యూఏఈ: తెలుగింటి ఆడపడుచుల 'ఆవకాయ' వర్క్ షాప్

- May 07, 2019 , by Maagulf
యూఏఈ: తెలుగింటి ఆడపడుచుల 'ఆవకాయ' వర్క్ షాప్

యూఏఈ లో ఉన్న తెలుగు వనితలు 15 మంది ఆవకాయ వర్క్ షాప్ ఏర్పాటు చేసుకుని పలురకాల మామిడికాయ ఊరగాయలు నేర్చుకుని పెట్టుకోవడం విశేషం. మన దేశం దాటి వచ్చాక అమ్మల చేతనో అత్తగార్ల చేతనో పెట్టించుకున్న ఊరగాయలు ప్యాక్ చేయించుకోవడమే కాని మన ఊరిలో మనవారితో కలిసి వేసవిలో ఒక వేడుకలా చేసుకునే ఆవకాయ పెట్టే అవకాశం కోల్పోతున్నామని భావించి శ్రీమతి వసంతలక్ష్మీ ప్రస్తావించగా, నేర్చుకోవాలని ఉందని 15 మంది వనితలు సంకల్పించారు. ఎవరికి వారు విడివిడిగా కాకుండా అక్కాచెల్లెళ్ళలాగా కలిసి ఆవకాయ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.

కావలసిన సామగ్రి కొనుగోలు చేసుకుని షార్జా వాస్తవ్యులైన శ్రీమతి లక్ష్మీ కామేశ్వరి ఇంట మే 4, 2019న అందరు సమావేశమయ్యారు. రకరకాల ఊరగాయలలో నేర్పరి అయిన శ్రీమతి లక్ష్మీ పణ్యాల సూచనలతో వారి ఆధ్వర్యంలో 4-5 రకాల ఆవకాయలు పెట్టుకున్నారు.

రెడిమేడ్ ఆవకాయలు దొరుకుతున్నాయని మన పెద్దలనుండి ఊరగాయలు పెట్టే కళ ఈ తరం వారు నేర్చుకుని ప్రతి ఏటా స్వయంగా ఆవకాయలు పెట్టుకోకపోతే మున్ముందు తరాలకి ఈ విద్య అసలు రాకుండపోయే ప్రమాదముంది. యూట్యూబ్ విడియోలు చూసి పెట్టుకోవడం సుళువే అయినా కుటుంబంతో కలిసి ఊరగాయలు పెట్టుకునే ఆనందమే వేరు. వేరే దేశాలలోనే పుట్టి పెరుగుతున్న నవతరంకి ఇదంతా తెలియాలంటే ముందు మనం కలిసి ఆవకాయ పెట్టుకోవడం మొదలు పెట్టాలి అని శ్రీమతి వసంతలక్ష్మీ భావించారు. స్నేహితురాళ్ళతో కలిసి ఆవకాయ పెట్టుకుని ఆ అనుభవం ఆనందం పొందాము అని పాల్గొన్న వనితలు హర్షం వ్యక్తపరిచారు. ఈ సారి మా అమ్మకి/అత్తకి మేమే అవకాయలు పెట్టి ఇస్తాము అని అన్నారు.

పరాయి దేశంలో ఉన్నా మన సంప్రదాయాలని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న ఈ తెలుగు వనితలు అభినందనీయులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com