డేటా చోరీ కేసులో మరో మలుపు
- March 04, 2019
డేటా చోరీ కేసు మరో మలుపు తిరిగింది. హైకోర్టు జోక్యంతో పరిణామాలు మారిపోయాయి. నిన్న అదుపులోకి తీసుకున్న ఐటీ గ్రిడ్ ఇండియా సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను కాసేపట్లో బంధువులకు అప్పగించనున్నారు మాదాపూర్ పోలీసులు. దీంతో నిన్నంత కొనసాగిన ఉద్రిక్త పరిస్థితులు కాస్తా చల్లారే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్ కేంద్రంగా నిన్న రోజంతా జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఐటీ గ్రిడ్స్ ఇండియా సంస్థలోని నలుగురు ఉద్యోగులు చంద్రశేఖర్, భాస్కర్, ఫణీ, విక్రమ్ గౌడ్ కనిపించటం లేదంటూ సీఈవో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు. వెంటనే విచారణ జరపాలంటూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హౌస్ మోషన్ పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇవాళ ఉదయం పదిన్నరకు నలుగురిని కోర్టు ముందు హజరుపర్చాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఐతే.. ఈ లోపే ఉద్యోగుల్ని వారి బంధువులకు అప్పగిస్తున్నారు మాదాపూర్ పోలీసులు.
నిన్న హౌస్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. కేసు డైరీలో బాధితుల నుంచి సంతకాలు తీసుకుని నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్న కాగితాలతోపాటు సంతకాలున్న ఖాళీ కాగితాలుండటంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఖాళీ కాగితాల్లో సంతకాలేమిటని ప్రశ్నించింది. అయితే అవి రెవెన్యూ అధికారి సంతకాలని ప్రభుత్వ న్యాయవాది సమాధానమిచ్చారు. సాధారణంగా సోదాలు నిర్వహించినపుడుగానీ… వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్నపుడు గానీ.. పంచనామా పూర్తయ్యాక రెవెన్యూ అధికారితో సంతకం తీసుకుంటారని.. ఇక్కడ ముందుగానే తెల్ల కాగితాల్లో సంతకాలు తీసుకోవడం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. వీటన్నింటినీ చూస్తే ఆ నలుగురూ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు అనిపిస్తోందని తెలిపింది.ఏ పౌరుడినీ కారణం లేకుండా నిర్బంధంలోకి తీసుకోరాదని వ్యాఖ్యానించింది.ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు…నలుగురిని కుటుంబ సభ్యులను అప్పగించబోతుండడం చర్చనీయాంశంగా మారింది.
డేటా చోరీ వ్యవహారంలో హైదరాబాద్ కేంద్రంగా నిన్నంత హైడ్రామా నడిచింది. టీడీపీకి ఐటీ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఓటర్ల డేటా చోరీ చేసిందంటూ వైసీపీ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మాదాపూర్‌లో సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సైబరాబాద్ పోలీసులు..కొన్ని హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. సంస్థకు చెందిన నలుగురు ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి ఐటీ సేవలందిస్తున్న సేవామిత్ర మొబైల్ యాప్‌లో ఏపీకి చెందిన 3 కోట్ల మంది ఓటర్ల జాబితా ఉందన్నది వైసీపీ ఆరోపణ. ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టీడీపీ యాప్ తయారుచేసి ఇచ్చిందని.. దీనిలో ఓటర్లు, వారి ఆధార్ కార్డుల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం ఉందని కూడా వైసీపీ ఆరోపిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







