నేడు రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ..

- February 24, 2019 , by Maagulf
నేడు రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ..

రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా..కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో ప్రధాని మోదీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నేడు దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొంత మంది రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమకానున్నాయి.

ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏడాదికి 6 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రతిపాదించింది.ఈ స్కీం కోసం కేంద్ర బడ్జెట్‌లో 75 వేల కోట్లు కేటాయించింది. ఏడాదిలో మూడు విడతలుగా చెల్లించనున్న ఈ పథకంలో.తొలి విడత 2 వేల నగదును ఇవాళ కోటి మంది రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయబోతున్నారు. మరో కోటి మందికి రెండు, మూడు రోజుల్లో డబ్బులు అందుతాయని అధికారులు చెబుతున్నారు.

గతేడాది డిసెంబర్ నుంచే రైతులకు కిసాన్ సమ్మాన్ పథకం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో భాగంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా తొలి విడత కింద ఇవ్వాల్సిన 2 వేలు రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేయనుంది. మరోవైపు ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్ వివరాలను. పీఎం కిసాన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాయి.

పీఎం-కిసాన్‌ వెబ్‌సైట్‌లో మొత్తం కోటికిపైగా పైగా అర్హులైన రైతుల బ్యాంకు వివరాలు, ఆధార్‌ నెంబర్లను ఆప్‌లోడ్‌ చేశారు. మిగతా వివరాలను త్వరలోనే అప్‌లోడ్‌ చేయనున్నారు. మొదటి వాయిదా పొందేందుకు రైతులు ఆధార్ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదని. ఆ తర్వాత వాయిదాలు తీసుకోవాలంటే మాత్రం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అని కేంద్రం ప్రకటించింది. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా ఏపీ, తెలంగాణలో దాదాపు 50 లక్షల మందికిపైగా రైతులు లబ్ది పొందనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com