మరో ఎదురుదెబ్బ...ఎయిర్ ఇండియాను కొనేవారే లేరా?
- April 10, 2018
అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్ ఇండియా అమ్మకం కోసం నిర్వహించతలపెట్టిన బిడ్డింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించిన నాలుగు రోజులకే మరో విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ కూడా ఈ బిడ్డింగ్‌లో పాల్గొనరాదని నిశ్చయించుకున్నది. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు జెట్ ఎయిర్‌వేస్ ఎన్నడూ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై ఆ సంస్థ యాజమాన్యం తమ భాగస్వాములైన ఎయిర్ ఫ్రాన్స్-కేఎల్‌ఎం, డెల్టా తదితర ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరిపింది. అయితే ప్రస్తుతం ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయాలన్న ప్రయత్నాలను విరమించుకోవాలని నిశ్చయించుకున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ ఆలోచనను మేము స్వాగతిస్తున్నాం. ఇది ఎంతో కీలకమైన నిర్ణయమే. కానీ ఇందుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మెమోరాండంలో పొందుపర్చిన నిబంధనలను పరిశీలించిన తర్వాత ఈ బిడ్డింగ్‌లో పాల్గొనరాదని మేము నిర్ణయించుకున్నాం అని జెట్ ఎయిర్‌వేస్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఎనిమిదేండ్ల తర్వాత 2015-16లో మళ్లీ లాభాల బాట పట్టిన జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుతం తన రుణ భారాన్ని, ఇంధనేతర ఖర్చులను తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న భారత విమానయాన మార్కెట్లో ఎయిర్ ఇండియా తన వాటాను క్రమంగా కోల్పోతున్న విషయం తెలిసిందే. మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టి ప్రయాణికులకు చౌక ధరకే విమానయాన సేవలను అందజేస్తున్న ప్రైవేటు సంస్థలు ఈ వాటాను చేజిక్కించుకుంటున్నాయి. దీంతో ఎయిర్ ఇండియా నష్టాల ఊబిలో కూరుకుపోయింది. 767 కోట్ల డాలర్ల (దాదాపు రూ.50 వేల కోట్ల) అప్పులతో సతమతమవుతున్న ఎయిర్ ఇండియాను ఆ భారం నుంచి గట్టెకించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 580 కోట్ల డాలర్లు (దాదాపు రూ.38 వేల కోట్లు) అందజేసింది. అయినప్పటికీ ఈ సంస్థను లాభాల బాట పట్టించేందుకు మరింత మూలధనం అవసరమవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాలను అమ్మేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో పాటు అందుకు సంబంధించిన బిడ్ డాక్యుమెంట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ బిడ్డింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ. ఎయిర్ ఇండియాకు చెందిన అంతర్జాతీయ మార్గాలపై మాత్రమే తమకు ఆసక్తి ఉన్నదని, అంతేతప్ప దేశీయ కార్యకలాపాల పట్ల తమకు ఎటువంటి ఆసక్తి లేదని ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఇండిగో మాదిరిగా జెట్ ఎయిర్‌వేస్ కూడా ఈ బిడ్డింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వానికి వరుసగా మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఎయిర్ ఇండియా ఉద్యోగుల ఆందోళన:
ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేయోచనను నిరసిస్తూ ఉద్యోగుల నిరసన వ్యక్తంచేశారు. మధ్యాహ్న భోజన సమయంలో ఎయిర్‌లైన్స్ కలిన కార్యాలయంలో సుమారు అర్ధగంటపాటు తమ నిరసన తెలిపారు. ప్రైవేట్ సంస్థల చేతికి అప్పగిస్తే తమ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం సంస్థలో పదివేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







