న్యూజిలాండ్ పై టీమిండియాదే సిరీస్

- October 29, 2017 , by Maagulf
న్యూజిలాండ్ పై టీమిండియాదే సిరీస్

కాన్పూర్: న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకుంది. తొలి వన్డేలో కివీస్ విజయం సాధించగా, మిగతా రెండు వన్డేల్లో విరాట్ సేన గెలుపొంది సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇది భారత్‌కు వరుసగా ఏడో వన్డే సిరీస్ విజయం. 

ఆఖరి వన్డేలో భారత్ నిర్దేశించిన 338 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 331 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. చివరి వరకూ కివీస్ పోరాడినా గెలుపును మాత్రం అందుకోలేకపోయింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో గప్టిల్(10)నిరాశపరిచినా,  కొలిన్ మున్రో(75;62 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కేన్ విలియమ్సన్(64; 84 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో కివీస్ దీటుగా బదులిచ్చినట్లు కనిపించింది. అయితే ఈ జోడి 15 పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో కివీస్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ఆపై రాస్ టేలర్(39), టామ్ లాథమ్(65), నికోలస్‌(37) లు తమ వంతు ప్రయత్నం చేసినా జట్టును గెలిపించలేకపోయారు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన విరాట్ సేన 337 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ(147;138 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు) విరాట్ కోహ్లి(113; 106 బంతుల్లో9 ఫోర్లు, 1 సిక్స్)లు శతకాలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు చేసింది. 

ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధావన్(14) వికెట్ ను కోల్పోయిన్పటికీ, రోహిత్ శర్మ-కోహ్లిల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. మంచి బంతుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఈ జంట.. చెడ్డ బంతుల్ని మాత్రం బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును కదిలించింది. ఈ క్రమంలోనే రోహిత్ ముందుగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా,ఆపై కోహ్లి కూడా అర్థ శతకం సాధించాడు. ఆపై అదే ఊపును కొనసాగించిన వీరిద్దరూ శతకాలతో మెరిశారు.

ముందుగా రోహిత్ 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ చేయగా, అటు తరువాత కోహ్లి 96బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో శతకం సాధించాడు. ఈ జోడి రెండో వికెట్ 230 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తరువాత రోహిత్ రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ తన కెరీర్ లో 15వ వన్డే సెంచరీని పూర్తి చేసుకోగా, కోహ్లికి 32వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. మిగతా ఆటగాళ్లలో ఎంఎస్ ధోని(25;17 బంతుల్లో), కేదర్ జాదవ్( 18; 10 బంతుల్లో) లు ఫర్వాలేదనిపించడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో సాంత్నార్, సౌథీ, మిల్నేలకు  తలో రెండు వికెట్లు లభించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com