అత్యంత వైభవంగా జరిగిన రాములోరి కళ్యాణం..

- April 14, 2019 , by Maagulf
అత్యంత వైభవంగా జరిగిన రాములోరి కళ్యాణం..

భద్రాచలం:భద్రాద్రి భక్తజనాద్రిగా మారింది. భూదేవంత అరుగు మీద, ఆకాశమంత పందిరిలో జగదభిరాముడి జగత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శిల్పకళా శోభితమైన మిథిలానగరం కళ్యాణ మండపంలో రామయ్య సుగుణాల రాశి సీతమ్మను పరిణయమాడారు. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

శ్రీరామ నవమి సందర్భంగా దక్షిణాది అయోధ్య భద్రాచలం సప్తవర్ణ శోభితమై మెరిసిపోయింది. శిల్పకళా శోభితమైన మిథిలానగరం కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య దశరథ తనయుడు శ్రీరాముడు.. జనక మహారాజు కుమార్తె సీతమ్మను వివాహమాడారు. శ్రీ సీతారాముల కల్యాణాన్ని కళ్లారా వీక్షించడానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

కల్యాణ క్రతువులో ఒక్కో ఘట్టాన్ని వివరిస్తూ అర్చక పండితులు రాముల వారి వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు. తొలుత ఆలయంలో ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించిన తర్వాత.. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా సీతారాములు పల్లకీలో కల్యాణ మండపానికి వేంచేశారు. వేదపండితులు తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వవిజ్ఞాన శాంతికి విష్వక్సేనుని పూజించారు.

మంత్రోచ్చారణలతో మధ్య యజ్ఞోపవేతధారణ జరిగింది. పండితులు రాములవారికి సాధారణ యజ్ఞోపవేతంతో పాటు బంగారుయజ్ఞోపవేతధారణ గావించారు.

రాములోరి కళ్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు.

అశేష భక్తజనం రామనామం జపిస్తుండగా… వేదపండితులు సీతమ్మవారికి మాంగల్యధారణ గావించారు. మంగళసూత్రంలో సాధారణంగా రెండు పతకాలు ఉంటాయి. కానీ ఇక్కడ భక్త రామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి ధరింపజేయడం ఈ క్షేత్ర ఆచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com