జాన్ ఎఫ్ కెనెడీ హత్యకేసు రహస్య పత్రాలు విడుదల

- October 27, 2017 , by Maagulf
జాన్ ఎఫ్ కెనెడీ హత్యకేసు రహస్య పత్రాలు విడుదల

ఐదు దశాబ్దాలకు పైగా మిస్టరీగా ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనెడీ హత్యకు సంబంధించిన రహస్య పత్రాలను అమెరికా ప్రభుత్వం నేడు విడుదల చేసింది. దాదాపు 3వేల పత్రాలను బహిర్గతం చేయగా.. మిలిటరీ, ఇంటెలిజెన్స్‌ అపరేషన్స్‌ కోసం మరికొన్ని పత్రాలను ఇంకా రహస్యంగా ఉంచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు కెనెడీ హత్యకు సంబంధించిన 2,891 రికార్డులను విడుదల చేసినట్లు నేషనల్‌ ఆర్చీవ్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

1963 నవంబర్‌ 22న టెక్సాస్‌లోని డాలస్‌లో కెనెడీ హత్యకు గురయ్యారు. ఓ ప్రచార కార్యక్రమం కోసం టెక్సాస్‌ వెళ్తుండగా ఆయనపై దుండగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కెనెడీ.. ఆసుపత్రికి తీసుకెళ్లిన 30 నిమిషాలకే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. లీ హార్వే ఓస్వాల్డ్‌ అనే వ్యక్తి కెనెడీని హత్య చేసినట్లు రికార్డుల్లో ఉంది. అయితే ఈ హత్య వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ కేసు మిస్టరీగానే ఉండిపోయింది. 

అమెరికా 25ఏళ్ల రహస్య చట్టం ప్రకారం ఈ కేసుకు సంబంధించిన పత్రాలను 1992లో యూఎస్‌ నేషనల్‌ ఆర్కీవ్స్‌ భద్రపరిచింది. ఈ చట్టం ప్రకారం 25ఏళ్ల వరకు భద్రపరిచి.. ఆ తర్వాత బహిర్గతం చేయాలి. దీంతో నేడు ఈ పత్రాలను నేషనల్‌ ఆర్కీవ్స్‌ వెబ్‌సైట్లో విడుదల చేశారు. అయితే కొన్ని సున్నితమైన పత్రాలను ఇప్పుడే వెల్లడించొద్దని భద్రతా సంస్థలు ట్రంప్‌ను కోరాయి. దీంతో కొన్నింటిని విడుదల చేయలేదు. అయితే వీటిని సమీక్షించేందుకు భద్రతా సంస్థలకు ఆరు నెలల గడువు ఇచ్చారు. అంటే 2018 ఏప్రిల్‌ 26న మిగతా పత్రాలను కూడా బహిర్గతం చేయనుననట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ సారా శాండర్స్‌ తెలిపారు. అయితే త్వరలోనే కెనెడీ హత్య కేసు మిస్టరీ వీడుతుందుని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com