తెలుగు రాష్ట్రాల్లో కార్తీకపౌర్ణమి...ఆలయాల్లో భక్తుల సందడి

- November 03, 2017 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో కార్తీకపౌర్ణమి...ఆలయాల్లో భక్తుల సందడి

కార్తీకపౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు క్యూకట్టారు. ఉదయాన్నే స్నానాలు ఆచరించి శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. కార్తీక దీపోత్సవంతో ఆలయాలన్నీ శోభాయమానంగా వెలిగిపోతున్నాయి.
కార్తీకపౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు సర్వ మంగళకరమాసం కార్తీకం. శివకేశవులకు ఇష్టమైన మాసంగా చెప్పుకునే కార్తీక మాసాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ నెలలో చంద్రుడు పూర్ణుడై కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడని అందునే దీనికి కార్తీక మాసం అనే పేరువచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక కార్తీక మాసం అనగానే ముందుగా చెప్పుకునేది దీపోత్సవం. ఈ మాసంలో దీపాలను వెలిగించడం అతి పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఇవాళ కార్తీక పౌర్ణమి కావడంతో తెల్లవారుజాము నుంచే శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే పౌర్ణమి గడియలు మొదలయ్యాయి.
దీంతో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కార్తీకశోభతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. శ్రీశైలంలో ఆలయ రాజగోపురం ముందు గంగాధర మండలం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలా తోరణోత్సవానికి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మహానంది క్షేత్రంలో కార్తీకశోభ సంతరించుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీకదామోదరుడికి దీపారాధనలు చేశారు. నిడదవోలులో చిన్నకాశీరేవు భక్తులతో కిటకిటలాడింది. గౌతమీనది పాయలో తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి సదాశివుడికి దీపారాధనలు చేశారు. ఆచంటలోని శ్రీరామేశ్వర ఆలయంలో అఖండ కార్తీక దీపారాధన ఘనంగా జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com