జనవరి 15 నే సంక్రాంతి పండుగ

- January 10, 2018 , by Maagulf
జనవరి 15 నే సంక్రాంతి పండుగ

ఇటీవల కాలంలో హిందూ పండుగలపై ఒక్కోక్కరు ఒక్కో తేదినీ పేర్కోవడంతో దేన్ని అనుసరించాలో తెలియక జనం తికమకపడుతున్నారు. తాజాగా సంక్రాంతి పండుగపై కూడా గందరగోళం నెలకుంది. జనవరి 14 నే సంక్రాంతి అని కొందరు, లేదు జనవరి 15 నే అని మరికొందరంటే, ఇంకొందరైతే ఏకంగా జనవరి 11 అని ప్రచారం చేశారు. దీనిపై తెలంగాణ విద్వత్సభ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 15 నే సంక్రాంతి పండుగ జరుపుకోవాలని వారు స్పష్టం చేశారు. 14 వ తేది రాత్రి 7.15 గంటలకు సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఆ మర్నాడే సంక్రాంతి జరుపుకోవాలని విద్వత్సభ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఏడాది కిందటే వంద మంది పంచాగకర్తలు కలిసి నిర్థిరించారని వారు తెలిపారు.

అంతేకాదు గురువారమే (జనవరి 11 న) సంక్రాంతి అని ప్రచారం చేయడం అర్థరహితమని విద్వత్సభ ప్రతినిధి వెంకటరమణ శర్మ మండిపడ్డారు. జనవరి 14 న భోగి, 15 న సంక్రాంతి, 16 న కనుమ అని శృంగేరీ పీఠాధిపతి, తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధాంతులు ఆమోదించినట్లు ఆయన తెలియజేశారు. దీని ప్రకారమే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పండుగ సెలవులను ప్రకటించాయని అన్నారు. సంక్రాంతిపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని విద్వత్సభ కార్యనిర్వాహక సభ్యులు బుధవారం కలిశారు. దీనిపై స్పందించిన ఆయన సంక్రాంతి పండుగ జనవరి 15 వ తేదిగా ప్రభుత్వం గుర్తించిందని రమణాచారి తెలియజేశారు. దీంతో సంక్రాంతిపై ఉన్న గందరగోళానికి ఆయన తెరదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com