబే పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మళ్లీ ప్రజలు పట్టం కట్టే సూచనలున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com