కివీస్‌పై భారత్ తొలి ఘన విజయం

- November 01, 2017 , by Maagulf
కివీస్‌పై భారత్ తొలి ఘన విజయం

టెస్టుల్లో గెలుస్తోంది. వన్డేల్లో వణికిస్తోంది.  ఐపీఎల్‌తో రాటుదేలింది. కానీ... ఇంతటి ఘనమైన రికార్డు ఉన్న భారత్‌.. న్యూజిలాండ్‌పై టి20ల్లో గెలవలేకపోయింది. కివీస్‌తో ఆడిన ఐదుసార్లూ టీమిండియా ఓడింది. ఇందులో రెండు సొంతగడ్డపై ఆడినా... ఫలితం మారలేదు. ఈ నేపథ్యంలో నేడు జరిగిన తొలి టీ20లో భారత్‌ ఎట్టకేలకు 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కివీస్‌పై ఉన్న చెత్త రికార్డు తుడిపేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన కోహ్లి సేన ఓపెనర్లు రోహిత్‌-శిఖర్‌ ధావన్‌ రికార్డు భాగస్వామ్యంతో కివీస్‌కు 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు.

భారీ లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన కివీస్‌ భారత్‌ బౌలర్లు విజృంభించడంతో కోలుకోలేకపోయింది. కివీస్‌ బ్యాట్స్‌మెన్లలో లాథమ్‌ (39), విలియమ్సన్‌(28) మినహా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చహల్‌, అక్సర్‌ పటేల్‌లకు రెండు, బుమ్రా, పాండ్యా, భువనేశ్వర్‌లకు తలొ వికెట్‌ దక్కింది. భారత్‌ బ్యాటింగ్‌లో  ఓపెనర్లు శిఖర్ ధావన్ (51 బంతుల్లో80: 9ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ(55 బంతుల్లో 80: 6 ఫోర్లు, 4 సిక్సర్లు ) హాఫ్ సెంచరీలు సాధించారు. చివర్లో కోహ్లీ (11 బంతుల్లో  26 నాటౌట్: 3 సిక్సర్లు)  రెండు బంతులాడిన ధోనీ(7 నాటౌట్) ఓ సిక్సర్‌తో మెరుపులు మెరిపించడంతో మూడు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.

నెహ్రాకు ఘన వీడ్కోలు
సీనియర్‌ పేసర్‌ నేహ్రాకు టీమిండియా ఘన విజయంతో వీడ్కోలు పలికింది. కానీ ఈ మ్యాచ్‌లో నేహ్రాకు వికెట్లు దక్కే అవకాశం ఉన్నా భారత ఫీల్డర్లు రెండు క్యాచులు చేజార్చడంతో నిరాశే మిగిలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com