అందుబాటులోకి 'డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌' ఫీచర్‌

- October 27, 2017 , by Maagulf
అందుబాటులోకి 'డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌' ఫీచర్‌

ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్‌లో పొరపాటున మనం ఎవరికైనా సందేశం పంపితే దాన్ని తొలగించే అవకాశం లేదు. దీన్ని వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మనం ఎవరికైనా పొరపాటున సందేశం పంపితే వెంటనే దాన్ని తొలగించుకునే వీలు కల్పించింది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ కొద్ది మందికి మాత్రమే వినియోగించుకునే వీలుంది.

మెస్సేజ్‌ రీకాల్‌ ఫీచర్‌ను దశల వారీగా అమలు చేస్తామని గతంలోనే వాట్సాప్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని ఖాతాలకు మాత్రమే దీనిని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ను కొత్త వెర్షన్‌తో అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. టెక్ట్స్‌ సందేశాలు, చిత్రాలు, జిఫ్‌ ఫైల్స్‌, వీడియోలు, కాంటాక్ట్‌లు ఇలా అన్నింటినీ ఈ ఫీచర్‌ ద్వారా రీకాల్‌ చేసుకోవచ్చు.

అయితే ఈ మెసేజ్‌లు రీకాల్‌ అవ్వాలంటే అవతలి వ్యక్తి కూడా తన వాట్సాప్‌ను కొత్త వెర్షన్‌తో అప్‌డేట్‌ చేసుకోవాలి. కేవలం వ్యక్తిగత సందేశాలకు మాత్రమే కాకుండా గ్రూప్‌లో పొరపాటున పెట్టిన సందేశాలను కూడా రీకాల్‌ చేసుకోవచ్చు. అయితే అవతలి వ్యక్తి ఆ సందేశాలను చదివేలోపు మాత్రమే వాటిని తొలగించే వీలుంటుంది. దీనితో పాటు పంపిన సందేశాలను ఎడిట్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా వాట్సాప్‌ అందిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది పనిచేయటం లేదని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com