ఇండియా-ఇటలీ మధ్య ఉగ్రవాదంపై సమష్టిపోరుకు 6 ఒప్పందాలు

- October 30, 2017 , by Maagulf
ఇండియా-ఇటలీ మధ్య ఉగ్రవాదంపై సమష్టిపోరుకు 6 ఒప్పందాలు

ఇండియా-ఇటలీ ఉగ్రవాదంపై సమష్టిపోరుకు ప్రతినబూనాయి. ఇటలీ ప్రధాని పాలో జెన్టిలోనీ భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సోమవారంనాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఇరుదేశాల మధ్య 6 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇరుదేశాల మధ్య పెట్టుబడుల సహకారాన్ని మరింత విస్తృతం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. 12 మంది భారత, ఇటలీ వాణిజ్యవేత్తలు ఇందులో పాల్గొన్నారు. రైల్వే రంగంలో భద్రత, ఇంధనం రంగం, సాంస్కృతిక సహకారం, ఇటలీ ట్రేడ్ ఎజెన్సీ, ఇన్వెస్ట్ ఇండియా మధ్య పరస్పర పెట్టుబడులు వంటి ఆరు ఎంఓయూలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

అనంతరం జరిగిన సంయుక్త సమావేశంలో ఆ వివరాలను ఉభయనేతలూ వెల్లడించారు. భారత్, ఇటలీ మధ్య పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపై తాము ఈ సమావేశంలో వివరంగా చర్చించామని, ఉగ్రవాదం సమష్టి పోరు, సైబర్ సెక్యూరిటీకి ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. పర్యాటకం, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు మరింత విస్తృతం చేయాలని కూడా తాము నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

ఇటలీ ప్రధాని భారత్‌లో పర్యటించడం దశాబ్ద కాలం తర్వాత ఇదే ప్రథమం. చివరిసారిగా 2007 ఫిబ్రవరిలో రోమనో ప్రోడి ఇండియాలో పర్యటించారు. తాజాగా పాలో జెన్టిలోనీ తన భార్య, 15 మంది సభ్యుల ప్రతినిధి బృందంతో సోమవారం భారత్‌ పర్యటనకు విచ్చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన పాలో అనంతరం సతీసమేతంగా రాజ్‌ఘాట్‌లోని మహాత్ముని సమాధిని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com